ఫెడ్, ఆర్‌బీఐ చర్యలే కీలకం..! | Sakshi
Sakshi News home page

ఫెడ్, ఆర్‌బీఐ చర్యలే కీలకం..!

Published Mon, Dec 16 2013 12:46 AM

ఫెడ్, ఆర్‌బీఐ చర్యలే కీలకం..! - Sakshi

 న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ల తదుపరి గమనాన్ని ఇప్పుడు కేంద్ర బ్యాంకులు నిర్దేశించనున్నాయి. ఇటు రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తన మధ్యంతర త్రైమాసిక పాలసీ సమీక్షను ఈ నెల 18న చేపట్టనుండగా... అమెరికా ఫెడరల్ రిజర్వ్(ఫెడ్) పాలసీ సమీక్ష కూడా ఈ నెల 17, 18 తేదీల్లో జరగనుంది. ఈ రెండింటిలో తీసుకోబోయే చర్యలే మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయని నిపుణులు చెబుతున్నారు. సహాయ ప్యాకేజీల ఉపసంహరణ(ట్యాపరింగ్)పై ఫెడ్ రానున్న సమీక్షలో నిర్ణయాన్ని ప్రకటించవచ్చనే అంచనాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం నెలకు 85 బిలియన్ డాలర్ల బాండ్ల కొనుగోలు ప్యాకేజీలో కనీసం 10 బిలియన్ డాలర్ల కోత ఉండొచ్చనేది నిపుణుల అంచనా. మరోపక్క, ధరల మంట నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ 18న పాలసీ సమీక్షలో మరోవిడత కీలక వడ్డీరేట్లను పెంచొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
 
 నేడు టోకు ధరల గణాంకాలు...
 నవంబర్ నెలకు సంబంధించిన టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు నేడు(సోమవారం) వెలువడనున్నాయి. అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 7 శాతానికి(ఎనిమిది నెలల గరిష్టం) ఎగబాకడం తెలిసిందే. ఇదిలావుండగా... తాజాగా వెలువడిన గణాంకాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం అనూహ్యంగా దూసుకెళ్లడం ఆర్‌బీఐ పాలసీపై ప్రభావం చూపనుంది. నవంబర్‌లో రిటైల్ ధరల పెరుగుదల రేటు ఏకంగా 1.07 శాతం ఎగబాకి 11.24 శాతానికి చేరడం తెలిసిందే. అక్టోబర్‌లో ఈ రేటు 10.17 శాతంగా ఉంది. దీంతో ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్లను పెంచడం ఖాయమంటున్నారు పరిశీలకులు. ‘నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం భారీ పెరుగుదల నేపథ్యంలో టోకు ద్రవ్యోల్బణం కూడా పెరిగితే... ఆర్‌బీఐ రెపో రేటు(ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ) అర శాతం పెరగవచ్చని ఇండియా ఇన్ఫోలైన్ పేర్కొంది. సెప్టెంబర్‌లో ఆర్‌బీఐ పగ్గాలు చేపట్టిన తర్వాత వరుసగా రెండు సమీక్షల్లో రాజన్ పావు శాతం చొప్పున వడ్డీరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెపో రేటు 7.75 శాతం, రివర్స్ రెపో 6.75 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్) 8.75 శాతంగా కొనసాగుతున్నాయి.
 
 పార్లమెంట్ సమావేశాలపైనా దృష్టి...
 ఈ నెల 9న ఆల్‌టైమ్ గరిష్టాలను తాకిన తర్వాత ప్రధాన సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ వరుసగా నాలుగు రోజులపాటు(సెన్సెక్స్ 611 పాయింట్లు పతనం) తిరోగమించాయి. రిటైల్ ధరల సెగతో ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపుభయాలు తాజాగా మార్కెట్లను పడగొట్టాయి. శుక్రవారం 210 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 20,715 వద్ద ముగిసింది. అయితే, వరుసనష్టాల నేపథ్యంలో సోమవారం టెక్నికల్ బౌన్స్‌బ్యాక్‌కు అవకాశం ఉందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు. ప్రధానంగా ఓవర్‌సోల్డ్ షేర్లు పుంజుకోనున్నాయన్నారు.
 
 కాగా, కార్పొరేట్ల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులను(ఆదివారంతో గడువు ముగిసింది) బట్టి వచ్చే నెలలో మొదలవనున్న ఆర్థిక ఫలితాల(క్యూ3)పై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని... దీంతో వీటి గణాంకాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంకా పార్లమెంట్ ప్రస్తుత శీతాకాల సమావేశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నారు. కీలకమైన ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ), బీమా చట్టాల సవరణ తదితర బిల్లులకు ఈసారి మోక్షం కలుగుతుందా అనేది కూడా మార్కెట్లకు కీలకమేననేది నిపుణుల అభిప్రాయం.
 
 కొనసాగుతున్న ఎఫ్‌ఐఐల జోరు
 విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటిదాకా దేశీ స్టాక్స్‌లో 1.4 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8,500 కోట్లు) నిధులను నికరంగా కుమ్మరించారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించడంతో.. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించగలదన్న విశ్వాసంతో ఎఫ్‌ఐఐలు పెట్టుబడులకు మరింత ముందుకొస్తున్నారని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్ల మొత్తం నికర పెట్టుబడులు 18.9 బిలియన్ డాలర్లు(సుమారు రూ.1.05 లక్షల కోట్లు)గా లెక్కతేలింది. కాగా, డెట్ మార్కెట్లో మాత్రం ఎఫ్‌ఐఐలు తిరోగమనంలోనే ఉన్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా రూ.3,795 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు. జనవరి నుంచి ఈ నెల 13 వరకూ రూ.52,343 కోట్ల పెట్టుబడులను ఎఫ్‌ఐఐలు వెనక్కి తీసుకున్నట్లు సెబీ గణాంకాలు చెబుతున్నాయి.
 
 

Advertisement
Advertisement