Sakshi News home page

అక్కాచెల్లెళ్లు.. కాదు తల్లీకూతుళ్లు!

Published Tue, Oct 27 2015 11:51 AM

అక్కాచెల్లెళ్లు.. కాదు తల్లీకూతుళ్లు!

ఈ ఫొటోలో కనిపిస్తున్న లిసా వెబ్, ఫ్లెయర్ మాన్యువల్ మధ్య వయస్సులో తేడా 18 నెలలు మాత్రమే. వీరి పోలికలు చూస్తే ఎవరైనా అక్కాచెల్లెళ్లేమో అనుకుంటారు. కానీ వీరు వరుసకు తల్లీకూతుళ్లు. 44 ఏళ్ల లిసా వెబ్ తండ్రి చిన్న భార్య ఫ్లెయర్ మాన్యువల్. సవతి తల్లి ఫ్లెయర్ తన కంటే 18 నెలలు చిన్నదని, ఆమెను మొదట్లో చూసినప్పుడు తన తమ్ముడి గర్ల్ఫ్రెండ్ గా చాలామంది పొరపడ్డారని లిసా చెప్తారు. పాశ్చాత్య దేశాల్లో భార్యాభర్తలు విడిపోవడాలు, మళ్లీ పెళ్లిలు చేసుకోవడాలు సర్వసాధారణమే. ఈ నేపథ్యంలో తన కంటే చిన్నదైన సవతి తల్లి గురించి తన అనుభవాలను లిసా మీడియాతో పంచుకుంది. ప్రస్తుతం భర్త నుంచి విడాకులు తీసుకొని బ్రిటన్ లోని సర్రెలో ఒంటరిగా ఉంటున్న లిసాకు 20 ఏళ్ల కొడుకు నికోల్, 16 ఏళ్ల కూతురు నవోమి ఉన్నారు. ఆమె అభిప్రాయాలు ఆమె మాటల్లోనే..

మా నాన్న రే ఆడవాళ్ల మనిషి. ఆయన ఎప్పుడూ తన కొత్త గర్ల్ఫ్రెండ్స్ ను పరిచయం చేస్తూ ఉండేవారు. అదేవిధంగా 26 ఏళ్ల కిందట ఫ్లెయర్ను నాకు, నా తమ్ముడికి పరిచయం చేశాడు. అప్పుడు ఆమె వయస్సు 18 ఏళ్లు. ఆమె కూడా మాకో సవతి తల్లి అవుతుందని అప్పుడు అనుకోలేదు. అప్పుడు మాతో ఆమె సన్నిహితంగా ఉండేది. ఆమెను మా తమ్ముడి గర్ల్ఫ్రెండ్ గా చాలామంది పొరపడేవారు.

ఈ 26 ఏళ్లకాలంలో ఆయన చాలామంది మహిళలను మారుస్తూ వచ్చారు. నేను నాలుగేళ్ల వయస్సులోనే ఉన్నప్పుడు  అమ్మను విడిచిపెట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో మహిళను పెళ్లి చేసుకొని మార్క్ అనే కొడుకును కన్నాడు. ఆ బంధమూ ఎక్కువకాలం నిలువలేదు. ఆ తర్వాత జూలీ అనే మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆరు నెలలకే వారి పెళ్లి పెటాకులైంది. ఆ తర్వాత ఫ్లెయర్ తో ప్రేమాయణం సాగించాడు. నీ కూతురి వయస్సున్న ఆమె (20)ను ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పినా ఆయన వినిపించుకోలేదు. అంతేకాకుండా ఆమె అచ్చం నాలాగే ఉంటుంది. నన్ను చూడనివారు ఆమె, నేను ఒకటేనని పొరపడే అవకాశముంది.

అయినా ఆయన ఈ విషయాలేవి పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్నినెలలకే ఫ్లెయర్ గర్భవతి అయింది. పరిస్థితి ఇంకా దిగజారింది. ఆమెతో మాట్లాడాలంటే మనస్సు ఒప్పేది కాదు. నా కంటే 20 ఏళ్లు చిన్నవాడైన తమ్ముడు భూమిమీదకు వచ్చాడు. మొదట ఈ పరిస్థితులన్నీ చాలా తీవ్రంగా అనిపించి బాధేసినా.. క్రమంగా నేను అర్థం చేసుకోసాగాను. ఇప్పుడు ఫ్లెయర్ నాకు మంచి స్నేహితురాలు. ఆమెను సవతి తల్లిగా, ఆమె కొడుకు తమ్ముడిగా స్వీకరించగలుగుతున్నాను. నాలుగో పెళ్లి చేసుకున్న ఫ్లెయర్ ను నా తండ్రి విడిచిపెట్టినా.. మా మధ్య ఈ అనుబంధం మాత్రం మారదు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement