కేంద్రాన్ని ఆరెస్సెస్ నడపడం లేదు | Sakshi
Sakshi News home page

కేంద్రాన్ని ఆరెస్సెస్ నడపడం లేదు

Published Mon, Oct 24 2016 2:40 AM

కేంద్రాన్ని ఆరెస్సెస్ నడపడం లేదు

ఆరెస్సెస్ అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి బాగయ్య
సాక్షి, మేడ్చల్: కేంద్ర ప్రభుత్వాన్ని ఆరెస్సెస్ నడుపుతోందంటూ కొందరు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆరెస్సెస్ అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి బాగయ్య స్పష్టంచేశారు. తాము ప్రజా సమస్యలను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రామ మందిర నిర్మాణ అంశాన్ని చర్చించడం లేదని చెప్పారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో దళిత, గిరిజనులను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఆరెస్సెస్ పనిచేస్తోందని చెప్పారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడలో ఆదివారం ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉదయం 8.30 గంటలకు సమావేశాలను ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భేటీ అనంతరం బాగయ్య ఆరెస్సెస్ ప్రచార్ ప్రముఖ్ మన్మోహన్ వైద్యతో కలసి మీడియాతో మాట్లాడారు. కేరళలో హిందూవాదులు, ఆరెస్సెస్ కార్యకర్తలులపై దాడులు, రాజకీయ హత్యలు, పర్యావరణ సమతుల్యత, అంటరానితనం తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించి పలు తీర్మానాలను కేంద్ర కమిటీకి సమర్పిస్తామని ఆయన తెలిపారు. ఉమ్మడి ఏపీలో పదేళ్లలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కేటాయించిన రూ.25 వేల కోట్లను పక్కదారి పట్టించారని, ఆ నిధులను ఆ వర్గాల అభివృద్ధికే వెచ్చించాలని డిమాండ్ చేశారు.

దళితులపై ఇంకా వివక్ష..
దేశంలో అనేక ప్రాంతాల్లో దళితులు నేటికీ వివక్ష ఎదుర్కొంటున్నారని బాగయ్య పేర్కొన్నారు. దీనిపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ఒక సర్వే నిర్వహించినట్లు తెలిపారు. అందులో మధ్యప్రదేశ్‌లో 9 వేల గ్రామాల్లో, మహారాష్ట్రలో దేవగిరి ప్రాంతాల్లో దళితులు, గిరిజనులు వివక్ష ఎదుర్కొంటున్నట్లు తేలిందన్నారు. నల్లగొండ, పాలమూరు జిల్లాలోని 489 గ్రామాల్లో దళిత, గిరిజనులకు పలు దేవాలయాలు, మంచినీటి బావులు, చెరువులు, శ్మశానవాటికల్లోకి ప్రవేశం లేదని పేర్కొన్నారు.

పలు గ్రామాల్లోని హోటళ్లలో రెండు గ్లాసుల విధానం ఇంకా కొనసాగుతోందన్నారు. దీన్‌దయాళ్ 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏకాత్మ మానవతా దర్శనం పేరుతో దేశాలు, వ్యక్తుల మధ్య విద్వేషాలు లేకుండా చేసేందుకు ఆరెస్సెస్ కృషి చేస్తోందన్నారు. ప్రకృతి తల్లి లాంటిదని, అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపుతామని స్పష్టంచేశారు. కోల్‌కతాలో హిందూ సమాజంపై దాడులు జరుగుతున్నాయని, విద్రోహ శక్తులు పెట్రేగి పోతున్నాయన్నారు.

దుర్గా నిమజ్జనంలో విధ్వంసం జరిగినా బెంగాల్ ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. మైనార్టీలను సంతృప్తి పరచటానికి హిందువుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. కేరళలో కమ్యూనిస్టుల రాక్షస పాలన సాగుతుందని ఆరోపించారు. సమావేశాలకు మోహన్ భగవత్‌తోపాటు ఆరెస్సెస్ అఖిల భారత ప్రధానకార్యదర్శి సురేష్ భయ్యాజీ వంటి ప్రముులు హాజరయ్యారు.
 
నేడు అమిత్‌షా రాక!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సోమవారం సమావేశాలకు రానున్నారని ఆరెస్సెస్ నాయకులు తెలిపారు. ఆదివారమే రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల సోమవారానికి వాయిదా పడ్డట్లు వివరించారు.

Advertisement
Advertisement