'మోదీ.. మన్కీ బాత్ కాదు, జనతాకీ బాత్ విను' | Sakshi
Sakshi News home page

'మోదీ.. మన్కీ బాత్ కాదు, జనతాకీ బాత్ విను'

Published Tue, Aug 4 2015 11:42 AM

'మోదీ.. మన్కీ బాత్ కాదు, జనతాకీ బాత్ విను' - Sakshi

న్యూఢిల్లీ: అవినీతి మంత్రులు రాజీనామా చేయాలంటూ సభలో నిరసన తెలిపిన కారణంగా తమ పార్టీకి చెందిన 25 మంది ఎంపీలను లోక్ సభ నుంచి సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని మండిపడింది. సభ్యుల సస్పెన్షన్ ను నిరసిస్తూ మంగళవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఇతర విపక్ష పార్లీలతో కలిసి బీజేపీపై ముప్పేట దాడికి పూనుకొంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు బీజేపీపై నిప్పులు చెరిగారు.

'సభను సజావుగా నడపడం ప్రభుత్వ విధి. అలా చేయకుండా విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం. 25 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యుల సస్పెన్షన్ తో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హత్యచేసింది' అని సోనియా గాంధీ అన్నారు. ప్రతిపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అసరం ప్రభుత్వానికి తప్పనిసరని మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యానించారు. ఆ తరువాత మాట్లాడిన రాహుల్.. 'ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు రాజీనామా చేయాలని కోరిది మేమే కాదు.. యావత్ దేశం కోరుతోంది. మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మోదీ.. అంతకంటే ముందు ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవాలి' అని చురకలంటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement