సుల్తాన్‌బజార్ ఆస్పత్రికి ఉస్మానియా యూనిట్లు | Sakshi
Sakshi News home page

సుల్తాన్‌బజార్ ఆస్పత్రికి ఉస్మానియా యూనిట్లు

Published Wed, Jul 29 2015 12:52 AM

సుల్తాన్‌బజార్ ఆస్పత్రికి  ఉస్మానియా యూనిట్లు

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
 
హైదరాబాద్: నేటి నుంచి ఉస్మానియా ఆస్పత్రిలో నాలుగు వైద్య విభాగాలు, రోగుల తరలింపు ప్రక్రియ మొదలుకానుంది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో, మెడికల్‌గ్యాస్ట్రో విభాగాలను సుమారు 400 పడకలున్న సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. ఉస్మానియా ఆసుపత్రిలోని పాత భవనంలో ఉన్న 18 యూనిట్లను సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి, ప్రసూతి యూనిట్‌ను పేట్లబురుజుకు తరలించనున్నట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం టీజీడీఏ నాయకులు డాక్టర్ రమేశ్, వీరేశం, పుట్ల శ్రీనివాస్ ఇతర అధికారులతో కలసి మంత్రి సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని సందర్శించారు. ఉస్మానియా ఆసుపత్రి నుంచి వచ్చే యూనిట్లకు వార్డులు అనువుగా ఉన్నాయా, లేవా అనే విషయాలను డీఎంఈ డాక్టర్ రమణి, ఆసుపత్రి సూపరిండెంటెంట్‌లను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ నిపుణుల సలహాల మేరకు 105 సంవత్సరాల ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని పునర్నిర్మించనున్నట్లు చెప్పారు.

ఉస్మానియా నుంచి వచ్చే యూనిట్లు ఇవే..
ఉస్మానియా ఆసుపత్రి నుండి సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రికి రానున్న యూనిట్లు జనరల్ మెడిసన్-8, జనరల్ సర్జరీ-8, మెడిక ల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ , సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ యూనిట్లను తరలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం 740 పడకలు సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రిలో కొనసాగుతాయని చెప్పారు. ఇవి కేవలం ఏడాదే అక్కడ కొనసాగుతాయని తెలిపారు.

ఇతర 5 ఆసుపత్రులలో..
ఉస్మానియా ఆసుపత్రిలో అవుట్‌పేషెంట్(ఓపీ)తోపాటు ఎమర్జెన్సీ విభాగాలు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి  తెలిపారు. నాంపల్లి, మలక్‌పేట్, గోల్కొండ, వనస్థలిపురం, కొండాపూర్ ఏరియా ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్‌కేర్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం కింగ్‌కోఠి ఆసుపత్రికి ఆర్థోపెడిక్ రోగులను వైద్యుల పర్యవేక్షణలో తరలించనున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర వైద్యం అందించేందుకు పటిష్టమైన రవాణా ఏర్పాటు సైతం చేస్తున్నట్లు చెప్పారు. మార్చురీ ఉస్మానియా ఆసుపత్రిలో కొనసాగుతుందని తెలిపారు.  
 
 

Advertisement
Advertisement