20 అడుగుల రాచనాగుతో చెడుగుడు! | Sakshi
Sakshi News home page

20 అడుగుల రాచనాగుతో చెడుగుడు!

Published Tue, Nov 1 2016 4:42 PM

20 అడుగుల రాచనాగుతో చెడుగుడు! - Sakshi

  • అతనంటే పాములకు హడల్‌
  • అడవి అయినా.. కొండలైనా.. పాము కనపడితే చాలు పట్టేస్తాడు
  • అతని చేతిలో పాములు నాట్యమాడతాయి
  • అతను పాములను కూర్చోబెట్టి క్లాస్‌ తీసుకుంటాడు
  • 3వేల సార్లు పాము కాటు.. ఆరుసార్లు ఐసీయూ
  •  
    (‘సాక్షి’ స్పెషల్‌ స్టోరీ)
     
    పాములంటే అందరికీ భయమే. తెలిసి తెలిసి ఎవరూ పాముల జోలికి వెళ్లరు. కానీ కేరళలో ఈ యువకుడికి మాత్రం పాములంటే ఎంతో ఇష్టం. పాము కనపడితే వదిలిపెట్టడు. జనం చేతిలో పాములు చావుకుండా కాపాడుతుంటాడు.. క్షేమంగా వాటిని అడవిలో వదిలేస్తుంటాడు. ఎంత ఇష్టమంటే.. పాములు పట్టేటప్పుడు ఆయుధాలు వాడితే అవి ఎక్కడ గాయపడతాయేమోనని ఆలోచిస్తాడు. అందుకే 3వేల సార్లు పాము కాటుకు గురయ్యాడు. దాదాపు మృత్యుఒడిదాకా వెళ్లి వచ్చాడు.  అతనే వావా సురేష్‌.. ఊరు కేరళలోని తిరువనంతపురం. పాములు పట్టడం, వన్య ప్రాణులను సంరక్షించటం అతని హాబీ.
     
    రాచనాగు.. కింగ్‌ కోబ్రా.. పాములన్నింటిలోకెల్లా అత్యంత ప్రమాదకరమైంది. అత్యంత విషపూరితమైంది. ఓ మామూలు నాగుపాము కనిపిస్తేనే మన గుండెలు దడదడా కొట్టుకుంటాయి. దాదాపు 20 అడుగుల నల్లటి కింగ్‌ కోబ్రా కనిపిస్తే ఎలా వుంటుంది. కానీ సురేష్‌కు మాత్రం చాలా ఈజీ.. మనం చేపలు పట్టినంత ఈజీగా అతను కింగ్ కోబ్రాతో చెడుగుడు ఆడేస్తాడు. మొదట పాము బుసలు కొట్టినా సురేష్‌ చేతిలో పడ్డాక తోకముడవాల్సిందే. అదే ఇటీవల జరిగింది. అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లేందుకు కీకారణ్యం లోపలి నుంచి వెళ్లాల్సి వుంటుంది. ఈదారిలో వన్యప్రాణాల నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫారెస్ట్ సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. ఆ మార్గంలో భక్తులకు ఇటీవల ఓ భయంకరమైన కింగ్‌ కోబ్రా కనిపించింది. అత్యంత విషపూరితమైన కింగ్‌ కోబ్రాను పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది కూడా సాహసించలేదు.. అందుకే వావా సురేష్‌ను పిలిపించారు. అప్పటికే కొండరాళ్లమధ్య దూరిన రాచనాగు చేతులతో పట్టుకోవడమే కాదు.. ఒక ఆట ఆడుకున్నాడు.
     
    30వేల పాములు..  3వేల సార్లు  పాము కాట్లు!

    42 ఏళ్ల ఈ సాహసి ఇప్పటివరకు 30వేలకు పైగానే పాములను కాపాడి అడవిలో వదిలాడు. పాములను పట్టేసమయంలో  అతను ఎలాంటి పరికరాలు వాడడు. ఎందుకంటే వాటి వల్ల పాములకు గాయాలవుతాయంటాడు. పాములను పట్టేక్రమంలో 3వేల సార్లు  పాము కాటుకు గురయ్యాడు.  మూడు సార్లు వెంటిలేటర్‌పైన వున్నాడు.. ఆరు సార్లు ఐసీయూలో చేరాడు. అయినా ఇప్పటికీ పాము కనిపిస్తే చాలు దానిని సురక్షితంగా అడవిలో వదిలేయడానికి వెనుకాడడు.
     
    పాముల సైకాలజీ  తెలుసు..!
    పాముల కదలికలను సురేష్‌ బాగా స్టడీ చేశాడు. పాముల సైకాలజీ ఎలా వుంటుందో.. ఏ పాము ఎలా కాటేస్తుందా కూడా అతనికి తెలుసు. పడగ విప్పిన నాగుపాము కనిపిస్తే మనం అంతదూరం పారిపోతాం. కానీ సురేష్‌ పాముల పడగల మధ్య దర్జాగా కూర్చుంటాడు. పాములన్నీంటినీ వరుసలో కూర్చోబెట్టి క్లాస్‌ తీసుకుంటాడు. వాటితో ఆటాడిస్తాడు. 

    చిన్నప్పటినుంచీ ఇంతే.. 

    నిరుపేద కుటుంబంలో పుట్టిన సురేష్‌కు చిన్నప్పటి నుంచి పాములంటే ఇష్టం. 12ఏళ్ల వయసులోనే ఓ బేబీ కోబ్రాను పట్టుకొచ్చి ఇంట్లో దాచుకున్నాడు. పాము ప్రవర్తను అర్ధం చేసుకునేదాకా ఆ బేబీ కోబ్రాను తనతోనే వుంచుకున్నాడు. 2012లో కేరళ సర్కారు సురేష్‌కు అటవీ శాఖలో ఉద్యోగం ఆఫర్‌ చేసింది. అయితే అతను దాన్ని నిరాకరించాడు. 2013లో ఒక విషనాగు కాటేయటంతో దాదాపు మృత్యు ఒడిదాకా వెళ్లి వచ్చాడు. అయినా పాములను పట్టడం మానలేదు. పాములు పట్టడంలో అతని సాహసం గురించి తెలిసిన ఎవరైనా హ్యాట్సాప్‌ అంటారు.
     

Advertisement
Advertisement