భారత్‌లో ఎయిర్‌బస్ ‘తయారీ’! | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఎయిర్‌బస్ ‘తయారీ’!

Published Sun, Apr 12 2015 1:47 AM

ఫ్రెంచ్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ వద్ద భారత విద్యార్థులతో సెల్ఫీ తీసుకుంటున్న మోదీ

ఔట్‌సోర్సింగ్‌ను 200 కోట్ల డాలర్లకు పెంచుతామన్న ఫ్రాన్స్ కంపెనీ
- విమాన కర్మాగారాన్ని సందర్శించిన మోదీకి ‘ఎయిర్‌బస్’ వెల్లడి
- మొదటి ప్రపంచ యుద్ధం స్మారకాన్ని సందర్శించిన భారత ప్రధాని

తౌలోస్ (ఫ్రాన్స్): భారత ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఫ్రాన్స్‌కు చెందిన విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ మద్దతు తెలిపింది. భారత్‌లో  తయారు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

భారత్‌లో తమ ఔట్‌సోర్సింగ్‌ను 200 కోట్ల డాలర్లకు పెంచనున్నట్లు తెలిపింది. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం తౌలోస్‌లోని ఎయిర్‌బస్ విమాన కర్మాగారాన్ని సందర్శించిన సందర్భంగా ఆ సంస్థ పై విధంగా స్పందించింది. సంస్థ సీఈఓ టామ్ ఎండర్స్ మోదీకి స్వాగతం పలికారు. కర్మాగారంలో ఎ380 ఎయిర్‌బస్‌ను తుదిగా రూపొందించే ప్రక్రియను మోదీ పరిశీలించారు. భారత్‌లో ప్రస్తుతం 4 ఎ380 విమానాలు ప్రతి రోజూ సేవలందిస్తున్నాయని ఈ సందర్భంగా టామ్ ఒక ప్రకటనలో తెలిపారు.

భారత్‌తో బలమైన పారిశ్రామిక బంధాన్ని నెలకొల్పుకోవాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ పిలుపుకు మేం మద్దతిస్తున్నాం. భారత్‌లో తయారు చేయటానికి మేం సిద్ధం’’ అని చెప్పారు. భారత్‌లో ఎయిర్‌బస్ గ్రూపు సంస్థలు ప్రస్తుతం.. పౌర విమానయానం, రక్షణ రంగాలకు సంబంధించి రెండు వేర్వేరు ఇంజనీరింగ్ కేంద్రాలను, ఒక పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం (ఆర్ అండ్ టీ) కేంద్రాన్ని  నిర్వహిస్తోంది. వీటిలో ప్రస్తుతం 400 మందికి పైగా అత్యంత అర్హతలున్న వారు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.

ఈ కేంద్రాలను విస్తరించాలన్న తమ నిర్ణయాన్ని టామ్ ఎండర్స్ వెల్లడించారు. విమానాలను తుదిగా అసెంబుల్ చేసే కర్మాగారాలను, సైనిక రవాణా విమానాలు, హెలికాప్టర్లకు సరఫరా సంస్థలు, సంబంధిత మౌలిక సదుపాయాలను నెలకొల్పాలని తాము భావిస్తున్నట్లు వివరించారు. ఎయిర్‌బస్ సంస్థ భారత్‌లో తమ ఔట్‌సోర్సింగ్‌ను ప్రస్తుతమున్న 40 కోట్ల డాలర్ల నుంచి 200 కోట్ల డాలర్లకు పెంచనున్నట్లు ప్రధాని మోదీతో చెప్పిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఆ తర్వాత ట్వీటర్‌లో వ్యాఖ్యానించారు.
 
ఫ్రాన్స్‌లో భారత అమర జవాన్లకు మోదీ నివాళులు
ప్రధాని మోదీ ఫ్రాన్స్‌లో రెండో రోజు పర్యటనలో భాగంగా లిల్లె నగరానికి వెళ్లి.. అక్కడి మొదటి ప్రపంచయుద్ధ స్మారకాన్ని సందర్శించారు. 1914-18 మధ్య కాలంలో ఫ్రాన్స్ సరసన జర్మనీతో పోరాడుతూ మరణించిన 10,000 మంది భారతీయ సైనికులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడ పలువురు భారతీయులు సమావేశమై ‘వందేమాతరం’ నినాదాలు చేశారు. ఈ స్మారక చిహ్నాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే కావటం విశేషం. అనంతరం ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ స్టేట్ స్టడీస్ (సీఎన్‌ఈఎస్)ను కూడా మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ తనచుట్టూ చేరిన యువ విద్యార్థులతో ఆయన ‘సెల్ఫీ’ ఫొటోలు దిగారు.

Advertisement
Advertisement