తెలంగాణలో శాటిలైట్, డ్రైపోర్టుల ఏర్పాటు | Sakshi
Sakshi News home page

తెలంగాణలో శాటిలైట్, డ్రైపోర్టుల ఏర్పాటు

Published Wed, Dec 31 2014 3:38 AM

తెలంగాణలో శాటిలైట్, డ్రైపోర్టుల ఏర్పాటు - Sakshi

* కేంద్ర రవాణా, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కారీ

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో శాటిలైట్ పోర్టు, డ్రైపోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర రవాణా, రహదారులు, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సబ్ కాసాత్ సబ్ కా వికాస్’ అన్న నినాదంతో నరేంద్ర మోదీ నేతృత్వంలో ముందుకు వెళుతున్నాం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు పోర్టులు ఉన్నాయి. కానీ తెలంగాణకు లేవు. అందువల్ల తెలంగాణకు కూడా ఒక శాటిలైట్ పోర్టు ఏర్పాటు చేద్దామనుకుంటున్నాం. గోదావరి నదికి అనుసంధానంగా ఒక డ్రైపోర్టు కూడా ఏర్పాటు చేద్దామనుకుంటున్నాం. రెండు రాష్ట్రాల నుంచి ఆర్టీసీ విభజనపై విజ్ఞాపన అందింది. మరికొద్ది కాలంలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాం’ అని వివరించారు.

శాటిలైట్ పోర్టు అంటే ఏదైనా సముద్ర తీరంలోని ఓడరేవుకు అనుసంధానంగా సముద్రం లేని ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. సముద్ర యానం ద్వారా వెళ్లాల్సిన సరుకులన్నింటినీ ఇక్కడి నుంచి రైలు, రోడ్డు రవాణా ద్వారా ప్రధాన ఓడరేవుకు తరలిస్తారు. డ్రైపోర్టు కూడా ఇలాంటిదే. ఇక్కడి నుంచి ఓడరేవులకు తరలించేందుకు వీలుగా ఒక పోర్టు ఏర్పాటుచేస్తారు.

డ్రైపోర్టు ఏర్పాటు హర్షణీయం: శ్రీరాం వెదిరె
తెలంగాణలో గోదావరి ప్రాంతంలో డ్రైపోర్టు ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకోవడం హర్షణీయమని ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి, కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ సలహాదారు శ్రీరాం వెదిరె చెప్పారు. డ్రైపోర్టు ఏర్పాటుతో తెలంగాణ మరింత అభివృద్ధికి నోచుకోనుందన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisement
Advertisement