రేసుగుర్రాలు | Sakshi
Sakshi News home page

రేసుగుర్రాలు

Published Tue, Apr 19 2016 3:01 AM

రేసుగుర్రాలు - Sakshi

* సీఎం అభ్యర్థుల నియోజకవర్గాలు సిద్ధం
* తిరువారూర్‌లో కరుణ
* ఆర్కేనగర్‌లో అమ్మ
* ఉలందూర్ పేటలో కెప్టెన్
* పెన్నగరంలో అన్బుమణి
* సీపీఎం, సీపీఐ జాబితాల విడుదల
* 11 మందితో వీసీకే తొలి జాబితా
* నేడు తమాకా, టీఎన్‌సీసీ జాబితాలు

సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. సీఎం కుర్చి కైవసానికి నాలుగు కూటములకు చెందిన అభ్యర్థుల నియోజకవర్గాలు ఖరారయ్యాయి.

తిరువారూర్ నుంచి కరుణానిధి, ఆర్కేనగర్ నుంచి అమ్మ జయలలితలు ఇప్పటికే రేసులో దిగారు. ఇక, ఉలందూర్ పేట నుంచి ప్రజా సంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి కెప్టెన్ విజయకాంత్, పీఎంకే కూటమి అభ్యర్థి అన్భుమణి రాందాసు పెన్నాగరం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగా రు. ఇక, సీపీఎం, సీపీఐలు తమ జాబితాల్ని ప్రకటించగా, 11 మందితో వీసీకే తొలి జాబితా ప్రకటించింది. తమిల మానిల కాంగ్రెస్, టీఎన్‌సీసీ జాబితాలు వెలువడనున్నాయి.
 
డీఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమి , డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి, పీఎంకే కూటమి, బీజేపీ కూటమిలు పంచముఖ సమరంగా  అసెంబ్లీ ఎన్నికల రేసులో దిగిన విషయం తెలిసిందే. ప్రధాన పోటీ డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య ఉన్నా, తామూ ప్రత్యామ్నాయమే అంటూ డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి, పీఎంకే కూటమి, బీజేపీ కూటమిలు పరుగులు తీస్తున్నాయి. సీఎం కుర్చీని తామంటే తాము కైవసం చేసుకుంటామని ఎన్నికల రేసులో ఢీకొడుతున్నారు.

ఓటమి ఎరుగని యోధుడిలో వరుస విజయాలతో దూసుకొస్తున్న డీఎంకే అధినేత కరుణానిధి ఆరోసారి సీఎం పగ్గాలు చేపట్టేందుకు తగ్గ వ్యూహ రచనలతో ముందుకు సాగుతూ, మళ్లీ తిరువారూర్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. మళ్లీ సీఎం పగ్గాలు లక్ష్యంగా ఎన్నికల్లో క్లీన్ స్వీప్ నినాదంతో ముందుకు సాగుతున్న అమ్మ జయలలిత మళ్లీ ఆర్కేనగర్ నుంచి రేసులో నిలబడ్డారు. ఈ రెండు కూటముల సీఎం అభ్యర్థుల నియోజకవర్గాలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. మిగిలిన కూటముల సీఎం అభ్యర్థులు ఏ ఏ స్థానాల్ని ఎంపిక చేసుకుంటారో అన్న ఎదురు చూపులు నెలకొంటూ వచ్చాయి.

మూడో సారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కేందుకు డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి కెప్టెన్ విజయకాంత్ మళ్లీ సిట్టింగ్ స్థానాన్నే ఎంపిక చేసుకోవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, వ్యూహాత్మకంగా స్థానాన్ని మార్చారు. తొలి సారిగా చిదంబరం నుంచి ఒక్కడే అసెంబ్లీ మెట్లు ఎక్కినా, తదుపరి రిషి వందియం నుంచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన విజయకాంత్ ఈ సారి ఉలందూరు పేట నుంచి సీఎం పగ్గాలు చేపట్టి తీరుతానన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

ఇక, తొలి సారిగా 2014 లోక్ సభ ఎన్నికల బరిలో  ప్రత్యక్షంగా  దిగిన  నేత అన్భుమణి రాందాసు. ఆ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి పార్లమెంట్ మెట్లు ఎక్కిన అన్భుమణి ప్రస్తుతం తమిళనాడు సీఎం కుర్చీ లక్ష్యంగా ఉరకలు తీస్తున్నారు. పీఎంకే కూటమి సీఎం అభ్యర్థిగా రేసులో ఉన్న ఆయన తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్ని ప్రత్యక్షంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. అయితే, లోక్ సభ ఎన్నికల్లో తనకు భారీ మెజారిటీ ఇచ్చిన ధర్మపురి జిల్లా పెన్నగరం అసెంబ్లీ నియోజక వర్గాన్ని ఎంపిక చేసుకోవడం విశేషం.

ఈ నాలుగు కూటముల సీఎం అభ్యర్థుల నియోజకవర్గాల  ప్రకటనతో ఇక, ఆయా స్థానాల్లో ప్రాధాన్యత సంతరించుకుని ఉన్నది. వీవీఐపీ నియోజకవర్గాల జాబితాలో ఆ నాలుగు చేరి ఉన్నాయి. కాగా, బీజేపీ కూటమికి సీఎం అభ్యర్థిని ప్రకటించేనా, లేదా..? అన్నది వేచి చూడాల్సిందే. సీపీఎం, సీపీఐ, వీసీకే అభ్యర్థుల జాబితా: డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమిలోని సీపీఎం, సీపీఐ, వీసీకేలు సోమవారం తమ అభ్యర్థుల జాబితాల్ని ప్రకటించాయి. సీపీఎం 25 స్థానాలకు, సీపీఐ 25 స్థానాలకు ప్రకటించగా, 11 మందితో తొలి జాబితాను వీసీకే ప్రకటించింది. మలి జాబితాను మంగళవారం విడుదల చేయడానికి వీసీకే నేత తిరుమావళవన్ నిర్ణయించారు.

ఇక, ఈ కూటమిలోని తమిల మానిల కాంగ్రెస్ సైతం మంగళవారం జాబితను ప్రకటించనున్నది. కాగా,  ఈ కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్న డీఎండీకే 104, ఎండీఎంకే 26 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. సీపీఎం విడుదల చేసిన జాబితాలో పది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఏడుగురికి మళ్లీ అవకాశం కల్పించారు. దూరంగా పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సౌందరరాజన్ - పెరంబూరు, బాలకృష్ణన్- చిదంబరం, కె తంగ వేల్ - తిరుప్పూర్ దక్షిణం,  లాజర్ - పెరియకుళం, కె భీమ్ రావ్ - మదురవాయిల్,  రామమూర్తి - విక్రవాండి, విపి నాగై మల్లి - కీల్ వేలూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు.

ఇక, సీపీఐ విడుదల చేసిన జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం ఆర్ముగం - అవినాశి, గుణశేఖరన్ - శివగంగై,  కె ఉలగనాథన్ - తిరుత్తరై పూండి, లింగముత్తు - గుడియాత్తం, నంజప్పన్ - పెన్నాగరం, టి రామచంద్రన్ - తలి, సుందరం - భవానీ సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే, డిఎంకే అధినేత కరుణానిధి రేసులో ఉన్న తిరువారూర్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాసిలామణి రంగంలోకి దిగనున్నారు.  ఇక, వీసీకే 11 మందితో తొలి జాబితా విడుదల చేయగా, 14 స్థానాల అభ్యర్థుల జాబితాను మంగళవారానికి వాయిదా వేసింది.
 
పీఎంకే జాబితా : అన్భుమణి రాందాసు సీఎం అభ్యర్థిగా బరిలో దిగిన పీఎంకే ఇప్పటి వరకు 90 మంది అభ్యర్థులను ప్రకటించింది. 234 స్థానాల్లో పోటీ చేస్తున్న పీఎంకే మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తుల్లో మునిగి ఉన్నది. ఈ పరిస్థితుల్లో సోమవారం 117 మందితో నాలుగో జాబితాను ప్రకటించారు. మిగిలిన 27 స్థానాలకు మంగళవారం అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. తాజా జాబితాలో అన్భుమణి పెన్నగరం నుంచి పోటీ చేస్తుండగా, ఆ పార్టీ అధ్యక్షుడు జీకే మణి మెట్టూరు నుంచి బరిలోకి దిగనున్నారు. కాగా, డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ 41 స్థానాలకు గాను అభ్యర్థుల్ని మంగళ వారం సాయంత్రం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement