లండన్‌లో రూ.1860 కోట్ల దోపిడీ | Sakshi
Sakshi News home page

లండన్‌లో రూ.1860 కోట్ల దోపిడీ

Published Wed, Apr 8 2015 4:58 PM

లండన్‌లో రూ.1860 కోట్ల దోపిడీ

లండన్ నగరంలోని ప్రతిష్ఠాత్మకమైన హాటన్ గార్డెన్స్ సేఫ్ డిపాజిట్ లిమిటెడ్ బ్యాంకులో దొంగలు పడి దాదాపు 1860 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, నగలను ఎత్తుకుపోయారు. ఈస్టర్ సెలవుల ద్వారా కలిసొచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని దొంగలు గత గురువారమే బ్యాంకులో పైకప్పును కట్‌ చేసి లోపల జొరబడ్డారని, బ్యాంకులో మొత్తం 600 సేఫ్ డిపాజిట్ లాకర్ బాక్సులుండగా వాటిలో 300 బాక్సులను తెరచి వాటిలోని వజ్రాలు, నగలు, నగదును దోచుకొని ఉడాయించారని నగర పోలీసులు తెలిపారు.

లాకర్ బాక్సులను తెరవడానికి దొంగలు అత్యాధునిక కటింగ్ యంత్రాలను ఉపయోగించారని వారు చెప్పారు. గత గురువారం సాయంత్రం నుంచి బ్యాంకు సిబ్బంది సెలవులపై వెళ్లి మంగళవారమే తిరిగి విధులకు రావడంతో ఈ దోపిడీ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. బ్యాంకులోని అలారం వ్యవస్థ శుక్రవారం మధ్యాహ్నం నుంచి పనిచేయకుండా పోయిందని, బహుశా అప్పుడే దొంగలు లాకర్లను తెరవడానికి కటింగ్ యంత్రాలను ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

దొంగలు ఎత్తుకుపోయిన వాటిలో 50 లక్షల రూపాయల విలువైన వజ్రం కూడా ఉన్నట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. మంగళవారం నాడు ఈ చోరీ గురించి తెలిసి బాధిత ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకొని బ్యాంకు అధికారులతో గొడవకు దిగారు. ఆదాయం పన్ను సమస్యలు వస్తాయన్న భయంతో చాలా మంది ఖాతాదారులు  ఎంత సొమ్ము పోయిందో పోలీసులకు వెల్లడించేందుకు వెనుకాడుతున్నారు. దాదాపు 2 వేల కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, నగలను దొంగలు ఎత్తుకుపోయి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. అలారం వ్యవస్థను ఎప్పటికప్పుడు ఎందుకు చెక్ చేయలేదని డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డును పోలీసులు ప్రశ్నించగా, తనకు చాలా తక్కువ జీతం ఇస్తున్నారని, అందుకే తానా విషయాన్ని సీరియస్‌గా పట్టించుకోలేదని చెప్పాడట!

కొంతమంది బ్యాంకు ఉద్యోగులు దొంగలతో కుమ్మక్కై ఉంటారని, లేకపోతే ఈ దొంగతనం గుట్టు చప్పుడు కాకుండా ఎలా సాధ్యమవుతుందని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులోని సీసీటీవీ కెమేరాల ఫుటేజ్‌ని కూడా దొంగలు ఎత్తుకుపోయినట్టు తెలుస్తోంది. 2003లో కూడా ఈ బ్యాంకులో దొంగతనం జరిగింది.

Advertisement
Advertisement