టాప్‌స్పీడ్‌లో స్కూటర్‌ర్‌ర్‌ర్! | Sakshi
Sakshi News home page

టాప్‌స్పీడ్‌లో స్కూటర్‌ర్‌ర్‌ర్!

Published Fri, Nov 8 2013 12:56 AM

టాప్‌స్పీడ్‌లో స్కూటర్‌ర్‌ర్‌ర్! - Sakshi

ముంబై: స్కూటర్ల అమ్మకాలు రయ్‌మని దూసుకుపోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఆటోమొబైల్ మార్కెట్లో దాదాపు అన్ని రకాల వాహనాల విక్రయాల జోరు తగ్గినప్పటికీ, స్కూటర్ల అమ్మకాలు మాత్రం ఏ నెలకానెల పెరుగుతూనే ఉన్నాయి. బైక్‌లతో పోల్చితే స్కూటర్లకు ఇంధన చార్జీలు అధికం (మైలేజీ బైక్‌లకు ఎక్కువగా వస్తుంది)అయినప్పటికీ , స్కూటర్ల అమ్మకాలు ప్రతి నెలా రెండంకెల వృద్ధి సాధించడం విశేషం.
 
 ఎందుకు పెరుగుతున్నాయంటే..,
ఇంట్లో బైక్ ఉంటే మగవాళ్లు మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. అదే స్కూటరయితే ఆలుమగలు, ఇంట్లో టీనేజ్ పిల్లలుంటే వాళ్లు కూడా ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుందని చాలా మంది మధ్యతరగతి  మాధవరావులు స్కూటర్‌కే ఓటు వేస్తున్నారు.  నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడం కూడా వారిని స్కూటర్ల వైపే మొగ్గేలా చూస్తోంది. అంతకంతకూ అధికం అవుతున్న ట్రాఫిక్ సమస్య వల్ల పురుషులు కూడా స్కూటర్లపై ఆసక్తి చూపుతున్నారు.  స్కూటర్లకైతే గేర్లు మార్చాల్సిన జంఝాటం ఉండకపోవడం, సులువుగా డ్రైవ్ చేయగలిగే సౌకర్యం వంటి కారణాల వల్ల మైలేజీ తక్కువ వచ్చినా స్కూటర్లే హాయి అని వారంటున్నారు. పట్టణీకరణ విస్తృతి,  పట్టణ మౌలిక సదుపాయాలు మెరుగుపడడం, మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండడం, పెరుగుతున్న  మహిళా సాధికారత వంటి  అంశాలు కూడా స్కూటర్ల విక్రయాలు అధికం కావడానికి తోడ్పడుతున్నాయి. బైక్‌లతో పోల్చితే స్కూటర్లతో బహుళ ప్రయోజనాలుండడం కూడా స్కూటర్ల అమ్మకాల వృద్ధికి తోడ్పడింది.
 
 హోండా ఆక్టివాతో ఆరంభం..
 ఒకప్పుడు స్కూటర్లంటే బజాజ్ కంపెనీదే హవా. హమారా బజాజ్ నినాదం ఇంటింటా మార్మోగేది.  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బజాజ్ ఆటో కంపెనీ బైక్‌ల వైపు దృష్టి సారించింది.  అయితే ఆ తర్వాత హోండా కంపెనీ ఆక్టివా స్కూటర్‌తో రంగ ప్రవేశం చేసింది. భారత స్కూటర్ల మార్కెట్‌ను పునరుజ్జీవింపజేసిన ఘనత హోండా కంపెనీకే దక్కుతుంది. గత పదేళ్లుగా స్కూటర్ల సెగ్మెంట్లో ఈ కంపెనీదే అగ్రస్థానం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ బైక్‌ల కన్నా హోండా ఆక్టివా స్కూటర్ అమ్మకాలు అధికంగా ఉండడం విశేషం. చండీగఢ్, ఇంఫాల్, గోవా, కేరళ మార్కెట్లలో బైక్‌ల కంటే స్కూటర్ల అమ్మకాలే అధికంగా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నైల్లో బైక్‌ల, స్కూటర్ల అమ్మకాల మధ్య వ్యత్యాసం అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. కేరళలో బైక్‌ల కన్నా స్కూటర్ల అమ్మకాలే అధికం. గుజరాత్‌లో కూడా త్వరలో ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా. గత నాలుగేళ్లలో బైక్‌ల అమ్మకాలు 15 శాతం వృద్ధి చెందగా, స్కూటర్ల అమ్మకాలు మాత్రం 26 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో బైక్‌ల అమ్మకాలు స్వల్పంగా 1 శాతం పెరిగి 50.1 లక్షలకు చేరగా, స్కూటర్ల విక్రయాలు మాత్రం 17 శాతం వృద్ధితో 16.6 లక్షలకు చేరాయి. ఏడాదికి భారత్‌లో 28 లక్షలకు పైగా స్కూటర్లు అమ్ముడవుతాయని అంచనా.
 
 3 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్
 స్కూటర్లకు డిమాండ్ పెరుగుతుండటంతో ఒక్క బజాజ్ కంపెనీ తప్ప మిగిలిన అన్ని కంపెనీలు(హోండా, హీరో మోటోకార్ప్, యమహా, సుజుకి,  టీవీఎస్, మహీంద్రా, వెస్పా) స్కూటర్లను అందిస్తున్నాయి. బజాజ్ కంపెనీ కూడా బజాజ్ బ్లేడ్ పేరుతో స్కూటర్‌ను మార్కెట్లోకి తేనున్నదని సమాచారం. హోండా ఆక్టివా, హీరో మ్యాస్ట్రో స్కూటర్లకు కనీసం మూడు నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది.  పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వార్షిక ఉత్పత్తిని పలు కంపెనీలు పెంచుతున్నాయి. టూవీలర్ల విక్రయాల్లో ఇప్పటికీ 70 శాతం బైక్‌లవే అయినప్పటికీ, బైక్‌ల అమ్మకాలను సవాల్‌చేసే స్థాయికి త్వరలో స్కూటర్ల అమ్మకాలు పెరుగుతాయని నిపుణులంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement