ఆ నటిపై డైరెక్టర్‌ మండిపాటు వెనుక మర్మమిదే? | Sakshi
Sakshi News home page

ఆ నటిపై డైరెక్టర్‌ మండిపాటు వెనుక మర్మమిదే?

Published Tue, Mar 7 2017 4:30 PM

ఆ నటిపై డైరెక్టర్‌ మండిపాటు వెనుక మర్మమిదే?

అనూహ్యంగా బాలీవుడ్‌ టాప్‌ దర్శకుడు కరణ్‌ జోహార్‌ నటి కంగనా రనౌత్‌పై విరుచుకుపడ్డాడు. తరచూ తనను తాను బాధితగా చెప్పుకుంటూ సానుభూతి పొందేందుకు కంగన ప్రయత్నిస్తున్నదని తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. చిత్రపరిశ్రమ అంత చెడ్డదిగా అనిపించినప్పుడు.. పరిశ్రమ విడిచి వెళ్లిపోవచ్చుగా అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చాడు.

అంతకుముందు కాఫీ విత్‌ కరణ్‌ టీవీషోలో ఆయనపై కంగన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కరణ్‌కు ఆశ్రిత పక్షపాతం ఎక్కువని, సినీ మాఫియాను ఆయన నడిపిస్తున్నారని కంగన విమర్శించింది. ఈ విమర్శలకు బదులుగానే కరణ్‌ ఇంత ఘాటుగా విరుచుకుపడ్డట్టు అందరూ భావించారు. అయితే, కంగనపై కరణ్‌ ఆగ్రహం వెనుక మర్మం వేరే ఉందని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. కరణ్‌ జోహార్‌ తాజాగా హృతిక్‌ రోషన్‌తో సినిమా తీసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడట.

తాను ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ ప్రాజెక్టులో నటించేలా హృతిక్‌ను మచ్చిక చేసుకునేందుకే కరణ్‌ ఇంత బాహాటంగా విమర్శలు చేసినట్టు తెలుస్తోంది. కంగన-హృతిక్‌ ఎఫైర్‌ బయటపడటం.. ఇద్దరి మధ్య దారుణమైన రీతిలో న్యాయవివాదం కొనసాగడం తెలిసిందే. ఈ న్యాయవివాదం ముగిసినా.. హృతిక్‌-కంగన మధ్య కోల్డ్‌వార్‌ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాను హృతిక్‌వైపే ఉన్నానని చాటుకునేందుకు కరణ్‌ ఇలా గొంతు విప్పాడని, వేదిక కాని వేదిక మీద ఆమెపై విమర్శలు చేశాడని సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ 'ముంబై మిర్రర్‌' ఓ కథనాన్ని ప్రచురించింది.
 

Advertisement
Advertisement