Sakshi News home page

జియో 'హ్యాపీ న్యూయర్'కి మరో ట్రబుల్...

Published Tue, Feb 7 2017 3:05 PM

జియో 'హ్యాపీ న్యూయర్'కి మరో ట్రబుల్...

ముంబై : టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న హ్యాపీ న్యూయర్ టారిఫ్ ప్లాన్లకు మరో చిక్కు వచ్చి పడింది. హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద జియో అందిస్తున్న సేవలు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయంటూ క్లీన్ చీట్ ఇచ్చిన వెంటనే ట్రాయ్పై టెలికాం దిగ్గజాలు ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్లు పోరాటానికి దిగాయి. టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పీలెంట్ ట్రిబ్యునల్(టీడీశాట్) వద్ద ట్రాయ్పై ఫిర్యాదు దాఖలు చేశాయి. టెలికాం దిగ్గజాల ఫిర్యాదు మేరకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అందిస్తున్న ఉచిత వాయిస్, డేటా సర్వీసులపై వివరణ ఇవ్వాలని ట్రిబ్యునల్, రెగ్యులేటరీని ఆదేశించింది.  జియో ప్రకటించిన వెల్ కమ్ ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్.. రెండూ వేర్వేరు అని ట్రాయ్ గతవారమే తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.
 
అయితే అవి ఎలా వేర్వేరో తెలుపుతూ ఫిబ్రవరి 15లోపు క్లారిఫికేషన్ ఇవ్వాలని ట్రాయ్ని ట్రిబ్యునల్ ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 20కు వాయిదా వేసింది. టీడీశాట్ వద్ద ఫిర్యాదు దాఖలు చేసిన ఎయిర్టెల్, ఐడియాలు ఉచిత కాల్స్, డేటా సర్వీసులు అందిస్తున్న ప్రమోషనల్ ఆఫర్నే పేరు మార్చి వినియోగదారులకు అందించడానికి జియోకు రెగ్యులేటరీ అనుమతించిందని ఆరోపిస్తున్నాయి. నిర్దేశిత 90 రోజులను కూడా అధిగమించి  జియో 2017 మార్చి దాకా ఉచిత వాయిస్, డేటా ఆఫర్లను అందించడం నిబంధనలకు విరుద్ధమంటూ పేర్కొన్నాయి. ట్రాయ్ టెలికాం టారిఫ్ ఆర్డర్లను జియో ఉల్లంఘిస్తుందని చెప్పాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement