దమ్‌ మారో దమ్‌.. | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ డ్రగ్స్‌ రాకెట్‌; ’సాక్షి’ సంచలన రిపోర్ట్‌

Published Sat, Jul 8 2017 2:31 AM

గన్‌ఫౌండ్రీ వద్ద గంజాయి సేవిస్తూ కనిపించిన విద్యార్థి - Sakshi

- విచ్చలవిడిగా గంజాయి వినియోగిస్తున్న సిటీలోని చారిత్రక కళాశాల విద్యార్థులు
- ‘సాక్షి’  క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడి
- విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి సరఫరా
- తొలుత విదేశీ విద్యార్థులు.. వారి నుంచి స్థానిక విద్యార్థులకూ అలవాటు
- ఈ అలవాటు ముదిరాక ఎల్‌ఎస్‌డీ, డీవోబీ వంటి డ్రగ్స్‌ వినియోగం
- ఆ కాలేజీ చుట్టూ బడ్డీకొట్లు, ఇతర దుకాణాల్లోనూ లభిస్తున్న ఓసీబీ స్లిప్స్‌


(వర్ధెల్లి వెంకటేశ్వర్లు, సాక్షి ప్రతినిధి, హైదరాబాద్‌)

అత్యుత్తమ ఫలితాలతో విద్యార్థులను ఆకర్షించిన కళాశాల అది.. ఎందరో ఉన్నతస్థాయి వ్యక్తులను సమాజానికి అందించింది కూడా.. కానీ ఇప్పుడా కళాశాల మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారింది.. హైదరాబాద్‌ నడిబొడ్డున కొత్వాల్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నా.. ఈ చారిత్రక విద్యాసంస్థలో మాదక ద్రవ్యాల తంతు విచ్చలవిడిగా సాగడం గమనార్హం. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా స్వయం ప్రతిపత్తితో కొనసాగుతున్న ఈ కళాశాలలో.. ఆందోళనకర స్థాయిలో గంజాయి, డ్రగ్స్‌ వినియోగం జరుగుతోందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు కూడా నిర్ధారించారు. ఇక్కడి విద్యార్థుల్లో దాదాపు 500 మందికిపైగా గంజాయి, ఎల్‌ఎస్‌డీ, డీవోబీ వంటి డ్రగ్స్‌కు దాసోహమైనట్లు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది.

ఎక్సైజ్‌ నేర పరిశోధక విభాగంలో పట్టున్న ఒక అధికారి సహకారంతో ‘సాక్షి’ ప్రతినిధి ఆ కళాశాల ప్రాంతానికి వెళ్లగా.. గంజాయితో సిగరెట్లు చేసుకుని తాగుతున్న విద్యార్థుల బృందాలు కనిపించాయి. కాలేజీ ఆవరణలో, ఓ ఇంటి మెట్ల మీద, విద్యార్థులు ఉండే గదుల్లో గుంపులుగా చేరి గంజాయి తాగుతున్న విద్యార్థులు కనిపించారు. ఇక ఆ కాలేజీ క్యాంపస్‌లో పనిచేసే తోటమాలి, సెక్యూరిటీ సిబ్బంది, ఇతర ఉద్యోగులను కదిలిస్తే ‘డ్రగ్స్‌’ సంగతులెన్నో పూసగుచ్చుతున్నారు. కళాశాల సమీపంలోని బడ్డీ కొట్లు, పాన్‌షాపులు, చెరుకు రసం బండ్ల మీద గంజాయి, విదేశీ డ్రగ్స్‌ అమ్ముతుంటారని వెల్లడించారు.

సంచలన కేసు తొలి అరెస్టు ఇక్కడే..
హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న ఈ కాలేజీలో వివిధ కోర్సుల్లో కలిపి దాదాపు 4,500 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. అందులో సుమారు 1,500 మంది విదేశీ విద్యార్థులుండగా.. వీరిలో ఎక్కువగా ఆఫ్రికా దేశాలవారే. భిన్న సంస్కృతుల వారితో కలసిన విద్యార్థులు, స్వేచ్ఛాయుత వాతావరణం, మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉండడంతో విద్యార్థులు పెడదోవ పడుతున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో తొలుత పట్టుబడిన విద్యార్థి ఇదే కాలేజీకి చెందినవారు కావడం గమనార్హం. బీబీఏ కోర్సు చదువుతున్న ఆ సోమాలియా విద్యార్థిని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేసి, రాబట్టిన సమాచారంతోనే కూపీ లాగి కెల్విన్, వాహిద్‌ గ్యాంగులను పట్టుకున్నారు.

పరిశీలన సాగిందిలా..
కళాశాలలోకి వెళ్లగానే అక్కడ పనిచేస్తున్న ఇద్దరు తోటమాలిలు కనిపించారు. ‘‘మా కుమారుడిని ఈ కాలేజీలో చేర్పించడానికి వచ్చాం..’’అంటూ సాక్షి ప్రతినిధి వారితో మాట కలిపారు. పది నిమిషాల పాటు మాట్లాడాక.. ‘ఈ కాలేజీ పిల్లలు డ్రగ్స్‌ వాడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి..’అంటూ ప్రస్తావన తెచ్చారు. దాంతో ఆ తోటమాలి..‘‘నిజమే బిడ్డా.. జర హుషారు పిల్లగాళ్లయితే కష్టంగనే ఉంది. అగో అది అదే బాపతి.’’అంటూ క్యాంపస్‌ పార్కు సమీపంలో గోడ మీద కూర్చున్న ముగ్గురు విదేశీ విద్యార్థులను చూపించారు. ఆ విద్యార్థులు అరచేతిలో గంజాయిని పోసుకుని నలుçస్తున్నారు. తర్వాత దాన్ని జాయింటు (ఓసీబీ స్లిప్‌ – సిగరెట్టులా మలుచుకుని లోపల గంజాయి నింపుకొనేందుకు వీలుగా రూపొందించిన ప్రత్యేకమైన కాగితం)లో పోసి సిగరెట్‌లా కాల్చుతున్నారు. తర్వాత కాలేజీ క్యాంపస్‌లో తిరుగుతుండగా.. ఓ ప్రైవేటు సెక్యూరిటీ గార్డు కనిపించారు. తమ వాళ్లను కాలేజీలో చేర్చడానికి వచ్చామంటూ ఆయనతోనూ సాక్షి ప్రతినిధి మాట కలిపారు. పదిహేను నిమిషాల పాటు మాట్లాడాక.. అసలు విషయం ప్రస్తావనకు వచ్చింది. ‘‘ఈ కాలేజీ చదువు గురించి మాకు భయం లేదు.. కానీ డ్రగ్స్‌ అంటున్నారు.. ఏం చేయాలో తోచడం లేదు. ఇంట్లో వాళ్లు భయపడుతున్నారు. కనుక్కుని పోదామని వచ్చా’మని పేర్కొన్నారు. దాంతో ఆ సెక్యూరిటీ గార్డు..‘‘కొన్ని కోతులు ఉన్నయ్‌ సారు.. డ్రగ్స్‌ అలవాటు ఉన్నవాళ్లు ఉన్నారు. ఈ ఏడాది చాలా మంది వెళ్లిపోయారు. ఇక్కడి హాస్టల్‌ కంటే బయట ఎక్కడైనా జాయిన్‌ చేస్తే మంచిది. మీ ఇష్టం. నేను చెప్పొద్దు కానీ చెప్తున్న..’’అని వివరించారు.

విద్యార్థుల ప్రైవేటు గదుల్లోనూ..
కాలేజీలో పరిశీలన అనంతరం సమీపంలోని ప్రాంతాల్లోనూ ‘సాక్షి’ప్రతినిధి, ఆయన మిత్రుడు కలసి పరిశీలించారు. గన్‌ఫౌండ్రీలోని ఒక ఇంటి మెట్ల మీద ఐదుగురు విద్యార్థులు కూర్చుని గంజాయి దమ్ము కొడుతున్నారు. వారు ఆ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారట. పక్కవాళ్లు గమనిస్తున్నారనే సోయి.. పోలీసులు వస్తారేమోనన్న భయమేమీ లేకుండా.. గంజాయి దమ్ము కొట్టడంలో పోటీ పడుతున్నారు. ‘‘రేయ్‌ సాయి (పేరు మార్చాం) బీస్‌ బోలానారే.. సాత్‌ మే ఆదాబీ నైహువానా రే.. 15 బోలా.. చల్‌ 15 మే ఖతమ్‌ హోనా దే (అరే 20 దమ్ములు కొడతా అన్నావు.. ఇప్పటివరకు ఏడు కూడ కొట్టలేదు.. సరే 15 దమ్ములు కొట్టు..)’’అంటూ సవాలు చేసుకుంటున్నారు. ఆ విద్యార్థి వయసు 18 ఏళ్లు కూడా దాటి ఉండదు. వారి సమీపంలోకి వెళ్లేటప్పటికి గంజాయి మత్తులో పడి జోగుతున్నాడు. అక్కడి నుంచి సాక్షి ప్రతినిధి, ఆయన మిత్రుడు కాలేజీ హస్టల్‌ వైపు బయలు దేరినా.. వర్షం మొదలుకావడంతో వీలుకాలేదు. అయితే సాక్షి ప్రతినిధి వెంట వచ్చిన మిత్రుడికి అక్కడి కొందరు విద్యార్థులతో పరిచయముంది. ఆయన అక్కడికి ఎదురుగా ఉన్న వీధిని చూపి.. ‘కొంత దూరంలో నైజీరియన్లు ఉంటారు, వెళ్లి కలుద్దా’మంటూ తీసుకెళ్లారు. అయితే నైజీరియన్లు ఉన్న గదిలోకి మాత్రం ఆయన ఒక్కడే వెళ్లి పరిశీలించి.. ఒక ఫొటో కూడా తీసుకుని వచ్చారు. ‘‘వాళ్లు మత్తులో ఉన్నారు. దమ్ము కొడుతున్నారు. కాలేజీలో తరగతులు ఇంకా పూర్తి స్థాయిలో మొదలుకాలేదు. పెద్దగా పనిలేదు కాబట్టి గంజాయి దమ్ము కొడుతున్నారు..’’అని చెప్పారు.

ఓసీబీ స్లిప్స్‌ ఎందుకు?
గంజాయి వాడేవారు దానిని అరచేతిలో నలిపి.. ఓసీబీ స్లిప్స్‌లో చుట్టచుట్టి సిగరెట్‌ తరహాలోనే కాల్చుతుంటారు. సాధారణ కాగితం మంట అంటుకుంటే వేగంగా, పూర్తిగా కాలిపోతుంది.. లేకపోతే ఆరిపోతుంది. అదే ఓసీబీ స్లిప్స్‌ ప్రత్యేకమైన కాగితంతో తయారవుతాయి.. సిగరెట్‌ తరహాలోనే పీల్చినప్పుడల్లా కాలుతూ ఆరిపోకుండా ఉంటాయి. ఓసీబీ స్లిప్స్‌ను గంజాయి వంటివి పీల్చడానికి తప్ప వేరే దేనికీ వాడరు. అలాంటి ఓసీబీ స్లిప్స్‌ ఈ చారిత్రక కాలేజీ చుట్టు పక్కల ఉన్న ప్రతి పాన్‌షాపు, పుస్తకాల దుకాణాల్లో లభిస్తుండడం గమనార్హం. గంజాయి వినియోగించేవారు ఈ స్లిప్స్‌ను ‘జాయింట్‌’పేరుతో పిలుస్తుంటారు.

గంజాయితోనే తొలి గ‘మ్మత్తు’!
డ్రగ్స్‌కు బానిసవుతున్న విద్యార్థులు మొదట గంజాయితోనే తొలుత మత్తు అనుభవాన్ని పొందుతున్నారు. అది ముదిరిన తర్వాత ప్రమాదకరమైన ఎల్‌ఎస్‌డీ వంటి డ్రగ్స్‌ వైపు మళ్లుతున్నారని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులతోపాటు ఇతర రంగాలకు చెందిన వారిని కలుపుకొంటే హైదరాబాద్‌ నగరంలో రోజుకు 250 కిలోలకుపైగా గంజాయి వినియోగమవుతోందని వెల్లడిస్తున్నారు. ధూల్‌పేటలో గుడుంబాను అరికట్టిన తర్వాత ఊహించని విధంగా గంజాయి వాడకం పెరిగిందని ఎక్సైజ్‌ అధికారి ఒకరు చెప్పారు.

10 గ్రాములు.. రూ.1,000
విద్యార్థులు, ఆర్థికంగా ఎదిగిన వర్గాలు గ్రీన్‌ గంజాయికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని.. 10 గ్రాముల గంజాయి డిమాండ్‌ను బట్టి రూ.700 నుంచి రూ.1,000 వరకు విక్రయిస్తున్నారని సమాచారం. హైదరాబాద్‌ నగరవ్యాప్తంగా పలు కాలేజీల్లో కలిపి సుమారు మూడు వేల మంది విద్యార్థులు డ్రగ్స్, గంజాయికి బానిసైనట్లు ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌కు బానిసైన వాళ్లు.. తమ మిత్రులకు కూడా దాన్ని అలవాటు చేస్తున్నారని, డబ్బు కోసం వాళ్లే డ్రగ్స్‌ కొరియర్లుగా మారుతున్నారని చెబుతున్నారు. దీంతో విద్యార్థుల్లో డ్రగ్స్‌ అలవాటు పెరుగుతోందని స్పష్టం చేస్తున్నారు.

పార్టీలకెళితే ‘డ్రగ్స్‌’అలవాటు!
గంజాయి అలవాటు ముదిరిన తరువాత విద్యార్థులు ప్రమాదకరమైన ఎల్‌ఎస్‌డీ, డీవోబీ వంటి ప్రమాదకరమైన డ్రగ్స్‌ వైపునకు మళ్లుతున్నారు. అయితే ఈ డ్రగ్స్‌ చాలా ఖరీదైన వ్యవహారం. ప్రతి డోసుకు రూ.3,500 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. దీంతో పార్టీలు చేసుకునేటప్పుడు మాత్రం డ్రగ్స్‌ వాడుతున్నారు. తరచుగా రేవ్‌ పార్టీలకు వెళ్లే వాళ్లలో 90 శాతం మందికి డ్రగ్స్‌ అలవాటైనట్లు తేలింది.

ఏపీలోని విశాఖ జిల్లా నుంచి..
ఏపీలోని విశాఖ జిల్లా పాడేరు, చింతపల్లి, రోళ్లపెంట ప్రాంతాల నుంచి ఇక్కడికి గ్రీన్‌ గంజాయి సరఫరా అవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్, మంగల్‌హాట్, సీతాఫల్‌మండి, ఇబ్రహీంపట్నం, నాగోల్, పుప్పాలగూడ, లంగర్‌హౌస్, ధూల్‌పేట, నానక్‌రాంగూడ, ఫత్తే నగర్‌ ప్రాంతాల్లో ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్, గంజాయి విక్రయ స్థావరాలు ఉన్నాయని గుర్తించారు. అలాంటి స్థావరాలపై పోలీసులు తగిన నిఘా పెట్టకపోవటంతోనే డ్రగ్స్‌ సమస్య తీవ్రమైందని... టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసి పెట్టిన కేసులు మినహా స్థానిక పోలీసులు వాళ్ల జోలికి వెళ్లటం లేదనే ఆరోపణలున్నాయి.

ఆ కాలేజీపై దృష్టి పెట్టాం..
‘‘ఆ కాలేజీలో మత్తుకు బానిసైన విద్యార్థులు పెద్ద సంఖ్యలోనే ఉన్నట్లు మాకు సమాచారముంది. విద్యార్థుల కార్యకలాపాలపై దృష్టి పెట్టాం. ముఖ్యంగా విదేశీ విద్యార్థుల్లో డ్రగ్స్‌ అలవాటు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి ఇచ్చిన సమాచారంతో తీగ లాగితే డ్రగ్స్‌ డొంక కదులుతోంది..’’ – అంజిరెడ్డి, ఎక్సైజ్‌ యాంటీ నార్కోటిక్‌ డ్రగ్స్‌ టీం లీడర్‌

డ్రగ్స్‌ దందాపై పోలీసుల నజర్‌
అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులకు డీజీపీ ఆదేశం
సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలో విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్‌ దందాపై పోలీసుశాఖ దృష్టి పెట్టింది. గంజాయి తోపాటు సర్జికల్‌ డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయి..ఏయే ప్రాంతాల్లో రవాణా జరు గుతోంది వంటి అంశాలపై లోతుగా దర్యాప్తు చేయాలని డీజీపీ అనురాగ్‌శర్మ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎక్సైజ్‌ ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ విభాగం పట్టుకున్న డ్రగ్స్‌ కేసులో అసలు మూలాలను వెతకాలని, ఇందుకు కావల్సిన సాంకేతిక సహాయ సహకారాలను ఇంటలిజెన్స్‌ విభాగం అందిస్తుందన్నారు.

రంగంలోకి ప్రత్యేక బృందం...
ఎక్సైజ్‌శాఖ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న డ్రగ్స్‌ కేసుకు పూర్తి స్థాయిలో పోలీసుశాఖ సహాయ సహకారాలు అందిస్తోందని డీజీపీ ‘సాక్షి’కి తెలిపారు. ఈ కేసును ఏ విభాగం దర్యాప్తు చేస్తున్నా రాష్ట్రానికి సంబంధించిన అంశం కావడం, పైగా విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న వ్యవహారం అయినందున ఇందుకోసం ప్రత్యేకంగా ఇంటలిజెన్స్‌ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనాత్మక కేసులు ఏవీ జరిగినా ఇంటెలిజెన్స్‌ ప్రత్యేక బృందం రంగంలోకి దిగుతుందని తెలిపారు.  

సహకారం అందిస్తాం...
ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు చేస్తున్న డ్రగ్స్‌ సరఫరా కేసులో ఇంటెలిజెన్స్‌ విభాగం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని ఉన్నతాధికారులు తెలిపారు. కాల్‌డేటా విశ్లేషణ, డ్రగ్స్‌ పెడ్లర్‌ల కదలికలు, వారి లింకులను ఛేదించడంలో ఇంటలిజెన్స్‌ అధికారులు, సిబ్బంది ఎక్సైజ్‌కు సహకరి స్తున్నారని తెలిపారు.

అప్రమత్తంగా ఉండండి: డీజీపీ
రాజధానితోపాటు శివారు ప్రాంతాల్లో విద్యా ర్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, స్టార్‌ హోటళ్లకు డ్రగ్స్‌ రవాణా జరుగుతోందని ఎక్సైజ్‌ దర్యాప్తులో బయటపడటంతో అప్రమత్తంగా ఉండాలని కమిషనర్లు, ఎస్పీలను డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశించారు.

డ్రగ్స్‌ నియంత్రణకు కాలేజీల్లో కమిటీలు
సాక్షి, హైదరాబాద్‌:
కళాశాలల్లో డ్రగ్స్‌ నియంత్రణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్లను ఆదేశించారు. డ్రగ్స్‌ వాడకం వల్ల కలిగే దుష్పలితాలపై విద్యార్థులకు అవగాహణ కల్పించి చైతన్యపర్చాలని సూచించారు. శుక్రవారం ఓయూ, జేఎన్‌టీయూ వీసీలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలల్లో ర్యాగింగ్‌ నియంత్రణ కమిటీల తరహాలోనే ఈ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈమేరకు ప్రతి కాలేజీల్లో సమావేశాలు నిర్వహించి బోధన సిబ్బందికి సూచనలు చేయాలన్నారు. కాలేజీ క్యాంటీన్లు, హాస్టళ్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ప్రతి కాలేజీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, ప్రిన్సిపాళ్లతో వీసీలు సమావేశాలు నిర్వహించాలన్నారు. డ్రగ్స్‌ నియంత్రణపై పోస్టర్లు రూపొందించి నోటీసు బోర్డుల్లో, క్యాంటీన్లు, హాస్టళ్లలో ప్రదర్శించాలన్నారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లో నిరంతరం నిఘా పెట్టాలన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement