మేం ‘రా’ గూఢచారులమన్న కథనాల వల్లే..! | Sakshi
Sakshi News home page

మేం ‘రా’ గూఢచారులమన్న కథనాల వల్లే..!

Published Mon, Mar 20 2017 1:19 PM

మేం ‘రా’ గూఢచారులమన్న కథనాల వల్లే..!

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని కరాచీలో అదృశ్యమైన ఇద్దరు మతగురువులు సోమవారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. వారు సాయంత్రం విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ను కలువనున్నారు. కరాచీలోని తన సోదరిని చూసేందుకు మేనల్లుడు సయ్యద్‌ నజీమ్‌ అలీ నిజామీతో కలసి హజ్రత్‌ నిజాముద్దీన్‌ దర్గా(ఢిల్లీ) ప్రధాన గురువు సయ్యద్‌ ఆసిఫ్‌ నిజామీ ఈ నెల 8న వెళ్లారు. ఆ తర్వాత వారు కనిపించకుండాపోయారు.

ఈ నేపథ్యంలో పాక్‌ ప్రధాని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌తో సుష్మాస్వరాజ్‌ ఫోన్‌లో మాట్లాడారు. వీరి ఆచూకీ కనుగొనాలని కోరారు. దీంతో కనిపించకుండా పోయిన వారిద్దరూ కరాచీలో క్షేమంగానే ఉన్నారని పాక్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని సుష్మాస్వరాజ్‌ ఆదివారం ట్విట్టర్‌లో తెలిపారు. పాక్‌లో వారు సురక్షితంగా ఉన్నారని, సోమవారం తిరిగి రానున్నారని వెల్లడించారు.

పాకిస్థాన్‌లోని  ఉమ్మత్‌ దినపత్రిక తమ గురించి తప్పుడు కథనాలు రాసిందని, తాము భారత విదేశాంగ నిఘా సంస్థ రా గూఢచారులమని పేర్కొంటూ ఫొటోలు ప్రచురించిందని, అందువల్లే ఇంత గందరగోళం చోటుచేసుకున్నదని నజీమ్‌ నిజామీ తెలిపారు.

 

 

Advertisement
Advertisement