రూ. 457 కోట్ల నల్లా బిల్లు బకాయిలు మాఫీ

6 Jan, 2016 02:57 IST|Sakshi

* గ్రేటర్‌లో 3,12,468 పేద కుటుంబాలకు లబ్ధి
* ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికలవేళ పేదలపై రాష్ట్ర ప్రభుత్వం వరాలు కురిపించింది. గ్రేటర్ పరిధిలోని మురికివాడలు, రాజీవ్ గృహకల్ప నివాస సముదాయాల్లో నివసిస్తున్నవారు, గృహ వినియోగదారుల నీటి బిల్లుల బకాయిలను మాఫీ చేసింది. పేదలకు సంబంధించి రూ. 457.75 కోట్ల పెండింగ్ నల్లా బిల్లు బకాయిలను మాఫీ చేస్తూ మంగళవారం మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది.

ఈ ఉత్తర్వులతో గ్రేటర్ పరిధిలో 3,12,468 పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇందులో మురికివాడలకు చెందిన 68,261 కుటుంబాలు, రాజీవ్ గృహకల్ప సముదాయాల్లో నివసిస్తున్న 8,563 కుటుంబాలు, గృహ వినియోగ కేటగిరీ కింద 2,35,644 అల్పాదాయ, మధ్యాదాయ కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. 2015 నవంబర్ నాటికి మొత్తం నల్లా బిల్లు బకాయిలురూ. 299.52 కోట్లు కాగా.. దీనిపై కొన్నేళ్లుగా విధించిన వడ్డీ రూ.158.18 కోట్లుగా ఉంది.బకాయిలతో పాటు ఈ వడ్డీ మొత్తాన్నీ ప్రభుత్వం మాఫీ చేయడం గమనార్హం. తాజా ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలని ప్రభుత్వం జలమండలి  ఎండీని ఆదేశించడంతో పేదలకు ఉపశమనం లభించింది. కాగా, జలమండలి పరిధిలో మొత్తం 8.46 లక్షల నల్లా కనెక్షన్లుండగా.. మాఫీతో 3,12,468 మందికి లబ్ధి చేకూరనుంది. అత్యధికంగా పాతనగరంలో రూ. 3 వేల నుంచి రూ.50 వేల వరకు బకాయి పడిన వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా