అప్పుడు దెబ్బతగిలినా నొప్పి ఉండదు! | Sakshi
Sakshi News home page

అప్పుడు దెబ్బతగిలినా నొప్పి ఉండదు!

Published Thu, Nov 12 2015 8:20 AM

అప్పుడు దెబ్బతగిలినా నొప్పి ఉండదు!

లండన్: నడిచేటప్పుడు కాలికి చిన్న రాయి తగిలినా భరించలేనంత నొప్పి కలుగుతుంది. అయితే నిద్రలో నడిచేటప్పుడు మాత్రం ఎంత పెద్ద గాయం అయినా, భవనంపై నుంచి పడి కాలు విరిగినా ఏ మాత్రం నొప్పి ఉండదంట!. అయితే తలనొప్పి, పార్శ్వపునొప్పి(ఒకపక్క తలనొప్పి) ప్రమాదం మాత్రం ఎక్కువగా ఉంటుందంట.

ఈ మేరకు లండన్‌లో నిద్రలో నడిచే వారిపై జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 79 శాతం మంది తాము నిద్రలో నడిచేటప్పుడు గాయం అయినా నొప్పి తెలియదని చెప్పారు. అయితే మెలుకువ వచ్చినప్పడు మాత్రం ఈ బాధేంటో బాగా తెలుస్తోందంట. ముప్పై ఏళ్ల వయసున్న వారిపై జరిపిన ఈ సర్వేలో 55 మంది పురుషులు, 45 మంది మహిళలు పాల్గొన్నారు. నిద్రలో నడిచిన ప్రతిసారీ తమకు కనీసం ఒక గాయం అయ్యిందని 47 మంది వెల్లడించారు.

వీరిలో కేవలం పది మందికి మాత్రమే గాయం అయిన వెంటనే నొప్పి తెలిసిందంట. మిగతా 37 మందికి మాత్రం ఉదయాన్నో లేదా మేల్కొన్న తర్వాత నొప్పి కలిగిందంట. ఉదహారణకు నిద్రలో నడిచే వ్యక్తి మూడో అంతస్తులో ఉంటున్నాడనుకోండి. నిద్రలో నడుస్తూ కిటికిలోంచి కిందకు పడి తీవ్ర గాయాలు అయినా, అప్పుడు నొప్పి తెలియదు. మేల్కొన్న తర్వాత గాయాలు తాలుకూ నొప్పి తెలుస్తుంది. మరో వ్యక్తి తన ఇంటిపై నుంచి పడి కాలు విరిగినా ఉదయం వరకు నిద్రలేవడంట.
 

Advertisement
Advertisement