బోధన.. వేదన | Sakshi
Sakshi News home page

బోధన.. వేదన

Published Mon, Aug 17 2015 3:32 AM

బోధన.. వేదన

ప్రభుత్వ డైట్, బీఎడ్ కాలేజీలలో అధ్యాపకుల కొరత
* ఉన్న కొద్దిమంది డిప్యుటేషన్లపై వచ్చినవారే..
* డిప్యూటీ ఈవో పోస్టుల్లో ఉన్న లెక్చరర్లు తిరిగి వెనక్కు

సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సును నిర్వహించే ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (డైట్), ప్రభుత్వ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కాలేజీలు అధ్యాపకుల్లేక అనాథలయ్యాయి. వాటిల్లో చదివే భవిష్యత్తు టీచర్లకు బోధించే వారు లేకుండాపోయారు. రిటైర్ అయిన వారి స్థానాల్లో కొత్త వారిని నియమించక.. నియామకాలు నిలిచిపోయాయి.. ఉన్న వారు డిప్యుటేషన్లపై వెళ్లడంతో ఉపాధ్యాయ విద్య తిరోగమనంలో పడింది.
 
ఇదిలా ఉంటే జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ (ఎన్‌సీటీఈ) ఉపాధ్యాయ విద్యలో అనేక సంస్కరణలు తెచ్చింది. బీఎడ్‌ను రెండేళ్ల కోర్సుగా మార్చింది. ఇంటర్నల్‌కు ప్రాధాన్యం పెంచింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ విద్యా కాలేజీల్లో నియామకాలు తప్పనిసరి అయ్యాయి. అందుకే విద్యాశాఖలో ఉప విద్యాధికారులుగా (డిప్యూటీ ఈవో) డిప్యుటేషన్లపై వెళ్లిన డైట్ లెక్చరర్లు, బీఎడ్ కాలేజీ లెక్చరర్లను వెనక్కి పంపించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత సంస్కరణల నేపథ్యంలో భారీ సంఖ్యలో లెక్చరర్ల నియామకాలు చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో ముందుగా డిప్యుటేషన్లపై వెళ్లిన వారిని వెనక్కి పంపించే ఆలోచనలు చేస్తోంది.

కాలేజీల్లో పాఠాలు చెప్పకుండా.. ఉప విద్యాధికారి పోస్టుల్లో ఉన్న వారందరిని కాలేజీలకు పంపించాలన్న యోచిస్తోంది. మరోవైపు డిప్యూటీ ఈవో పోస్టుల్లో జిల్లాల్లోని సీనియర్ హెడ్‌మాస్టర్లకు ప్రాధాన్యం ఇచ్చి నియమించాలన్న సర్కారు భావిస్తోంది. తద్వారా పాఠశాలల్లో పర్యవేక్షణ పెంచే దిశగా కసరత్తు చేస్తోంది.
 
80 శాతానికి పైగా ఖాళీలే
రాష్ట్రంలో 10 డైట్‌లు, 3 బీఎడ్ కాలేజీలు, ఒక ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (ఐఏఎస్‌ఈ) ఉన్నాయి. వాటిల్లో 375 మంజూరైన పోస్టులు ఉండగా, 77 పోస్టుల్లోనే అధ్యాపకులు ఉన్నారు. మరో 298 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. హైదరాబాద్‌లోని డైట్‌లో ప్రిన్సిపాల్ సహా 30 మంది అధ్యాపకులు పని చేయాల్సి ఉండగా ఒక్కరూ లేరు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, తాత్కాలిక సిబ్బందితోనే ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేశామనిపించేస్తున్నారు.
 
ఆదిలాబాద్ డైట్‌లో 24 మంది పని చేయాల్సి ఉండగా ఒక్కరూ లేరు. మెదక్ డైట్‌లో 30 మంది ఉండాల్సి ఉండగా కేవలం ముగ్గురే పని చేస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాలో అయితే ఐదుగురు చొప్పున అధ్యాపకులతో డైట్‌లు కొనసాగుతున్నాయి. నాగార్జునసాగర్‌లోని బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కాలేజీలో ఒక్కరే ఉండగా, మహబూబ్‌నగర్ బీఎడ్ కాలేజీలో నలుగురు, వరంగల్ బీఎడ్ కాలేజీలో ఆరుగురే రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు.

ఇక ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ విశ్వ విద్యాలయాల్లోని బీఎడ్ కాలేజీల్లోనూ పోస్టుల భర్తీని పట్టించుకున్న వారు లేరు. ప్రభుత్వ కాలేజీల్లో అధ్యాపకులు ఉన్నదే అరకొర కాగా.. అందులోనూ 19 మంది అధ్యాపకులు డిప్యూటీ ఈవో పోస్టుల్లో డిప్యూటేషన్లపై కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ డిప్యుటేషన్లను రద్దు చేసే దిశగా కసరత్తు ప్రభుత్వం ప్రారంభించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement