టీచర్ల నియామకాలు చేపట్టండి | Sakshi
Sakshi News home page

టీచర్ల నియామకాలు చేపట్టండి

Published Thu, Oct 29 2015 4:12 AM

టీచర్ల నియామకాలు చేపట్టండి - Sakshi

♦ ఆ మేరకు మూడు వారాల్లో చర్యలు చేపట్టండి
♦ తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం
♦ స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరతపై తీవ్ర అసంతృప్తి
 
 న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరతపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల నియామకాలు చేపట్టేందుకు మూడు వారాల్లో చర్యలు చేపట్టాలని స్పష్టంచేసింది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ పీసీ పంత్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశించింది. ‘‘రాష్ట్రంలో తాత్కాలిక ప్రాతిపదికన టీచర్లను నియమిస్తున్నారు. గ్రామాల్లోని స్కూళ్లలో టీచర్లు ఎందుకు ఉండరో మాకు అర్థం కావడం లేదు. మేం ఈ పరిస్థితులపై వ్యాఖ్యానించక తప్పడం లేదు. మేం మనసులో ఒకటి అనుకొని అది బయటకు చెప్పకపోతే కపటమే అవుతుంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమర్పించిన అఫిడవిట్‌ను పరిశీలించిన అనంతరం బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. అఫిడవిట్‌పైనా అసంతృప్తి వ్యక్తంచేసింది. గతంలో ఇంతకుముందు వెలువరించిన ఆదేశాలను పాటించలేదని పేర్కొంది. టీచర్లను నియమించి, పిల్లలకు విద్య అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న టీచర్లు కూడా ఉపాధ్యాయ ఎంపికలో పాల్గొనవచ్చని తెలిపింది. డిసెంబర్ 8న స్కూళ్లలో టాయిలెట్ల పరిస్థితిపై విచారణ చేపడతామని వెల్లడించింది.

Advertisement
Advertisement