359 పాయింట్ల ర్యాలీ... | Sakshi
Sakshi News home page

359 పాయింట్ల ర్యాలీ...

Published Wed, Oct 30 2013 2:03 AM

359 పాయింట్ల ర్యాలీ...

రిజర్వుబ్యాంక్ పరపతి విధానం మార్కెట్ అంచనాలకు అనుగుణంగా వుండటంతో మంగళవారం స్టాక్ సూచీలు పెద్ద ఎత్తున ర్యాలీ జరిపాయి. వాస్తవానికి ఆర్‌బీఐ వడ్డీరేట్లను పావుశాతం పెంచినప్పటికీ, వడ్డీ రేట్ల ప్రభావిత రంగాలైన బ్యాంకింగ్, రియల్టీ, ఆటోమొబైల్ షేర్లు జోరుగా పెరగడం విశేషం. వడ్డీ రేట్లు అరశాతం పెరగవచ్చనే అనుమానంతో కొద్దిరోజుల నుంచి విక్రయిస్తున్న ఇన్వెస్టర్లు, పాలసీ వెల్లడి తర్వాత ఆ రంగాల షేర్లలో షార్ట్ కవ రింగ్ జరపడంతో ర్యాలీ సాధ్యపడిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
 
 బీఎస్‌ఈ సెన్సెక్స్ గత ఐదు రోజుల నష్టాల్ని ఒక్కరోజులో పూడ్చుకుని 359 పాయింట్ల పెరుగుదలతో మూడేళ్ల గరిష్టస్థాయి 20,929 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 2010 నవంబర్ 9 తర్వాత ఇంత గరిష్టస్థాయిలో ముగియడం ఇదే ప్రధమం. తాజా ర్యాలీతో ఈ ఒక్కరోజులో ఇన్వెస్టర్ల సంపద రూ. లక్ష కోట్లు పెరిగింది. మార్కెట్లో లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 67.50 లక్షల కోట్లకు చేరింది. బీఎస్‌ఈలో టర్నోవర్ రూ. 1,685 కోట్ల నుంచి రూ. 2,243 కోట్లకు చేరగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో టర్నోవర్ రూ. 8,917 కోట్ల నుంచి రూ. 12,427 కోట్లకు పెరిగింది.
 బ్యాంక్ నిఫ్టీ అక్టోబర్ సిరీస్‌లో లాంగ్ బిల్డప్...
 
 నవంబర్ సిరీస్‌లో లాంగ్ రోలోవర్స్
 ఎన్‌ఎస్‌ఈ ముఖ్య సూచి సీఎన్‌ఎక్స్ నిఫ్టీ 2 శాతం పెరగడానికి ప్రధాన కారణమైన బ్యాంక్ నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్ కాంట్రాక్టులో మంగళవారం లాంగ్ బిల్డప్ జరిగింది. ఈ నెల డెరివేటివ్ సిరీస్ ముగియడానికి మరో రెండురోజులే సమయం వున్నప్పటికీ, తాజా లాంగ్ బిల్డప్ ఏర్పడటం విశేషం. బ్యాంక్ నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 45 వేల షేర్లు (3 శాతం) యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 16.02 లక్షల షేర్లకు పెరిగింది. అలాగే ఈ కాంట్రాక్టు నవంబర్ సిరీస్‌కు పెద్ద ఎత్తున లాంగ్ రోలోవర్స్ కూడా జరిగాయి. దాంతో నవంబర్ ఫ్యూచర్ ఓఐ రెట్టింపై 8.57 లక్షల షేర్లకు పెరిగింది. తాజాగా 4.29 లక్షల షేర్ల రోలోవర్ జరిగింది. లాంగ్ పొజిషన్లను సూచిస్తూ నవంబర్ బ్యాంక్ నిఫ్టీ స్పాట్‌తో పోలిస్తే రూ. 100 ప్రీమియంతో ముగిసింది. ఆర్‌బీఐ పాలసీ వెల్లడించిన తర్వాత ఇతర రంగాల సూచీలతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ భారీగా పెరగడంతోపాటు 52 వారాల గరిష్టస్థాయి వద్ద క్లోజయ్యింది. ఇక ప్రధాన బ్యాంకింగ్ షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్, యూక్సిస్,ఎస్‌బీఐ నవంబర్ ఫ్యూచర్ కాంట్రాక్టులో రోలోవర్స్ పటిష్టంగా వున్నాయి. ఈ మూడింటిలోనూ తాజాగా 52 శాతం, 62 శాతం, 47 శాతం చొప్పున షేర్లు నవంబర్ సిరీస్‌లో యాడ్ అయ్యాయి.
 
 నిఫ్టీలో కొనసాగిన లాంగ్ రోలోవర్స్: సీఎన్‌ఎక్స్ నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్ కాంట్రాక్టులో లాంగ్ ఆఫ్‌లోడింగ్‌తో పాటు షార్ట్ కవరింగ్ జరగడంతో ఓఐ నుంచి మరో 13 లక్షల షేర్లు కట్ అయ్యాయి. దాంతో అక్టోబర్ ఓఐ 1.28 కోట్ల షేర్లకు తగ్గింది. నవంబర్ సిరీస్‌కు వరుసగా రెండోరోజు పెద్ద ఎత్తున లాంగ్ రోలోవర్స్ జరగడంతో తాజాగా 53.14 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. నవంబర్ ఫ్యూచర్ కాంట్రాక్టులో మొత్తం ఓఐ 1.61 కోట్ల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో ధర పెరగవచ్చన్న అంచనాలతో కొనుగోలుచేసే కాంట్రాక్టును లాంగ్ పొజిషన్ అంటారు.
 

Advertisement
Advertisement