చైనా చిత్రాలు.. | Sakshi
Sakshi News home page

చైనా చిత్రాలు..

Published Mon, Apr 10 2017 9:14 PM

some unusual circumstances in China

ప్రపంచంలోని అగ్రదేశాల్లో ఒకటిగా కొనసాగుతున్న చైనా అనేక అసాధారణ అంశాలకు నిలయం. అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశమైనప్పటికీ, చైనా ఆర్థికంగా ప్రగతిపథంలో పయనిస్తోంది. పారిశ్రామికంగా అనుసరిస్తున్న విధానాలతో చైనా అగ్రదేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. చైనాలో ఉన్న కొన్ని అసాధారణ పరిస్థితుల గురించి తెలుసుకుందాం..

బొద్దింకల పెంపకం..
మనం ఇంట్లో ఒక్క బొద్దింక కనబడితేనే అసహ్యించుకుంటాం. అలాంటిది ఒకే చోట లక్షల సంఖ్యలో బొద్దింకలుంటే.. అమ్మో అటు వైపు కన్నెత్తి కూడా చూడం అంటారు కదూ. కానీ అవే బొద్దింకలు చైనాలో భారీ ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నాయి. బొద్దింకల్ని పలు ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. గుండె జబ్బులు, టీబీ, రక్త నాళాలకు సంబంధించిన జబ్బుల నివారణకు ఉపయోగపడే ఔషధాల తయారీలో బొద్దింకలు ఉపయోగపడుతున్నాయి. దీంతో చైనాలో చాలా మంది బొద్దింకల పెంపకాన్ని చేపడుతున్నారు. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉండడంతో బొద్దింకల పెంపకం మంచి లాభాసాటిగా మారింది. లక్షల సంఖ్యలో బొద్దింకల్ని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల అక్కడ వీటిని ఆహారంగా కూడా తీసుకుంటున్నారు.

డబ్బాల్లో స్వచ్ఛమైన గాలి..
కొన్ని దశాబ్దాల క్రితం ప్రపంచంలో ఎక్కడైనా గాలి, నీరు ఉచితంగానే లభించేవి. అవి కూడా పూర్తి స్వచ్ఛంగా. కానీ ఇప్పుడు కాలం మారింది. స్వచ్ఛమైన మంచి నీటిని దాదాపు అందరూ కొనుక్కుని తాగాల్సి వస్తోంది. అయితే గాలిని కొనుక్కునే పరిస్థితులు ఇంకా రాలేవు. కానీ చైనాలో మాత్రం స్వచ్ఛమైన గాలి కావాలంటే కొనుక్కోవాల్సిందే. ఇప్పటికే అక్కడి నగరాల్లో గాలిని చిన్న చిన్న క్యాన్లలో అమ్మేస్తున్నారు. ఎందుకంటే చైనాలో వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వాయు కాలుష్యం అధికంగా ఉండే దేశాల్లో చైనా ఎప్పుడూ ముందుంటుంది. వాహనాలు, పరిశ్రమలు అధికంగా ఉండడం వల్ల గాలి కలుషితమవుతోంది. దీంతో పొగ, మంచు ప్రభావంతో నగర ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ దొరకడం లేదు. ఫలితంగా గాలిని కొనుక్కోవాల్సి వస్తోంది. విపరీతంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టకపోతే, ఏ దేశంలోనైనా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు.

స్టోర్లలో షార్కుల అమ్మకం..
చైనీయులు మాంసాహారానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఏ రకమైన జంతువునైనా వారు ఆహారంగా తీసుకోగలరు. మేకలు, గొర్రెలు మాత్రమే కాదు.. కుక్కలు, ఎలుకలు, సాలెపురుగులు, కీటకాలు వంటివి అన్నింటినీ అక్కడి వీధుల్లో విక్రయిస్తుంటారు. అయితే చిత్రంగా షార్కులను కూడా అమ్మడం విచారకర అంశం. ఓ వైపు ప్రపంచ దేశాలు, జంతు ప్రేమికులు షార్కుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. వాటిని వేటాడడాన్ని అనేక దేశాలు నిషేధించాయి. షార్క్‌ చేపలు, తిమింగళాలు వంటి జలచరాల్ని వేటాడడాన్ని నేరంగా పరిగణిస్తున్నారు. కానీ చైనాలోని కొన్ని పెద్ద సూపర్‌ మార్కెట్లలో షార్క్‌ చేపల్ని విక్రయిస్తున్నారు. వీటితోపాటు మొసళ్లను కూడా అమ్మకానికి పెడుతున్నారు. కప్పలు, ఎండ్రకాయలు, బాతులు, పాములు, ఇతర సరీసృపాలు.. ఇలా ఒకటేమిటి.. అన్ని రకాల మాంసాహార జీవులనూ విక్రయిస్తారు. ఈ తరహా మాంసం లభించే దేశం మరోటి కనిపించదు.

రక్షణలో బాతులు..
ఏ దేశంలోనైనా పోలీసులు రక్షణలో భాగంగా కుక్కలను వినియోగిస్తారు. సైన్యంలోనూ వీటి వినియోగం ఉంటుంది. వీటికి ఉండే తెలివితేటల, ఘ్రాణశక్తి పోలీసులకు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే శునకాల వినియోగం తప్పనిసరి. కానీ చైనాలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కుక్కలకు బదులుగా బాతులను వినియోగిస్తున్నారు. సాధారణంగా బాతులు, మనుషులతో స్నేహంగా మెలుగుతాయి. ఇవి తమ ప్రదేశంలోకి వచ్చే కొత్త వ్యక్తులను పసిగట్టడంలో చురుగ్గా ఉంటాయి. కంటిచూపు బావుంటుంది. అవసరమైనప్పుడు దుడుకుగా వ్యవహరిస్తాయి. అందువల్ల ఏ ప్రాంతంలోనైనా గస్తీ కావాల్సి ఉంటే వీటిని పోలీసులు అక్కడ వినియోగిస్తున్నారు. పైగా ఇవి చాలా వేగంగా కదులుతాయి. కుక్కలు సమర్ధంగా పనిచేసినప్పటికీ, కొందరు దుండగులు వాటికి విషం కలిపిన ఆహారం అందించి వాటిని చంపేస్తున్నారు. దీంతో కుక్కలకు బదులుగా బాతులను వాడుతున్నారు.

భారీ ట్రాఫిక్‌ జామ్‌లు..
మన దేశంలో అరగంటో, గంటో ట్రాఫిక్‌ జామ్‌ అయితేనే చిరాకుపడిపోతుంటాం. కానీ ఇది చైనాలో నిత్య కృత్యం. ఎందుకంటే అక్కడ జనాభా ఎక్కువ. వారికి వాహనాలు ఎక్కువే. వాహనాలు అత్యధిక సంఖ్యలో ఉంటాయి కాబట్టి, నిత్యం ట్రాఫిక్‌ జామ్‌లు అవుతుంటాయి. ఇది అక్కడ ప్రజల్ని ఎక్కువగా ఇబ్బందిపెట్టే అంశం. సాధారణ రోజుల్లోనే చైనాలో గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌లు ఉంటాయి. ఇక పండుగల సందర్భాల్లో అయితే ఇది మరీ అధికం. ప్రత్యేక వేడుకల సందర్భంగా ప్రజలు నగరాల నుంచి తమ సొంత ఊర్లకు వెళ్తుంటారు. దీంతో హైవేలన్నీ వాహనాలతో నిండిపోతాయి. ముఖ్యంగా టోల్‌గేట్ల వద్ద ఈ రద్దీ ఎక్కువగా ఉంటుంది. గంటలు కాదు.. కొన్ని సార్లు రోజుల తరబడి వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఘటనలు ఉన్నాయి. ట్రాఫిక్‌ జామ్‌ విషయంలో చైనాదే ప్రపంచ రికార్డు. ఓ సారి అత్యధికంగా పది రోజులపాటు ట్రాఫిక్‌జామ్‌ కొనసాగింది. ఈ పది రోజులూ రోడ్డుపైనే వాహనాలు ఆగిపోవడంతో, అందులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటివి అక్కడ నిత్యకృత్యం.

– సాక్షి, స్కూల్‌ ఎడిషన్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement