తెలుగుదేశం నేతల విడుదల | Sakshi
Sakshi News home page

తెలుగుదేశం నేతల విడుదల

Published Fri, Oct 16 2015 2:18 AM

తెలుగుదేశం నేతల విడుదల - Sakshi

విడిచిపెట్టిన మావోయిస్టులు.. పది రోజుల ఉత్కంఠకు తెర
జీకేవీధి: విశాఖ మన్యంలో 10 రోజుల ఉత్కంఠకు తెరపడింది. మావోయిస్టుల అదుపులో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం తెల్లవారుజామున క్షేమంగా ఊరు చేరుకున్నారు. మావోయిస్టుల నిర్బంధంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల కృషి ఫలించింది. దీంతో టీడీపీ నేతలైన ముక్కల మహేష్, మామిడి బాలయ్యపడాల్, వండ లం బాలయ్యలను మావోయిస్టులు క్షేమంగా విడిచిపెట్టారు.

ఈనెల 6వ తేదీన జీకేవీధి మండలం కొత్తూరు గ్రామం వద్ద టీడీపీ నేతలైన ముగ్గురు గిరిజనులను మావోయిస్టులు అపహరించిన సంగతి తెలిసిందే.  అదుపులో ఉన్న గిరిజన టీడీపీ నేతలకు ఎలాంటి హాని తల పెట్టవద్దని గిరిజన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, కుటుంబ సభ్యులు, అఖిలపక్షం నేతలు మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు.

ఇంతలో ఈనెల 13 లోగా ప్రభుత్వం బాక్సైట్‌పై ప్రకటన చెయ్యాలని, లేదంటే తమ అధీనంలో ఉన్న గిరిజన టీడీపీ నేతలను హతమారుస్తామంటూ మావోయిస్టులు అల్టిమేటం విధించారు. ఈ నేపథ్యంలో విశాఖకు వచ్చిన సీఎం చంద్రబాబు బాక్సైట్‌పై తమ ప్రభుత్వం ఇంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తన అభిప్రాయం వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు మావోయిస్టులు మానవతా దృక్పథంతో బుధవారం సాయంత్రం ఏవోబీ సరిహద్దు ప్రాంతమైన చిత్రకొండ అడవుల్లో టీడీపీ నేతలను సురక్షితంగా ఉపాధ్యాయ సంఘాలకు అప్పగించారు.
 
బాక్సైట్ జోలికొస్తే టీడీపీ అంతుచూస్తాం: మావోయిస్టు అగ్రనేతలు
బాక్సైట్ తవ్వకాలు చేపడితే టీడీపీ అంతు చూస్తామని మావోయిస్టు అగ్రనేతలు స్పష్టం చేశారు. ఏవోబీ సరిహద్దు చిత్రకొండ అడవు ల్లో బుధవారం సాయంత్రం వీరు ప్రజాకోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టు అగ్రనేతలు కైలాసం, ఆజాద్, నవీన్ గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. బాక్సైట్ తవ్వకాల వల్ల తాము జీవనాధారం కోల్పోతామని ప్రజాకోర్టులో  20 గ్రామాలకు చెందిన ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement