అవినీతిపై దర్యాప్తులో ‘స్టే’ వద్దు | Sakshi
Sakshi News home page

అవినీతిపై దర్యాప్తులో ‘స్టే’ వద్దు

Published Sat, Sep 24 2016 12:43 AM

అవినీతిపై దర్యాప్తులో ‘స్టే’ వద్దు - Sakshi

‘ఓటుకు కోట్లు’పై సుప్రీం స్పష్టీకరణ
 
 సాక్షి, న్యూఢిల్లీ: అవినీతిపై దర్యాప్తు జరిపేందుకు సంబంధిత న్యాయస్థానం ఆదేశాలిచ్చినప్పుడు ఏ ఇతర న్యాయస్థానాలు ఆ దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు ఆస్కారం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటుకు కోట్లు కేసు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు పాత్రపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ ద్వారా హైకోర్టులో స్టే తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది.

ఈ పిటిషన్ విచారణకు రాగానే... పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ, ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తున్నట్టు మౌఖికంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా విచారణకు హాజరైనందున వాదనలు వినేందుకు ధర్మాసనం అంగీకరించి ఈ ఉత్తర్వులను చివరలో సవరించింది. ‘హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎస్సెల్పీ ద్వారా సవాలు చేశారు. అందువల్ల మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోజాలం. దాని కారణంగా ఈ ఎస్‌ఎల్‌పీని డిస్మిస్ చేస్తున్నాం. అయితే హైకోర్టులో ఈ పిటిషన్ నాలుగు వారాల్లో రావాల్సి ఉందని పిటిషనర్, ప్రతివాది అంగీకరించారు. అందువల్ల హైకోర్టు నేటి నుంచి నాలుగు వారాల్లోగా ‘తుది నిర్ణయం’(పిరెంప్టరిలీ) తీసుకోవాలని సూచిస్తున్నాం..’ అని ఉత్తర్వులు జారీచేసింది. ఒకవేళ అమలుకాని పక్షంలో తిరిగి సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛనిచ్చింది.

 దర్యాప్తు ఆపేందుకు వీలు లేదు..
 ‘ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అలాంటప్పుడు ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదు..’ అని లూథ్రా తన వాదనలు వివరించబోయారు. దీనికి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే స్పందిస్తూ... ‘ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సంబంధిత కోర్టు దర్యాప్తునకు ఆదేశించినప్పుడు ఏ కోర్టులు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా సెక్షన్-19 (3) బి, సెక్షన్-19 (3) సి అడ్డుపడుతున్నాయి కదా. ఏ కోర్టులకూ అధికారం లేదు.. మీరు దీన్ని అంగీకరిస్తారు కదా. అందువల్ల దర్యాప్తును ఆపేందుకు వీలు లేదు..’ అని పేర్కొన్నారు. తిరిగి న్యాయవాది లూథ్రా వాదిస్తూ... ‘ఇది రాజకీయంగా ప్రేరేపితమైంది. ఇదివరకే ఒక ఎఫ్‌ఐఆర్ ద్వారా దర్యాప్తు జరుగుతోంది.

మళ్లీ కొత్తగా దర్యాప్తు చేయడమేంటి?’ అంటూ వాదించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ... ‘రాజకీయ వైరం ఇక్కడ ఒక అంశమే కావొచ్చు.. నేను అంగీకరిస్తాను. కానీ సెక్షన్-19(3)ని పరిశీలించండి..’ అని సూచించారు. దీనికి న్యాయవాది తిరిగి... ‘హైకోర్టు స్టే ఇచ్చింది. దర్యాప్తు పెండింగ్‌లో ఉంది. నా క్లయింట్ ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి. దర్యాప్తు జరుపుతున్నది తెలంగాణ ఏసీబీ విభాగం. అదే ఇక్కడ ఇబ్బంది. పైగా ఫిర్యాదుదారుకు ఈ కేసుతో సంబంధం లేదు. ఆయన థర్డ్ పార్టీ. ఒకే కేసులో సమాంతరంగా రెండు దర్యాప్తులు ఎలా కొనసాగుతాయి..’ అని వాదించారు. దీనికి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే స్పందిస్తూ... ‘మీరు హైకోర్టులో దర్యాప్తు నిలిపివేయాలని కోరారా? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్‌లోని సెక్షన్-19 అడ్డుపడుతోందని తెలుసు కదా..’ అని మరోసారి ప్రశ్నించారు. తిరిగి లూథ్రా వాదిస్తూ... ‘ఒకే కేసులో సమాంతరంగా రెండు దర్యాప్తులు జరిగేందుకు చట్టం అంగీకరించదు.. సీఆర్‌పీసీ సెక్షన్-210 కింద ఫిర్యాదు చేస్తే మేజిస్ట్రేట్ సెక్షన్-156 కింద ఆదేశాలు జారీచేశారు.. దర్యాప్తు పూర్తయి చార్జిషీట్ దాఖలు చేసిన కేసులో మళ్లీ దర్యాప్తు చేయాలని ఎలా ఆదేశిస్తారు..?’ అని పేర్కొన్నారు. జస్టిస్ బాబ్డే స్పందిస్తూ... హైకోర్టు ఎప్పటివరకు వాయిదా వేసిందని ప్రశ్నించగా... ఎనిమిది వారాలకు వాయిదా వేసిందని న్యాయవాది బదులిచ్చారు.

 ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటే ఎలా..?
 ఈ సందర్భంలో పిటిషనర్ తరపు న్యాయవాది శేఖర్ నాప్డే తన వాదనలు వినిపించారు. ‘నిందితుడి పాత్రపై దర్యాప్తు జరపాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మేం సాక్ష్యాధారాలు కూడా సమర్పించాం. రెండు దర్యాప్తులు జరగరాదని అంటున్నారు. అసలు మొదటి దర్యాప్తు ఎక్కడ కొనసాగుతోంది? అసలు దర్యాప్తు జరగడం లేదు..’ అని పేర్కొన్నారు. దీనికి జస్టిస్ బాబ్డే స్పందిస్తూ తాము పిటిషన్‌లోని అన్ని వివరాలు పరిశీలించామని చెప్పారు. ఏళ్ల తరబడి దర్యాప్తు పెండింగ్‌లో ఉండరాదనేదే తమ వాదనని నాప్డే తెలిపారు. అలా పెండింగ్‌లో ఉండదు.. కంగారు పడకండని జస్టిస్ బాబ్డే భరోసా ఇచ్చారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై నేటి నుంచి నాలుగు వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ తరపు న్యాయవాది ఈ ఉత్తర్వులు అమలు కానిపక్షంలో సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించాలని కోరగా ధర్మాసనం అందుకు సమ్మతించింది.
 
 కుట్రకు బ్రేకులు పడ్డాయి
 ఏ కేసు పడ్డా స్టే తెచ్చుకుని కాలయాపన చేసే కుట్రకు సుప్రీం కోర్టు బ్రేకులు వేసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టంలోని సెక్షన్-12 కింద చంద్రబాబు ముద్దాయి. 120 బి ఐపీసీ కింద ముద్దాయిగా ఏసీబీ కోర్టులో కేసు నమోదైంది. కానీ తెలంగాణ ఏసీబీ విభాగం ఈ కేసులో చంద్రబాబు ప్రమేయాన్ని చాప కింద కప్పేశారు. ఈ విషయం మేం కోర్టు దృష్టికి తీసుకురాగా... విచారణ చేయమని ప్రత్యేక కోర్టు ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. ఈ రోజు సుప్రీం కోర్టుకు వచ్చాం. ఈరోజు నుంచి నాలుగు వారాల్లోపు హైకోర్టు పరిష్కరించాలని, లేనిపక్షంలో సుప్రీం కోర్టుకు రావొచ్చని ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
     - పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పిటిషనర్ తరఫు న్యాయవాది
 
 సత్యమేవ జయతే
 ఈ కేసులో చంద్రబాబు  ముద్దాయని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏసీబీ కోర్టు విచారణకు ఆదేశిస్తే చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. దీంతో మేం సుప్రీంకోర్టును ఆశ్రయించాం. సుప్రీం ముందు స్టే ఇచ్చింది. తరువాత వాదనలు విన్నాక నాలుగు వారాల్లోగా పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌ను పరిష్కరించాలని ఆదేశించింది. హైకోర్టు తేల్చని పక్షంలో మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. ఇప్పటికైనా చంద్రబాబు  తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు సహకరించాలి. న్యాయస్థానాలను గౌరవించడం నేర్చుకోవాలని కోరుతున్నా. సత్యమేవ జయతే అన్న రీతిలో న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నాం.     
     - ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
 
 హైకోర్టులో కేసు ఇదీ..
 తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు లంచం అడ్వాన్స్‌గా ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వీడియో సాక్షిగా రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడిన ఆడియో టేపులు 2015జూన్7న పలు చానళ్లలో ప్రసారమయ్యాయి. ఆడియో, వీడియో టేపులు అసలైనవేనని ఎఫ్‌ఎస్‌ఎల్ జూలై 26న తుది నివేదిక ఇచ్చింది. ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీటులో చంద్రబాబు పేరు 20 సార్లు ప్రస్తావించింది.దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగకపోవడంతో... బాబు పాత్రపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్-12, ఐపీసీ సెక్షన్-120(బి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆగస్టు 8, 2016న ప్రత్యేక కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు వేశారు. నేర విచారణ చట్టం సెక్షన్-210 కింద విచారణ చేపట్టాలని కోరారు.సాక్ష్యాధారాలను ఉంచారు.దీంతో బాబు పాత్రపై దర్యాప్తునకు ఏసీబీని ప్రత్యేక కోర్టు ఆదేశించింది.ఆ నివేదికను సెప్టెంబరు 29లోగా సమర్పించాలని   ఆదేశించింది. దీంతో బాబుసెప్టెంబరు 2, 2016న హైకోర్టును ఆశ్రయించగా... ప్రత్యేక న్యాయస్థానం  ఉత్తర్వులను హైకోర్టు నిలిపేసింది. ఫిర్యాదునకు సంబంధించి  చర్యలన్నింటినీ నిలుపుదల చేసి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.దీంతో ఎమ్మెల్యే ఆళ్ల ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు.

Advertisement
Advertisement