Sakshi News home page

40 సార్లు జాబ్‌ రిజెక్ట్‌: అతని పేరుతో వణుకు!

Published Sun, Mar 19 2017 8:54 AM

40 సార్లు జాబ్‌ రిజెక్ట్‌: అతని పేరుతో వణుకు! - Sakshi

ఆ తాత ఎంతో ప్రేమతో తన మనవడికి పేరు పెట్టాడు. భవిష్యత్తులో అతనో మంచి వ్యక్తి అవుతాడని భావించాడు. కానీ 25 ఏళ్లు తిరిగి చూస్తే ఇప్పుడు ఆ తాత పెట్టిన పేరే మనవడికి మోయలేనంత భారమైపోయింది. అతని పేరు చెప్తే చాలు భయపడుతున్నారు. ఇక, ఉద్యోగం ఎలా ఇస్తారు?.. ఇదే ఇప్పుడు జార్ఖండ్‌ జెంషెడ్‌పూర్‌కు చెందిన మేరిన్‌ ఇంజినీర్‌ సద్దాం హుస్సేన్‌ ఎదుర్కొంటున్న సమస్య. ఇరాక్‌ పాలకుడు సద్దాం హుస్సేన్‌ పేరే తనకు ఉండటంతోనే అతనికి అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. కరుడుగట్టిన నియంతగా ప్రజలపై అనేక అకృత్యాలకు పాల్పడ్డట్టు ఆరోపిస్తూ 2003లో అమెరికా  సద్దాంను గద్దె దింపిన సంగతి తెలిసిందే.

'సద్దాం అనే పేరు ఉండటంతో నాకు ఉద్యోగం ఇవ్వడానికి భయపడుతున్నారు' అని అతను వాపోతున్నారు. తమిళనాడులోని నూరుల్‌ ఇస్లాం యూనివర్సిటీలో మేరిన్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన సద్దాం.. ఇప్పటివరకు 40సార్లు ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరైనా.. అనేక మల్టీనేషనల్‌ షిప్పింగ్‌ కంపెనీల చుట్టూ ఉద్యోగాల కోసం తిరిగినా.. అన్నిసార్లు చివరకు నిరాశే ఎదురైంది. అతని బ్యాచ్‌మేట్లు అంతా ప్రపంచమంతటా మంచి కొలువులు సంపాదించి.. జీవితంలో స్థిరపడిపోగా.. సద్దాం మాత్రం పేరు కారణంగా నిరుద్యోగిగా మిగిలిపోయాడు.

సద్దాం అనే పేరు ఉండటం వల్ల వెంటనే అనుమానం వచ్చే అవకాశముందని, అందుకే అతనికి ఉద్యోగం ఇవ్వడానికి టాప్‌ కంపెనీలు నిరాకరిస్తున్నాయని ఢిల్లీకి చెందిన రిక్రూట్‌మెంట్‌ కన్సల్టెంట్‌ సంస్థ టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ అభిప్రాయపడింది. ఈ కష్టాల నేపథ్యంలో సద్దాం ఇప్పుడు తన పేరును సాజిద్‌గా మార్చాలని, ఈ మేరకు తన పదో తరగతి ధ్రువపత్రాలలో మార్పులు చేసేందుకు సీబీఎస్‌ఈకి ఆదేశాలు ఇవ్వాలంటూ జార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించాడు. తన తాత ప్రేమతో పెట్టిన పేరే ఇప్పుడు తనకు పీడకలను మిగిల్చిందని, కేవలం పేరు కారణంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని సద్దాం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Advertisement
Advertisement