రామ్‌కుమార్ ఆత్మహత్యపై అన్నీ శేష ప్రశ్నలే! | Sakshi
Sakshi News home page

రామ్‌కుమార్ ఆత్మహత్యపై అన్నీ శేష ప్రశ్నలే!

Published Tue, Sep 20 2016 7:31 PM

రామ్‌కుమార్ ఆత్మహత్యపై అన్నీ శేష ప్రశ్నలే!

చెన్నై: ఇన్ఫోసిస్ టెకీ ఎస్ స్వాతి హత్య కేసులో అరెస్టైయిన అనుమానితుడు రామ్‌కుమార్ ఆత్మహత్య కేసులో ఈరోజుకీ అన్నీ అనుమానాలే. ముందుగా అస్వస్థతో బాధపడుతున్న రామ్‌కుమార్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లామని స్వయంగా రామ్‌కుమార్ తరఫున కేసును వాదిస్తున్న న్యాయవాది ఎస్‌పీ రామరాజుకు తెలిపిన పోలీసు అధికారులు. తర్వాత మాటమార్చి జైలులోనే లైవ్ ఎలక్ట్రిసిటీ వైర్లను కొరకి ఆత్మహత్య చేసుకున్నడని చెప్పారు. మాట మార్చిన విషయం రామరాజు తాను పోలీసులతో జరిపిన సంభాషణలను రికార్డు చేయడం ద్వారా తేటతెల్లమైంది. రామ్‌కుమార్ గదిలో ఏ విద్యుత్ తీగలు లేవుగదా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, చెన్నై నగరంలోని పుజాల్ కేంద్ర కారాగారం-2లోని డెస్పెన్సరి వార్డు వద్ద గోడకు కరెంట్ వైర్లను కొరకడం వల్లన చనిపోయాడని ఓ జైలు పోలీసు అధికారి తెలిపారు.

 రామ్‌కుమార్ విద్యుత్ షాక్‌తో ఆత్మహత్య చేసుకున్నాడని జైలు అధికారులు చెబుతున్నప్పటికీ ప్రత్యక్షంగా ఆ సంఘటనను చూసిన వారు ఎవరూ లేకపోవడం ఒక ప్రశ్నయితే, జైలు గదిలో ఉండాల్సిన రామ్‌కుమార్ బయటకు ఎలా వచ్చాడన్న ప్రశ్న మరొకటైతే, ఒంటరిగా ఎలా వచ్చాడన్నది ఆన్సర్‌లేని ఇంకో ప్రశ్న. యాభై పడకలతో అత్యాధునిక వైద్య సౌకర్యాలు కలిగిన ఆస్పత్రి జైలులోనే ఉండగా, 20 కిలో మీటర్ల దూరంలోవున్న రోయపేటలోని ఆస్పత్రికి రామ్‌కుమార్‌ను ఎందుకు తీసుకెళ్లారన్నది అంతుచిక్కని అసలు ప్రశ్న. రామ్‌కుమార్‌పై చార్జిషీటు దాఖలు చేసి ఇప్పటికే 85 రోజులు గడచి పోయాయి. ఈ వారమే ఆయన బెయిల్‌పై విచారణ జరుగనుంది. చార్జిషీటు దాఖలై 90 రోజులు దాటితే నిందితుడికి బెయిల్ రావడం దాదాపు ఖాయం. బెయిలు వచ్చే ముందు రామ్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడుతాడా? అన్నది మరో ప్రశ్న.

 నిందితుడికి సూసైడల్ టెండెన్సీ ఉందని, తాము అరెస్ట్ చేయడానికి వెళ్లినప్పుడు కూడా నిందితుడు బ్లేడుతో గొంతు కోసుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు చెబుతున్నారు. అదే నిజమైతే 2011లో జాతీయ మానవ హక్కుల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సూసైడల్ టెండెన్సీ ఉన్న నిందితుడిని లేదా దోషిని గదిలో ఒంటరిగా ఉంచరాదు. అలాంటి వారిపై సీసీటీవీ కెమేరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగాలి. ప్రతి, పదిహేను నిమిషాలకు భౌతికంగా వారిని తనిఖీ చేయాలి. ఈ చర్యలు తీసుకొని ఉంటే రామ్‌కుమార్ హత్య లేదా ఆత్మహత్య జరిగి ఉండేది కాదు. గతంలో ఇదే జైలులో యాభై ఆత్మహత్యలు చోటుచేసుకోవడంతో కోర్టుల ఆదేశం మేరకు ఆత్మహత్యలకు ఆస్కారం లేకుండా పలు చర్యలు తీసుకున్నారు.

అయినా ఆత్మ‘హత్య’ జరిగింది ఎలా?2006లోనే ప్రారంభమైన ఈ ఆధునిక భవంతిలో గోడల అంతర్భాగం నుంచే కరెంటు వైర్లు వెళుతున్నప్పుడు అవి గోడల బయటకు ఎలా వచ్చాయి?  తాను అసలు స్వాతిని హత్య చేయలేదని, తాను అమాయకుడినని, పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించలేదని, నేరం ఒప్పుకోకపోతే బ్లేడ్‌తో గొంతుకోసి చంపేస్తామని పోలీసులే తనను బెదిరించారని నిందితుడు రామ్‌కుమార్ తన న్యాయవాది రామరాజు ద్వారా తమిళ టీవీ న్యూస్ ఛానల్ ‘పుతియా తలైమురై’కి ఇచ్చిన లిఖితపూర్వక  ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ఇంటర్వ్యూను ఆ ఛానల్ సోమవారం నాడు ప్రసారం చేసింది.

 టెకీ హత్య కేసులో నిందితుడైన రామ్‌కుమార్ ఆత్మహత్యకు రాష్ర్ట ప్రభుత్వమే బాధ్యత వహించి సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలని అతిపెద్ద దళిత పార్టీ అయిన ‘విద్యుతలై చిరుతలైగల్ కట్చీ’ వ్యవస్థాపక నాయకుడు తోల్ తిరుమవలవన్, డీఎంకే నాయకుడు స్టాలిన్, పౌర హక్కుల ప్రజా సంఘం ప్రధాన కార్యదర్శి వి. సురేశ్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు. జూలై 24వ తేదీన నంగమ్‌బాకమ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న టెకీ స్వాతీని కొడవలతో గొంతుకోసి హత్య చేశారు. అంతపెద్ద రైల్లే స్టేషన్‌లో కూడా సీసీటీవీ కెమేరాలు లేవు. సమీపంలోని చూలైమేడు జనావాస ప్రాంతంలోని సీసీటీవీ కెమేరాలో రామ్‌కుమార్ పరుగెత్తడాన్ని గమనించిన పోలీసులు, అతడే కొన్ని రోజులుగా తమ కూతురు వెంటబడుతున్నారనే స్వాతి తల్లిదండ్రులు తెలపడంతో అతడే హంతకుడిగా భావించి పోలీసులు ఆయన్ని జూలై ఒకటవ తేదీన అరెస్ట్ చేశారు.

 స్వాతి వెంటపడుతున్న మాత్రాన రామ్‌కుమార్ ఆమెను చంపాడన్న నిర్ధారణకు రాలేము. హత్య జరిగిన రోజున రైల్లే స్టేషన్‌కు సమీపాన కనిపించాడన్న కారణంగా అనుమానించవచ్చుగానీ, నిర్ధారించలేం. అలా అని చంపలేదని కూడా భావించలేం. హత్యా ప్రాంతంలో దొరికిన వేలు ముద్రలు లాంటి తదితర ప్రత్యక్ష సాక్షాధారాలను సేకరించి కోర్టు ముందు దోషిని నిరూపించాల్సిందే. అప్పటివరకు ఇది దళిత, అగ్రవర్ణాల మధ్య సున్నితమైన సమస్యగానే మిగిలిపోతుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement