ప్రలోభాల పర్వం మళ్లీ ప్రారంభం | Sakshi
Sakshi News home page

ప్రలోభాల పర్వం మళ్లీ ప్రారంభం

Published Thu, Dec 22 2016 2:01 AM

ప్రలోభాల పర్వం మళ్లీ ప్రారంభం - Sakshi

- నోట్ల రద్దు విషయంలో చంద్రబాబుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత
- ప్రభుత్వంలో రోజురోజుకూ పెరుగుతున్న అవినీతి
- మరోవైపు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సభలకు పోటెత్తుతున్న జనం
- ప్రజల దృష్టిని మళ్లించేందుకు అధికార టీడీపీ యత్నం
- అందులో భాగంగా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనను పార్టీలో చేర్చుకునే యత్నం.. ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని, భర్తకు మంచి పోస్టింగ్‌ ఇస్తామని హామీ


సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మొదట స్వాగతించడం, తర్వాత తూచ్‌ అంటూ మాట మార్చడం, తప్పంతా మీదేనంటూ బ్యాంకర్ల మీదకు నెట్టేయడం... ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరి పట్ల ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత మొదలైంది. రాజధాని నిర్మాణం నుంచి పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల వరకు.. రోజుకొకటిగా బయటపడుతున్న కుంభకోణాలు, మట్టి మొదలు ఇసుక దాకా అధికార పార్టీ నేతలు సాగిస్తున్న దోపిడీ.. వెరసి రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న అవినీతిపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడ సభలు నిర్వహించినా పోటెత్తుతున్న జనసందోహం. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో ఉలికిపాటు మొదలైంది. జనం దృష్టిని మళ్లించేందుకు సీఎం చంద్రబాబు మళ్లీ ప్రలోభాల పర్వానికి తెర తీశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకోవడంపై మరోసారి దృష్టి పెట్టారు.  

ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీలోకి ఇటీవల చేరికలు ఊపందుకున్నాయి. వెల్లంపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్, కాసు మహేష్‌రెడ్డి ఇటీవల పార్టీలో చేరారు.

పార్టీలో చేరడానికి మరికొంత మంది ఉత్సాహం చూపుతున్నారు. పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అధికార పార్టీ నుంచీ చేరికలు ఉంటాయని ఇటీవల సంకేతాలు వెలువడుతున్నాయి. వైఎస్సార్‌సీపీలోకి కొనసాగుతున్న చేరికలు అధికార పక్షానికి కన్ను కుట్టాయి. ఈ నేపథ్యంలో మరోసారి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గాలం వేసి తమ వైపు తిప్పుకోవడానికి ప్రలోభాల పర్వానికి అధికార తెలుగుదేశం పార్టీ తెర లేపింది. తాజాగా కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనపై ప్రలోభాల వల విసిరారు. ఆమె మీద రకరకాల మార్గాల్లో తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారు. ఆమె భర్తకు ఆరోపణల నుంచి ఉపశమనం కలిగించడంతోపాటు మంచి పోస్టింగ్‌లో ఇస్తామని హమీ ఇచ్చినట్లు తెలిసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేశ్‌ రంగంలోకి దిగి.. ఆమెను పార్టీలో తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉప్పులేటి కల్పన బుధవారం ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావుతో భేటీ అయ్యారు.

బలహీన వర్గాల శాసనసభ్యులే టార్గెట్‌
బలహీన వర్గాలకు చెందిన శాసనసభ్యులను అధికార టీడీపీ తమ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. టీడీపీలో చేరితే రూ.20 కోట్లు ఇస్తామంటూ తనను ప్రలోభ పెట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి  వెల్లడించిన విషయం విదితమే. తాజాగా ఉప్పులేటి కల్పనపై కూడా టీడీపీ వల విసురుతోంది. ఆమె గతంలో రెండుసార్లు టీడీపీ టిక్కెట్‌పై పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Advertisement
Advertisement