ప్రభుత్వం మారింది.. రంగూ మారిపోయింది! | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం మారింది.. రంగూ మారిపోయింది!

Published Tue, Aug 29 2017 10:21 AM

ప్రభుత్వం మారింది.. రంగూ మారిపోయింది!

ఉత్తరప్రదేశ్‌లో ఒక పాత అలవాటు ఉంది. అదేమిటంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల రంగు మారడం. ఇప్పటివరకు యూపీ ఆర్టీసీ బస్సులు సాధారణ రంగుల్లోనే కనిపించేవి. కానీ యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం రావడంతో ఇప్పుడు కొత్త రంగు బస్సులు ప్రజలకు దర్శనమివ్వబోతున్నాయి. అవే కాషాయ రంగు బస్సులు.. దీంతో ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రవాణా సంస్థ (యూపీఎస్‌ఆర్టీసీ).. గత 15 ఏళ్లలో రాష్ట్రాన్ని పాలించిన అన్ని పార్టీల రంగుల బస్సులను కలిగి ఉన్నట్టయింది.

బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధికారంలో ఉన్నప్పుడు తన జెండాకు ప్రతీకగా నీలం, తెలుపు రంగుల బస్సులను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) ఎరుపు, ఆకుపచ్చరంగులతో కూడిన బస్సులను మొదలుపెట్టింది. ఇప్పుడు బీజేపీ కాషాయ రంగు బస్సులను ప్రవేశపెడుతోంది. బీజేపీ సర్కారు రాష్ట్రాన్ని కాషాయమయంగా మార్చాలన్న అజెండా పెట్టుకుందని, అందుకే బస్సులకు కాషాయ రంగులు వేస్తోందని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపిస్తోంది.

ఇప్పటికే యూపీఎస్‌ఆర్టీసీలో బీఎస్పీ, ఎస్పీ జెండాలకు సంబంధించిన రంగుల బస్సులు ఉండగా.. కొత్తగా 50 బస్సులను 'అంత్యోదయ' పథకం పేరిట యోగి సర్కారు ప్రవేశపెడుతోంది. హిందుత్వానికి ప్రతీకగా, యోగికి ఇష్టమైన కాషాయ రంగులో ఈ బస్సులో ఉండనున్నాయి. దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ శతజయంతి సందర్భంగా ఈ బస్సులను సెప్టెంబర్‌ 25వ తేదీ నుంచి ప్రవేశపెట్టబోతోంది.

Advertisement
Advertisement