Sakshi News home page

స్టాక్స్ వ్యూ

Published Mon, Jan 18 2016 12:49 AM

Stocks Overview

స్పైస్‌జెట్
కొనొచ్చు

బ్రోకరేజ్ సంస్థ: ఆనంద్ రాఠి సెక్యూరిటీస్
ప్రస్తుత ధర: రూ.74
టార్గెట్ ధర: రూ.150

 
ఎందుకంటే: దాదాపు దివాళా స్థితిలో ఉన్న ఈ కంపెనీ పగ్గాలను  గత ఏడాది జనవరిలో ఈ కంపెనీ మాజీ ప్రమోటర్ అజయ్ సింగ్ చేపట్టారు. కంపెనీ పునరుజ్జీవింపజేయడానికి కొత్త యాజమాన్యం పలు చర్యలు తీసుకుంది.  సామర్థ్యాన్ని, ఆదాయాన్ని పెంచడం, విమాన సర్వీసుల హేతుబద్ధీకరణ, విమానాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం, కీలక మార్కెట్లలో విమాన సర్వీసుల పెంపు, వ్యయాల తగ్గింపు తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. పెరుగుతున్న డిమాండ్‌కనుగుణంగా విమానాల సంఖ్యను పెంచింది.  అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతుండడం విమానయాన రంగాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం, వేతనాల పెరుగుదల, ఫస్ట్‌క్లాస్ రైల్వే చార్జీలతో పోల్చితే విమాన చార్జీలు ఒకింత చౌకగా ఉండడం వంటి అంశాల కారణంగా మొత్తం విమానయాన రంగమే టర్న్‌అరౌండ్ కానున్నదని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 32గా ఉన్న ఉన్న విమానాల సంఖ్య మరో రెండేళ్లలో 52కు పెంచుకోనున్నది. ప్రతి నెలా 90 శాతం లోడ్ ఫ్యాక్టర్‌ను సాధిస్తోంది. మొత్తం విమాన యాన సంస్థ వ్యయాల్లో 40 శాతంగా ఉంటే ఇంధన వ్యయాలు 40 శాతం తగ్గడంతో కంపెనీ  మొత్తం ఆదాయంలో 46 శాతంగా ఉన్న ఇంధన వ్యయాలు 33 శాతానికి తగ్గాయి. గత ఏడాది జనవరిలో 9 శాతంగా ఉన్న ఈ కంపెనీ మార్కెట్ షేర్ అదే ఏడాది నవంబర్‌లో 13 శాతానికి ఎగసింది. 2018 మార్చి కల్లా 18 శాతానికి పెరగగలదని అంచనా. వీటన్నింటి ఫలితంగా రెండేళ్లలో ఆదాయం 17 శాతం, ఇబిటా 41 శాతం, నికర లాభం 62 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం.
 
ఇండస్‌ఇంద్ బ్యాంక్
కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ సెక్యూరిటీస్
ప్రస్తుత ధర: రూ.921
టార్గెట్ ధర: రూ.1,125

ఎందుకంటే: ముంబై కేంద్రంగా  కమర్షియల్, ట్రాన్సాక్షనల్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ సేవలనందిస్తోంది.1994 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిడ్ సైజ్  ప్రైవేట్ రంగ బ్యాంక్ ఇది. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 854 బ్రాంచీలు, 1,578 ఏటీఎంలతో  ఖాతాదారులకు సేవలందిస్తోంది.  లండన్, దుబాయ్, అబూదాబిల్లో ప్రాతినిధ్య కార్యాలయాలున్నాయి.  ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర లాభం 30 శాతం వృద్ధి చెంది రూ.580 కోట్లకు పెరిగింది. రుణ వృద్ధి 29 శాతంగా ఉంది. రిటైల్ రంగ రుణాలు 27 శాతం, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 7 శాతం వృద్ధిని సాధించాయి. వాణిజ్య వాహన రుణాలు 31 శాతం పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్లు 3 బేసిస్ పాయింట్లు పెరిగి 3.91 శాతానికి చేరాయి. కీలకమైన ఫీజు ఆదాయం 30 శాతం పెరిగింది. కార్పిరేట్ రుణ వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, రుణ నాణ్యత స్థిరంగా ఉంది. మొండి బకాయిలు 1 శాతానికి దిగువనే ఉన్నాయి. మార్జిన్ల అధికంగా ఉండే రిటైల్ రంగ రుణాలపై దృష్టిసారిస్తోంది. ఫలితంగా నికర వడ్డీ మార్జిన్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ఆదాయ, నికర లాభాల వృద్ధి పటిష్టంగా ఉండడం, రుణ నాణ్యత నిలకడగా ఉండడం బ్యాంక్‌కు కలసివచ్చే అంశాలు.  ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా రూ.1,125కు చేరుతుందనే అంచనాలతో ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయవచ్చని రికమెండ్ చేస్తున్నాం. 2017 నాటికి బ్రాంచీల సంఖ్యను 1,200కు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 
టీసీఎస్
కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్
ప్రస్తుత ధర: రూ.2,264
టార్గెట్ ధర: రూ.2,854

ఎందుకంటే: టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కంపెనీ భారత మల్టీ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీ. ముంబై కేంద్రంగా ఐటీ, కన్సల్టింగ్, బిజినెస్ సొల్యూషన్స్ అందిస్తోంది. 46కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌లో ఇదే టాప్ ఐటీ కంపెనీ. ఈ కంపెనీ క్యూ3 ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయం అంచనాలను అందుకోలేకపోయినా, ఇబిటా, నికర లాభాలు అంచనాలను మించాయి.  అంతర్జాతీయ వ్యాపారం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 1 శాతం పెరిగింది. ఇబిటా మార్జిన్ 27 శాతం పెరిగింది. నికర లాభం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 0.9 శాతం వృద్ధితో రూ.6,110 కోట్లకు పెరిగింది. ఉద్యోగుల వినియోగం 85 శాతంగా ఉంది. ఐటీ సేవల్లో ఆట్రీషన్(ఉద్యోగుల వలస) 15%గా ఉంది. అధిక ఆదాయం వచ్చే ఇద్దరు క్లయింట్లు కలుపుకొని మొత్తం 9 మంది కొత్త క్లయింట్లు ఈ క్యూ3లో లభించినట్లు కంపెనీ పేర్కొంది.ఐటీ బడ్జెట్/వ్యయాలపై తమ క్లయింట్ల నుంచి ఎలాంటి ప్రతికూల లేదా తగ్గింపు సంకేతాలు అందలేదని కంపెనీ చెబుతోంది. రెండేళ్లలో కంపెనీ ఆదాయం డాలర్ టర్మ్‌ల్లో 10 శాతం, రూపాయి టర్మ్‌ల్లో 14 శాతం  చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతుందని అంచనా.  2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.98గా ఉన్న షేర్ వారీ ఆర్జన (ఈపీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.138కు పెరుగుతుందని భావిస్తున్నాం. కీలకమైన అమెరికా, యూరప్‌ల్లో మరిన్ని డీల్స్ సాధిస్తామని కంపెనీ ఆశావహంగాఉంది. ఇబిటా మార్జిన్లు 26-28 శాతం రేంజ్‌లో ఉంటాయని  ధీమాగా ఉంది. రెండేళ్లలో కంపెనీ ఇబిటా 15 శాతం, నికర లాభం 13 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం.
 
 

Advertisement
Advertisement