పంజాబ్, హరియాణాల్లో హైఅలర్ట్‌ | Sakshi
Sakshi News home page

పంజాబ్, హరియాణాల్లో హైఅలర్ట్‌

Published Thu, Aug 24 2017 1:44 AM

పంజాబ్, హరియాణాల్లో హైఅలర్ట్‌ - Sakshi

‘రాక్‌స్టార్‌ బాబా’ లైంగిక వేధింపుల కేసులో రేపే తీర్పు
వేల సంఖ్యలో పంచకులకు చేరుకుంటున్న మద్దతుదారులు


చంఢీగఢ్‌: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్, రాక్‌స్టార్‌గా పేరొందిన గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసులో సీబీఐ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. దీంతో ఆయన మద్దతుదారులు వేల సంఖ్యలో పంచకులకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. ఇరు రాష్ట్రాల్లో 144 సెక్షన్‌ విధించారు. ఇప్పటికే 35 వేల మంది వరకు గుర్మీత్‌ మద్దతుదారులు పంచకుల బాబా ప్రార్థనా స్థలం నామ్‌ చర్చా ఘర్‌కు చేరుకున్నారు. రానున్న రెండు రోజుల్లో లక్ష మంది వరకు మద్దతుదారులు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్, హరియాణాల్లో భారీగా భద్రతా చర్యలు చేపట్టారు.

 వేల సంఖ్యలో పోలీసులు, భద్రతా దళాలను మోహరించారు. ముందుజాగ్రత్తగా గురు, శుక్రవారాల్లో పంచకులలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. పంచకులలోని జిల్లా కోర్టుకు వెళ్లే అన్ని మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. శుక్రవారం కోర్టు ముందుకు గుర్మీత్‌ బాబా కూడా హాజరవనున్నారు. తీర్పు నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశముందని నిఘావర్గాలు సైతం హెచ్చరించాయి. పంజాబ్‌కి ఇప్పటికే 75 కంపెనీల కేంద్ర బలగాలు చేరుకున్నాయి. అవాం ఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్‌ల సహాయంతో నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

తాత్కాలిక జైలుగా క్రికెట్‌ స్టేడియం
చంఢీగఢ్‌లోని క్రికెట్‌ స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా మార్చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే అనుమానం వచ్చిన ప్రతిఒక్కరిని శుక్రవారం ఆ క్రికెట్‌ స్టేడియంలో ఉంచాలని చంఢీగఢ్‌ పరిపాలన విభాగం నిర్ణయించింది. 2002లో ఇద్దరు శిష్యురాళ్లను లైంగికంగా వేధించినట్లు గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Advertisement
Advertisement