బొగ్గు గనుల కేటాయింపులపై తప్పు జరిగింది: కేంద్రం | Sakshi
Sakshi News home page

బొగ్గు గనుల కేటాయింపులపై తప్పు జరిగింది: కేంద్రం

Published Fri, Jan 10 2014 1:54 AM

బొగ్గు గనుల కేటాయింపులపై తప్పు జరిగింది: కేంద్రం - Sakshi

న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపుల్లో ఏదో తప్పు జరిగిందని కేంద్రం అంగీకరించింది. ఇదే అదనుగా బీజేపీ ఒత్తిడి పెంచింది. తప్పు జరిగిందని అంగీకరించినందున ప్రధానమంత్రి రాజీనామా చేయూలని డిమాండ్ చేసింది. ప్రధాన ప్రతిపక్షం డిమాండ్‌ను కాంగ్రెస్ తోసిపుచ్చింది. బొగ్గు బ్లాకుల కేటాయింపు ప్రక్రియ మరింత మెరుగైన రీతిలో జరిగి ఉండాల్సిందంటూ కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు నివేదించింది. మంచి అభిప్రాయంతోనే తాము నిర్ణయం తీసుకున్నప్పటికీ ఏదో తప్పు దొర్లినట్టుగా ఉందని అటార్నీ జనరల్ జీఈ వాహనవతి పేర్కొన్నారు.
 
 కొంత దిద్దుబాటు చేయూల్సిన అవసరం ఉందని కూడా జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని సుప్రీం త్రిసభ్య ధర్మాసనానికి ఆయన చెప్పారు. తద్వారా బొగ్గు బ్లాకుల కేటాయింపులో ప్రభుత్వం పొరపాట్లకు పాల్పడిందనే విషయూన్ని కేంద్రం దాదాపు అంగీకరించినట్టయింది. మరింత మెరుగైన రీతిలో కేటాయింపుల కసరత్తును జరిపి ఉండాల్సిందని ధర్మాసనం అభిప్రాయపడిన నేపథ్యంలో ఏజీ పైవిధంగా స్పందిం చారు. సుప్రీం అభిప్రాయంతో తానూ ఏకీభవిస్తున్నానని వాహనవతి పేర్కొన్నారు.  
 
 ప్రధాని తప్పుకోవాలి: బొగ్గు కేటాయింపుల్లో తప్పు జరిగిందని అంగీకరించినందున ప్రధాని మన్మోహన్‌సింగ్ పదవినుంచి తప్పుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. తీవ్రమైన అవకతవకలు చోటు చేసుకున్నట్టుగా ఏజీ చెప్పినందున.. 2006-2009 మధ్య బొగ్గు శాఖను నిర్వహించిన ప్రధానే ఇందుకు బాధ్యత వహించాలని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బొగ్గు బ్లాకుల కేటాయింపుతో సంబంధమున్న ఆ శాఖకు చెందిన ఇద్దరు సహాయ మంత్రులు, పీఎంఓ అధికారులపై చర్యల విషయంలో సీబీఐ మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. సహాయమంత్రి దాసరి నారాయణరావు పాత్రపై ప్రశ్నలు ఉత్పన్నమైనప్పటికీ ఆయన్నింతవరకు విచారించలేదన్నారు.  ఈ కుంభకోణంలో ఎంతోమంది భాగస్వాములున్నారని, రూ.50 లక్షల కోట్ల విలువైన బొగ్గు బ్లాకులను దాదాపు ఉచితంగా కట్టబెట్టారని ఆరోపించారు.

Advertisement
Advertisement