అదును చూసి మోదీ ‘సర్జికల్‌’దాడులు | Sakshi
Sakshi News home page

అదును చూసి మోదీ ‘సర్జికల్‌’దాడులు

Published Sat, Oct 1 2016 6:50 PM

అదును చూసి మోదీ ‘సర్జికల్‌’దాడులు - Sakshi

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయి భారత సైనిక దళాలు నిర్దిష్ట దాడులు నిర్వహించడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక్కసారిగా హీరో అయ్యారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని చేసిన వాగ్దానం ఏమైంది? అచ్చేదిన్‌ ఎప్పటికీ వచ్చేను? కోటి ఉద్యోగాల మాట అటకెక్కిందా? పఠాన్‌కోట్‌పై దాడికి ప్రతీకారం లేదా? గోసంరక్షుకుల పేరిట దళితులపై జరిగిన దాడుల పాపం ఎవరిది? కశ్మీర్‌లో సామాజిక రాజకీయ అస్థిర పరిస్థితులకు బాధ్యులెవరూ ? అంటూ రెండేళ్లుగా విపక్షాలు చేస్తున్న విమర్శలను ‘సర్జికల్‌’ దాడులతో మోదీ తిప్పికొట్టారు.

పాకిస్థాన్‌ పట్ల మోదీ చూపిన తెగువతో విపక్షాలన్నీ అస్త్రసన్యాసం చేసి ‘నమో మోదీ’ అనక తప్పలేదు. పలు రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీకి పాక్‌పై దాడులు కలసివచ్చిన అవకాశం. కలిసొస్తుందనే ఉద్దేశంతోనే వ్యూహాత్మక దాడులకు ఆదేశాలిచ్చారేమో! భారత్‌ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్న పాకిస్థాన్‌ అన్నంతపని చేయకూడదని ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల బరిలోకి దిగిన ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆప్‌ లాంటి పార్టీలు కోరుకోక తప్పదేమో!

పాకిస్థాన్‌ కనుక ప్రతికార దాడులకు పాల్పడితే భారత్‌ పూర్తిస్థాయి దాడులకు దిగక తప్పదు. రానున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను కురిపించే రాజకీయ అస్త్రం ఇదేకనుక. కాశ్మీర్‌లో రాజకీయ, సామాజిక అస్థిర పరిస్థితులు లేనప్పుడే కాశ్మీర్‌ను ఓ ఆయుధంగా చేసుకొని ఎన్నికల్లో లబ్ధి పొందిన చరిత్ర మన రాజకీయ పార్టీలకు ఉంది. ఇప్పుడు అదే కాశ్మీర్‌ అంశంపై పాక్‌తో కయ్యం పెద్దది చేయడానికి బీజేపీ ఏమీ వెనకాడదు. పైగా బీజీపీకి జాతీయవాదం కలిసొచ్చే అంశం.

మోదీ భవిష్యత్‌ ప్రణాళికను బీఎస్‌పి నాయకురాలు మాయావతి ముందుగానే పసిగట్టినట్టున్నారు. ఆజంగఢ్, సహరాన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభల్లో ఇటీవల మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కశ్మీర్‌ అంశాన్ని సాకుగా తీసుకొని పాకిస్థాన్‌పై యుద్ధం చేస్తారని కూడా ఆమె ఆరోపించారు. ఒకవేళ యుద్ధమే జరిగితే తాను ముందే చెప్పానంటూ దళిత ఓట్లను ఆమె రక్షించుకోవచ్చు. ఉనా లాంటి సంఘటనలను అక్కడి దళితులు అప్పుడే మరచిపోకపోవచ్చు. కానీ జాతీయవాదాన్ని భుజానెత్తుకునే అగ్రవర్ణాలు మోదీవైపు మొగ్గుచూపరా? జాతీయవాదాన్ని, వారి చారిత్రక రాష్ట్ర అవసరాలను వేర్వేరుగా చూసే మనస్థత్వం కలిగిన పంజాబీలపై మోదీ ప్రభావం ఉండకపోవచ్చు. అకాలీదళ్‌–బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారు రాష్ట్ర ప్రయోజనాలకే ఎక్కువ విలువనిచ్చే అవకాశం ఉంది.                 
–––ఓ సెక్యులరిస్ట్‌ కామెంట్‌

Advertisement
Advertisement