త్వరలోనే భారత్‌కు చోటా రాజన్! | Sakshi
Sakshi News home page

త్వరలోనే భారత్‌కు చోటా రాజన్!

Published Sat, Oct 31 2015 4:09 AM

త్వరలోనే భారత్‌కు చోటా రాజన్!

ఆదివారం ఇండోనేషియాలో అన్సారీ పర్యటన
అమల్లోకి రానున్న ఒప్పందాలు
 
 బాలి/న్యూఢిల్లీ: ఇండోనేషియాలో పట్టుబడ్డ అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌ను భారత్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య నేరస్తుల అప్పగింత, పరస్పర న్యాయ సహకారం అంశాలపై ఒప్పందాలు జరిగాయని.. వీటి ఆధారంగా రాజన్‌ను భారత్ తరలించేందుకు మార్గం సుగమం అవుతుందని.. ఇండోనేసియాలోని భారత రాయబారి గుర్జిత్ సింగ్ తెలిపారు. నేరస్తుల అప్పగింతపై 2011లోనే ఒప్పందం కుదిరిందని.. అయితే ఆదివారం భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఇండోనేసియా రానున్న సందర్భంగా.. అధికారికంగా నేరస్తుల అప్పగింత మొదలవుతుందని తెలిపారు.

రాజన్‌ను వీలైనంత త్వరగా భారత్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, హోంశాఖ, తమ శాఖ కలిసి పనిచేస్తున్నాయని విదేశాంగ   ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. మరోవైపు.. ఇండోనేసియా పోలీసుల ఆధీనంలో ఉన్న రాజన్‌ను ఆయన న్యాయవాది ఫ్రాన్సికో ప్రస్సార్ కలిశారు. పోలీసులు శుక్రవారం రాజన్‌ను ఆరుగంటలు ప్రశ్నించారు. భారత్‌లో చేసిన వివిధ నేరాలపై విచారించారు. అతడు తమకు సహకరించాడని తెలిపారు. ఈ విచారణపై భారత  దౌత్యకార్యాలయానికి  నివేదిక సమర్పించారు. తనకు ప్రాణాపాయం ఉందని  రాజన్ భావిస్తే.. తన న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేయవచ్చని బాలి నగర పోలీసులు తెలిపారు. రెండ్రోజుల్లో భారత అధికారులు బాలికి వెళ్లి.. రాజన్‌ను తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement