నాపై రౌడీషీట్ ఎత్తేయండి! | Sakshi
Sakshi News home page

నాపై రౌడీషీట్ ఎత్తేయండి!

Published Mon, Sep 19 2016 2:04 AM

నాపై రౌడీషీట్ ఎత్తేయండి! - Sakshi

- ప్రభుత్వానికి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వినతి
- పరిశీలించాలంటూ జిల్లా పోలీసులకు ప్రభుత్వ ఆదేశం
- త్వరలో రౌడీషీట్ ఎత్తేసేందుకు రంగం సిద్ధం!
 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: తనపై ఉన్న రౌడీషీట్ ఎత్తివేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కోరారు. ఆయన స్వయంగా సీఎం చంద్రబాబును కలసి ఈ మేరకు విన్నవించుకున్నట్టు తెలుస్తోంది. ఆయన వినతిని పరిశీలించాలంటూ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. భూమాపై రౌడీషీట్ ఎత్తివేయడంపై జిల్లా పోలీస్ యంత్రాంగం తన అభిప్రాయాల్ని మరికొన్ని రోజుల్లో ప్రభుత్వానికి పంపనున్నట్టు తెలిసింది. వైఎస్సార్‌సీపీ నుంచి అధికారపార్టీలో చేరిన తర్వాత భూమాపై ఉన్న రౌడీషీట్‌ను ఎత్తివేసేందుకు పావులు కదపడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష పార్టీలో ఉంటే కేసుల్ని నమోదు చేస్తారని, అధికారపార్టీలో చేరితే అవే కేసుల్ని ఎత్తివేస్తారనే భావన ప్రజల్లో బలంగా నెలకొనే ప్రమాదముందనే ఆందోళన అధికారపార్టీలోని నేతల్లోనే వ్యక్తమవుతుండడం గమనార్హం.

 కేసు నేపథ్యమిదీ..: నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశాన్ని 2014, అక్టోబర్ 31న నిర్వహించారు. చివర్లో రోడ్ల విస్తరణపై భూమా నాగిరెడ్డి మాట్లాడుతుండగా.. సమావేశం ముగిసిందంటూ అధికారపార్టీకి చెందిన చైర్‌పర్సన్ దేశం సులోచన బెల్‌కొట్టారు. ఇది ఇరువర్గాలమధ్య దాడులదాకా వెళ్లింది. మాజీమంత్రి శిల్పామోహన్‌రెడ్డి వర్గానికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు గాయపడ్డారు. చైర్‌పర్సన్ చాంబర్ అద్దాలు పగిలిపోయాయి.

గాయపడిన కౌన్సిలర్లను సమావేశం ముగిశాక మునిసిపల్ వైస్‌చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్ పరామర్శించి వస్తుండగా హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనల గురించి మాజీ మంత్రులు శిల్పామోహన్‌రెడ్డి, ఫరూక్‌లు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో అదేరోజు  ఫిర్యాదు చేశారు. దీనిపై దళిత కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్‌ను అవమానించారంటూ అట్రాసిటీ కేసు, గంగిశెట్టి విజయ్‌కుమార్‌పై హత్యాయత్నానికి కుట్రపన్నినట్టు భూమాపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. వెంటనే రాత్రిసమయంలో ఆయన్ను అరెస్ట్ చేసి విచారించారు. మరుసటిరోజు భూమా, ఆయన అనుచరులైన ఏడుగురు కౌన్సిలర్లతోపాటు ఏవీఆర్ ప్రసాద్‌లపై  రౌడీషీట్ నమోదైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement