Sakshi News home page

జాక్వెలిన్ ఎందుకలా చేసింది?

Published Tue, Aug 2 2016 11:05 AM

Story of an Athlete Who Lost Race But Won Hearts


ఎవరైనా పోటీలో ఎందుకు పాల్గొంటారు? గెలవడానికే కదా! మరి జాక్వెలిన్ అలా చేసిందేంటి? డీహైడ్రేట్ అయిపోయి దాదాపు పరుగెత్తలేకపోతున్న పోటీదారుడికి మంచినీళ్లు అందించింది. అంతేనా, అతను మళ్లీ పుంజుకునే వరకూ వెన్నంటి ఉంది. ఫలితంగా రేసులో ఓడిపోయింది. ఫస్ట్ ప్రైజ్ ద్వారా వచ్చే డబ్బుతో బతుకు చక్కదిద్దుకోవచ్చని.. ఎక్కడో కెన్యా నుంచి వచ్చి చైనాలో ఓడిపోయింది. కానీ మనిషిగా గెలిచింది. మానవత్వాన్ని గెలిపించింది. ఏమైనా లాభం ఉదంటారా?

కెన్యాకు చెందిన జాక్వెలిన్ నైతెపీ కిప్లిమో.. చాలా మంది ఆఫ్రికన్ అథ్లెట్లలాగే పేదరికంలో పుట్టింది. కఠోరమైన దైనందిన జీవితమే వాళ్లను కఠినంగా.. ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేధించగల బాణాలుగా తయారుచేస్తుంది. అప్పటికే మారథాన్ రన్నింగ్ రేసుల్లో పలు విజయాలు సాధించిన జాక్వెలిన్.. 2010లో చైనాలో జరిగిన జెంగ్ కయి అంతర్జాతీయ మారథాన్ పోటీలో పాల్గొంది. జెంగ్షూ నగరంలో ఆ పోటీల్లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అథ్లెట్లు పాల్గొంటారు. మొత్తం 42 కిలోమీటర్ల రేసు. దివ్యాంగులు సైతం పెద్ద సంఖ్యలో పోటీ పడే రేసు ఇదే కావడం గమనార్హం. కళ్లులేనివాళ్లు కుక్కల సాయంతో నడవొచ్చు లేదా పరుగెత్తొచ్చు. అలా నాటి పోటీ ప్రారంభమైన చాలా సేటికి..

జాక్వెలిన్ పక్కగా చేతులు లేని చైనీస్ రన్నర్ ఒకరు పరుగెత్తాడు. కొద్దిసేపటి తర్వాత ఒంట్లో నీరంతా చెమటగా బయటికెళ్లడంతో అతను డీ హైడ్రేట్ అయిపోయాడు. ఇది గమనించిన జాక్వెలిన్ ట్రాక్ పక్కనే ఉంచిన మంచినీళ్ల బాటిల్ ను తీసుకుని, అతనికి అందించింది. మొండి చేతులతో నీళ్లు తాగిన ఆ చైనీస్ రన్నర్ కాస్త కుదుటపడ్డాడు. మళ్లీ దాహం వేస్తే అతనికి నీళ్లెవరు అందిస్తారు? అందుకే 28 కిలోమీటర్లు అతనితోపాటే పరుగెత్తింది జాక్వెలిన్! పోటీ చివరిదశలో తప్పక ఒంటరిగా.. వేగంగా పరుగెత్తింది. కానీ రేసులో గెలవలేకపోయింది. రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

చాలా మంది ఉద్యోగులు అసహ్యించుకునే సోమవారాన్ని ఉల్లాసభరితంగా మార్చే క్రమంలో కొందరు నెటిజన్లు ట్విట్టర్ లో #MondayMotivation పేరుతో తమను ఇన్ స్పైర్ చేసిన, తెలిసిన స్ఫూర్తిదాయక వ్యక్తుల గురించి పోస్టులు పెడుతుంటారు. అలా ఆగస్టు 31న హర్ష్ జియోంకా అనే వ్యక్తి జాక్వెలిన్ కు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశాడు. 'జాక్వెలిన్.. ఓ సంచలన స్ఫూర్తి' అంటూ మిగతవారు ఆమెకు జేజేలుకొడుతూ సోమవారంనాడు స్ఫూర్తిదాయకంగా గడిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement