మెసేజ్‌ల స్టోరేజీ తప్పనిసరి | Sakshi
Sakshi News home page

మెసేజ్‌ల స్టోరేజీ తప్పనిసరి

Published Tue, Sep 22 2015 2:57 AM

మెసేజ్‌ల స్టోరేజీ తప్పనిసరి

కొత్త ముసాయిదాలో కేంద్రం సూచన
న్యూఢిల్లీ: మొబైల్, కంప్యూటర్ల ద్వారా సందేశాలను పంపే వినియోగదారులు, సంస్థలు తప్పనిసరిగా 90 రోజులపాటు ఆ సందేశాలను నిక్షిప్తంచేయాలంటూ కొత్తగా సిద్ధంచేసిన ‘సంకేత నిక్షిప్త సందేశాల పాలసీ’ ముసాయిదాలో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది. కొత్త ముసాయిదా ప్రకారం... వాట్సప్, ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ లేదా మరే ఇతర సేవల ద్వారా మొబైల్, కంప్యూటర్‌లో వచ్చే సందేశాలను మూల వాక్యాల రూపం(ప్లేన్ టెక్ట్స్ ఫార్మాట్)లో దాచి ఉంచాలి.

పరిశీలన, అధ్యయనం నిమిత్తం భద్రతా సంస్థలు అడిగినపుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. నిక్షిప్తం చేయడంలోగానీ, అందివ్వడంలోగానీ విఫలమైతే చట్టపరంగా చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. సంకేత నిక్షిప్త సందేశాల సాధనాలను ఆపరేటర్లు ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థలు, పౌరులు తమ అధికార, అనధికార సమాచారాన్ని మొత్తం అందివ్వాల్సి ఉంటుంది.

చట్టబద్ధ సంస్థలు, కార్యనిర్వాహక సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, విద్యాసంస్థలను ‘బి’ కేటగిరీగా విభజించారు. పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులను ‘సి’ కేటగిరీగా విభజించారు. ఈ కేటగరీల్లోని వారంతా మెసేజ్‌లు పంపిన రోజు నుంచి 90 రోజులపాటు వాటిని భద్రపరచాలి. విదేశాల్లో ఉండే వారితో, సంస్థలతో జరిపిన సంప్రదింపుల సందేశాలనూ అందివ్వాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న వారిదే. వాట్సప్, వైబర్, లైన్, గూగుల్ చాట్, యాహూ మెసెంజర్ ఇలా అధునాతన మెసేజింగ్ సర్వీసుల్లో అత్యంత స్థాయి భద్రతతో సంకేత సందేశాలు నిక్షిప్తంచేస్తారు.

ఇలాంటి వాటిలోని సమాచారాన్ని సేకరించడం భద్రతా సంస్థలకు కష్టంగా మారడంతో కొత్తగా ఈ తరహా పాలసీని తెస్తున్నారు. అసలు గోప్యత అనేదే లేకుండా తెస్తున్న ఈ పాలసీపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ వారు తయారుచేసిన ఈ ముసాయిదాపై ప్రజలు తమ అభిప్రాయాలను అక్టోబర్ 15లోగా కేంద్రానికి తెలపాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement