చల్లారని ఉద్యమాగ్ని.. అలుపెరుగని సమైక్య పోరు

29 Oct, 2013 06:43 IST|Sakshi
చల్లారని ఉద్యమాగ్ని.. అలుపెరుగని సమైక్య పోరు

మూడు నెలలుగా అలుపెరుగని సమైక్య పోరు
సాక్షి నెట్‌వర్క్ : సీమాంధ్ర జిల్లాల్లో ఎగసిన సమైక్యాంధ్ర ఉద్యమం నిరవధికంగా సాగుతోంది. వేర్పాటు ప్రకటన వెనక్కి వెళ్లేవరకూ పోరాటాన్ని ఆపేదిలేదంటూ తెగేసి చెబుతున్న సమైక్యవాదులు విభిన్న రూపాల్లో ఆందోళనలు హోరెత్తిస్తున్నారు. వరుసగా 90వ రోజైన సోమవారం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ ప్రదర్శనలు, విభజన యత్నాలను నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు పోటెత్తాయి. తొంభై రోజుల ఉద్యమానికి సంకేతంగా చాలాచోట్ల విద్యార్థులు 90 అంకె ఆకారంలో ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు.
 
జాతీయ రహదారిపై ధర్నా
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు, వీఆర్‌వోలు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మదనపల్లెలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. శ్రీకాళహస్తిలో ఇంజినీరింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బి.కొత్తకోటలో విద్యార్థులు ర్యాలీ చేశారు. చిత్తూరు ఎన్జీవో హోం వద్ద ఎన్జీవోలు రిలే దీక్షలు ప్రారంభించారు. తిరుపతిలో రెవెన్యూ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. అనంతపురంలో యువ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్మించి సమైక్య నినాదాలు చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాస్కులు ధరించి.. రాజ్యాంగాన్ని పరిరక్షించండి అంటూ ప్రదర్శన నిర్వహించారు. పెనుకొండలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలుపగా.. విద్యార్థులు ర్యాలీ చేశారు. రాయదుర్గంలో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీకి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు.
 
ఇంజనీరింగ్ విద్యార్థుల భారీ ర్యాలీ
కడపలో ఇంజనీరింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏడురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో ఆర్టీసీ ఎన్‌ఎంయూ సభ్యులు దీక్ష చేపట్టారు. ఆంధ్రా యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మను విద్యార్థులు దగ్ధం చేశారు. సమైక్యాంధ్ర కోసం ఎవరైనా సభలు, సమావేశాలు పెట్టుకోగా లేనిది వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని నడిబొడ్డున సమైక్య శంఖారావం మోగిస్తే లగడపాటికొచ్చిన ఇబ్బందేమిటో చెప్పాలని విద్యార్థులు నినదించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో పెన్షనర్లు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఎన్జీవోలు రిలే దీక్ష చేపట్టారు. తాడేపల్లిగూడెంలో న్యాయవాదులు రోడ్డుపై గుంజీలు తీసి నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఎన్జీవోలు ఆందోళన నిర్వహించారు.

వైఎస్సార్సీపీ అకుంఠిత దీక్షలు
సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరశన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. ప్రతిచోటా పార్టీ కార్యకర్తలు, నేతలు రిలే దీక్షలు చేపడుతున్నారు.
 
నేడు నాగార్జున వర్శిటీలో సమైక్య విద్యార్థి జేఏసీ సమావేశం
సీమాంధ్ర ప్రాంతంలోని విశ్వవిద్యాలయాలు, వివిధ జిల్లాల సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకుల సమావేశం మంగళవారం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతుందని సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో రూపొందిస్తామని ఆయన గుంటూరులో విలేకరులతో చెప్పారు.
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా