కోచ్‌కు చుక్కలు చూపెడుతున్న శ్రీలంక! | Sakshi
Sakshi News home page

కోచ్‌కు చుక్కలు చూపెడుతున్న శ్రీలంక!

Published Thu, Aug 24 2017 9:00 AM

కోచ్‌కు చుక్కలు చూపెడుతున్న శ్రీలంక! - Sakshi

వరుస ఓటములతో శ్రీలంక క్రికెట్‌ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ కావడం.. ఆ వెంటనే జరిగిన తొలి వన్డేలోనూ చిత్తుగా ఓడటం ఆ జట్టును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికి తోడు శ్రీలంక తాత్కాలిక కోచ్‌ నిక్‌ పొథాస్‌ చేసిన వ్యాఖ్యలు క్రికెట్‌ బోర్డును ఇరకాటంలో పడేశాయి.

అనేక మంది పెద్దలు జోక్యం చేసుకోవడమే శ్రీలంక జట్టు ప్రస్తుత దుస్థితికి కారణమని పొథాస్‌ నిందించాడు. క్రికెటర్ల సెలక్షన్‌ మొదలు, జట్టు కూర్పు, వ్యూహాల అమలు, విధాన నిర్ణయాలు వంటి విషయాల్లో ఎక్కువమంది జోక్యం చేసుకుంటుండటం వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, కోచ్‌ మీడియా వేదికగా ఇలా బాహాటంగా తమను వేలెత్తిచూపడం శ్రీలంక క్రికెట్‌ బోర్డు పెద్దలకు నచ్చలేదు. శ్రీలంక సెలక్షన్‌ కమిటీ చీఫ్‌గా లెజెండ్‌ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య కొనసాగుతుండగా, జట్టు మేనేజర్‌గా అసంకా గురుసిన్హా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కోచ్‌ పొథాస్‌ వ్యాఖ్యలపై శ్రీలంక బోర్డు పెద్దలు కన్నెర్ర జేసినట్టు తెలుస్తోంది. దీంతో కోచ్‌ పొథాస్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ తన వ్యాఖ్యలను తక్కువచేసి చూపే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్‌ సవ్యంగా ఉందని, ప్రస్తుత దుస్థితిని నుంచి జట్టును బయటపడేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పొథాస్‌ వివరణ ఇచ్చాడు. బోర్డులోని పెద్దల జోక్యం ఎక్కువ అవ్వడం వల్లే శ్రీలంక క్రికెట్‌ సంక్షోభానికి కారణమన్న తన గత వ్యాఖ్యలపై ఆయన మాట మార్చాడు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని, తన ఉద్దేశం అది కాదని చెప్పుకొచ్చాడు. మొత్తానికి బోర్డు పెద్దలకు చెడ్డపేరు రాకుండా నష్టనివారణ చర్యల దిశగా కోచ్‌ మీడియా సమావేశం సాగింది. కోచ్‌ను బోర్డు పెద్దలు మందలించారని, వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే భారత్‌తో రెండో వన్డేకు ముందు హుటాహుటిన తన వ్యాఖ్యలపై కోచ్‌ పొథాస్‌ మీడియాకు వివరణ ఇచ్చుకున్నాడని లంక క్రికెట్‌ వర్గాలు అంటున్నాయి.

Advertisement
Advertisement