సీమాంధ్రలో మార్మోగుతున్న నినాదం | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో మార్మోగుతున్న నినాదం

Published Sun, Oct 13 2013 4:09 AM

సీమాంధ్రలో మార్మోగుతున్న నినాదం

సాక్షి నెట్‌వర్క్: పైలీన్ తుపాను గడియల్లోనూ.. దసరా శరన్నవరాత్రి వేడుకల్లోనూ సీమాంధ్రలో ఒక్కటే నినాదం మార్మోగుతోంది. ‘సేవ్ సమైక్యాంధ్రప్రదేశ్’.. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భారీవర్షాలు కూడా లెక్కచేయక జనం రోడ్లపైకి సమైక్యనినాదాలు హోరెత్తించారు. ఇక అమ్మవారి నవరాత్రి వేడుకల్లో రాష్ర్టం ముక్కలు కాకుండా ఒక్కటిగా ఉండాలంటూ ప్రత్యేక పూజలు చేపట్టారు. వరుసగా 74వరోజైన శనివారం సమైక్యవాదులు వివిధరూపాల్లో ఆందోళనలు కొనసాగించారు. శ్రీకాకుళం పాలకొండలో వర్షం కురుస్తున్నా ఎన్జీవోలు, ఉపాధ్యాయులు రాస్తారోకో నిర్వహించారు. బెలగాంలో దుర్గాదేవి అవతారంలో తెలుగుతల్లి సమైక్యాంధ్ర ద్రోహులపై ఆగ్రహంచినట్లు వినూత్న తరహాలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
 
 తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన రైతు, మహిళ, కార్మిక గర్జనకు వేలాది మంది పోటెత్తారు. ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా చైర్మన్ ఆశీర్వాదం, కార్యదర్శి పితాని త్రినాథ్ మాట్లాడుతూ విభజనను అడ్డుకోకుండా పదవుల్లో కొనసాగుతూ డ్రామాలాడుతున్న సీమాంధ్ర మంత్రులు, ఎంపీలకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో సమైక్య నినాదంతో విద్యార్థులు గర్జించారు. వైఎస్సార్ జిల్లా  రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, వైద్యసిబ్బంది ఓపీ సేవలు నిలిపేశారు. రైల్వేకోడూరులో విద్యార్థులు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ మానవహారం, మైదుకూరులో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. సమైక్య ద్రోహి ఎంపీ చింతామోహన్ అంటూ నినాదాల్ని హోరెత్తించారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఉద్యోగ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
 
 కృష్ణాజిల్లా నాగాయలంకలో రహదారులను దిగ్భంధించి వంటావార్పు చేపట్టారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పత్తి మొక్కలతో రైతులు ఆందోళన చేపట్టారు. రేపల్లెలో రైతుగర్జన సభ నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులు ఇరిగేషన్ కార్యాలయం నుంచి ఎన్‌జీఓ హోమ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడగడపకూ సమైక్యనినాదం పేరిట కార్యక్రమం నిర్వహించారు.
 
 సమైక్యాంధ్ర దళిత జేఏసీ కన్వీనర్ హత్య
 నెల్లూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర దళిత జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బిరదవోలు చిరంజీవి (35) దారుణహత్యకు గురయ్యారు. నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్లకు చెందిన చిరంజీవి మృతదేహం గ్రామ సమీపంలోని కాలువలో ఉండగా పశువుల కాపర్లు గమనించారు. చిరంజీవి గొంతు, వీపుపై కత్తితో పొడిచి హత్య చేసినట్లు సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. మృతుడి మోటారు సైకిల్ రోడ్డు పక్కనే ఉంది. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే చిరంజీవి సమైక్య ఉద్యమంలో భాగంగా దళిత జేఏసీని ఏర్పాటు చేసి రాష్ట్ర కన్వీనర్‌గా ఎన్నికయ్యారు.  ఆధారాలు సేకరించామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ చెప్పారు.
 
 తేరుకున్న విజయనగరం
  సాక్షి ప్రతినిధి, విజయనగరం: అల్లర్లతో అతలాకుతలమైన విజయనగరం తేరుకుంటోంది. ఇన్నాళ్లూ పగలూ రాత్రీ భయంతో ఇళ్లలో గడిపిన జనం ఇప్పుడిప్పుడే వీధుల్లోకి వస్తున్నారు. అధికారులు పగటి పూట కర్ఫ్యూను సడలించడంతో ప్రజలు సరుకులు కొనుక్కునేందుకు మార్కెట్ బాట పడుతున్నారు. దసరా, మరో వారంలో జరగనున్న పైడితల్లమ్మ పండుగలకు ఏర్పాట్లు చేసుకునే నిమిత్తం ప్రజలు కొనుగోలు బాట పట్టారు. దాదాపు రెండునెలల తరువాత పట్టణంలో సందడి నెలకొంది. కాగా, ఆదివారం ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు కలెక్టర్  తెలిపారు.

Advertisement
Advertisement