డిపాజిట్ రేట్లు తగ్గించం | Sakshi
Sakshi News home page

డిపాజిట్ రేట్లు తగ్గించం

Published Fri, Dec 20 2013 12:41 AM

C. V. R. Rajendran

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిపాజిట్ల సేకరణ కష్టంగా ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించే ఆలోచన లేదని ఆంధ్రాబ్యాంక్ స్పష్టం చేసింది. ఇప్పుడు డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గిస్తే కొత్త డిపాజిట్లను సేకరించలేమని ఆంధ్రాబ్యాంక్‌కి కొత్తగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సి.వి.ఆర్. రాజేంద్రన్ స్పష్టం చేశారు. ఆర్‌బీఐ కీలక రేట్లను యథాతథంగా ఉంచడంతో డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించడం లేదని ఇదే సమయంలో రుణాలపై వడ్డీరేట్లను పెంచే ఆలోచన లేదని ‘సాక్షి’తో అన్నారు. ఇప్పటికే ఆంధ్రాబ్యాంక్ రిటైల్ రుణాలపై వడ్డీరేట్లను బాగా తగ్గించడంతో ప్రస్తుతం రుణాలపై వడ్డీరేట్లు కూడా తగ్గే అవకాశం లేదని, గతంలో వడ్డీరేట్లు పెంచిన కొన్ని బ్యాంకులు మాత్రమే ఇప్పుడు రుణాలపై వడ్డీరేట్లు తగ్గిస్తామన్న సంకేతాలు ఇస్తున్నాయన్నారు.

అంతకుముందు ఆయన సీఐఐ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌పై ఏర్పాటు చేసిన ‘ఎస్టేట్ సౌత్ 2013’ రెండు రోజుల సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా  విలేకరులతో రాజేంద్రన్ మాట్లాడుతూ ఈ త్రైమాసికంతో పాటు మరో 3 నెలలు బ్యాంకింగ్ రంగం ఎన్‌పీఏల బెడదను ఎదుర్కొంటుందన్నారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టి కొద్ది రోజులే కావడంతో బ్యాంకు పరిస్థితి అధ్యయనానికి కొంత వ్యవధి పడుతుందని, ఆతర్వాతే అనుసరించాల్సిన వ్యూహంపై స్పష్టత వస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
 చిన్న ఇళ్లపై దృష్టిపెట్టండి
 తక్కువ ధరలో సామాన్యులకు అందుబాటులో ఉండే ఇళ్లకు మంచి డిమాండ్ ఉందని, ఈ రంగంపై రియల్ ఎస్టేట్ సంస్థలు దృష్టిసారించాల్సిందిగా రాజేంద్రన్ కోరారు. ఖరీదైన ఇల్లకంటే అఫర్డబుల్ హౌసింగ్ మార్కెట్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. సాధ్యమైనంత వరకు నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవాలని, పన్నుల భారం తగ్గించుకునే విధంగా అవసరమైతే రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రభుత్వం వద్ద లాబీయింగ్ చేసుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక మూలధనం అవసరమైన ఈ రంగంలోకి పెన్షన్ నిధులు వచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మంజీరా కన్‌స్ట్రక్షన్స్ సీఎండీ జి.యోగానంద్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రియల్టీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement