హర్యానాలో వాద్రా భూదందా | Sakshi
Sakshi News home page

హర్యానాలో వాద్రా భూదందా

Published Sun, Aug 11 2013 1:12 AM

హర్యానాలో వాద్రా భూదందా - Sakshi

చండీగఢ్: కాంగ్రెస్ అధినేత్రి అల్లుడు రాబర్ట్ వాద్రాపై భూ కుంభకోణం ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంలో వాటిని బయటపెట్టి సంచలనం సృష్టించిన హర్యానా క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా ఈసారి మరిన్ని బాంబులు పేల్చారు. హర్యానాలో గత ఎనిమిదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏకంగా రూ.3.5 లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణాలు జరిగాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ‘‘2005 నుంచి 2012 మధ్య భూపీందర్‌సింగ్ హయాంలో 21,366 ఎకరాల విస్తీర్ణంలో వెలిసిన పలు కాలనీలకు లెసైన్సుల జారీ ముసుగులో ఈ బాగోతాలన్నీ చోటుచేసుకున్నాయి. ఈ కుంభకోణాల్లో భారీగా అనుచిత లబ్ధి పొందిన వారి జాబితాలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కూడా ఉన్నారు. తప్పుడు డాక్యుమెంట్లు, బూటకపు లావాదేవీల ఆధారంగా గుర్గావ్ జిల్లా శిఖోపూర్ గ్రామంలో 2.7 ఎకరాల అతి విలువైన భూమిని వాద్రా చేజిక్కించుకున్నారు.
 
 దానికి లెసైన్సును కూడా అదే మార్గంలో సంపాదించి భారీగా అనుచిత లబ్ధి పొందారు.’’ అని ఖేమ్కా వివరించారు. ఈ విషయంలో వాద్రాకు హర్యానా సర్కారు అన్నివిధాలా సహకరించిందని, పైగా అందుకోసం అన్ని నియమ నిబంధనలనూ తుంగలో తొక్కిందని కూడా పేర్కొన్నారు. ఈ మేరకు హర్యానా ప్రభుత్వానికి గత మే 21న ఖేమ్కా సమర్పించిన వివరణలోని అంశాలు తాజాగా వెల్లడై సంచలనం సృష్టిస్తున్నాయి. డీఎల్‌ఎఫ్‌తో వద్రా కంపెనీ కుదుర్చుకున్న రూ.58 కోట్ల విలువైన భూ ఒప్పందాన్ని 2012 అక్టోబర్‌లో ఖేమ్కా రద్దు చేయడం, దానిపై విచారణకు కూడా ఆదేశించడం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ ఉదంతం అంతిమంగా ఆయన బదిలీకి దారితీసింది. దీనిపై హర్యానా ప్రభుత్వం నియమించిన ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ ఖేమ్కా నిర్ణయాలను పూర్తిగా తప్పుబట్టింది.
 
 పైగా డీఎల్‌ఎఫ్-వాద్రా ఒప్పందంపై విచారణకు ఆదేశించి అధికారం కూడా ఆయనకు లేదని కూడా ఇటీవలే తేల్చింది. వాటిని సవాలు చేస్తూ ఖేమ్కా 100 పేజీల వివరణను కమిటీకి సమర్పించారు. భూ ఒప్పందానికి ఆధారాలుగా చెక్కుతో సహా వాద్రా సమర్పించిన డాక్యుమెంట్లన్నీ నకిలీవేనని అందులో స్పష్టం చేశారు. ‘‘వాటి ఆధారంగా వాద్రా చేజిక్కించుకున్న భూముల సగటు మార్కెట్ విలువే ఎకరాకు రూ.15.78 కోట్లు. ఆ లెక్కన గత ఎనిమిదేళ్లలో చోటుచేసుకున్న భూముల లెసైన్సింగ్ కుంభకోణం విలువ కనీసం రూ.3.5 లక్షల కోట్లుంటుంది. పోనీ ఎకరాకు హీనపక్షం రూ.కోటి లెక్కన చూసినా ఇది ఏకంగా రూ.20 వేల కోట్ల కుంభకోణం’’ అని వివరించారు. వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు తోడు దొంగలుగా మారి ప్రజా ధనాన్ని ఇలా భారీగా లూటీ చేశారంటూ దుమ్మెత్తిపోశారు. ‘‘ఆశ్రీత పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చేందుకు ఇలా లెసైన్సుల అమ్మకమనే మార్గాన్ని ఎంచుకున్నారు. వాటిని వేలం వేస్తే ప్రతి కాలనీ లెసైన్సుకూ దక్కే గరిష్ట ప్రీమియం ధర ద్వారా ఖజానాకు భారీ ఆదాయం సమకూరేది.
 
 
 అలాకాకుండా వేలాది కోట్ల విలువ చేసే భూములను దొంగ రియల్టీ కంపెనీలకు కట్టబెట్టారు. ఈ కంపెనీలన్నీ సదరు భూములను బడా బాబులకు దోచిపెట్టేందుకు పుట్టుకొచ్చిన ముసుగులు మాత్రమే’’ అని ఖేమ్కా వివరించారు. వీటన్నింటిపై కిమ్రినల్ విచారణకు తాను చేసిన సిఫార్సులను రెవెన్యూ శాఖ తొక్కిపెట్టిందని ఆరోపించారు. ఖేమ్కా ఆరోపణలపై లోతుగా విచారణ జరిపించాలని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ డిమాండ్ చేశారు. అయితే వాటిని కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఎన్నికల వేళ ఈ వివాదం తెరపైకి రావడం వెనక బీజేపీ హస్తమే ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ ప్రత్యారోపణలు చేశారు. సీఎం హుడా కూడా ఖేమ్కా ఆరోపణలను తోసిపుచ్చారు. తాము ఏ పార్టీకీ అనుచిత లబ్ధి చేకూర్చలేదన్నారు.

Advertisement
Advertisement