రూపాయి, ఫలితాలే దిక్సూచి | Sakshi
Sakshi News home page

రూపాయి, ఫలితాలే దిక్సూచి

Published Mon, Aug 5 2013 4:15 AM

రూపాయి, ఫలితాలే దిక్సూచి

న్యూఢిల్లీ: ఇకపై వచ్చే కంపెనీల ఆర్థిక ఫలితాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడుల పరిస్థితి, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్లను నడకను నిర్దేశిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. వీటితోపాటు అంతర్జాతీయ సంకేతాలు కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని చెప్పారు. వచ్చే శుక్రవారం(9న) రంజాన్(ఈద్) సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ఈ వారం టాటా మోటార్స్, సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీ, టాటా పవర్ వంటి బ్లూచిప్ కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి.
 
  సోమవారం(5న) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ నెల 30న ముగియనున్న సమావేశాల్లో భాగంగా ఆహార భద్రత బిల్లును ఆమోదించాల్సి ఉంది. ఇక సోమవారమే అమెరికా ఉద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. జూలై నెలకు వెల్లడైన ఉద్యోగ గణాంకాలు ఆర్థిక సంక్షోభ ప్రభావం నుంచి అమెరికా బయటపడుతున్న సంకేతాలను అందించాయి. 2008 డిసెంబర్ తరువాత నిరుద్యోగిత 7.4%కు తగ్గింది. ఈ అంశం కూడా సోమవారం మార్కెట్లను ప్రభావితం చేయవచ్చునని విశ్లేషకులు పేర్కొన్నారు. 
 
 నిఫ్టీకి 5,750 కీలకం 
 అంతర్జాతీయ అంశాలతోపాటు, కంపెనీల ఫలితాలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. సమీప కాలంలో ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్ నిఫ్టీకి 5,750 స్థాయి కీలకంగా నిలవనుందని తెలిపారు. ఈ స్థాయికిపైన కొనుగోళ్ల మద్దతు లభిస్తుందని అంచనా వేశారు. కాగా, గడిచిన శుక్రవారం డాలరుతో మారకంలో రూపాయి విలువ కొత్త కనిష్ట స్థాయి 61.10 వద్ద ముగిసింది. అయితే గత కొన్ని వారాలుగా ప్రభుత్వంతోపాటు, రిజర్వ్ బ్యాంకు సైతం కరెన్సీ బలపడేందుకు వీలుగా పలు చర్యలను తీసుకుంటున్నప్పటికీ ఫలితమివ్వకపోవడం గమనార్హం.
 
  ఈ బాటలో రిజర్వ్ బ్యాంకు గత వారం రూపాయికి మద్దతుగా మరిన్ని చర్యలను ప్రకటించింది. హెడ్జింగ్‌ను చేపట్టేముందు ఎఫ్‌ఐఐలు తప్పనిసరిగా పార్టిసిపేటరీ నోట్ల జారీదారుల వద్ద నుంచి అనుమతిని పొందాల్సి ఉంటుంది. ఇదే విధంగా అంతక్రితం ఫారెక్స్ మార్కెట్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు చెక్ పెట్టడం, బ్యాంకుల లిక్విడిటీని కట్టడి చేస్తూ బ్యాంకు రేటును భారీగా పెంచడం వంటి చర్యలను తీసుకున్న విషయం విదితమే.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement