స్పెక్ట్రమ్ రిజర్వు ధర పెంపు | Sakshi
Sakshi News home page

స్పెక్ట్రమ్ రిజర్వు ధర పెంపు

Published Thu, Nov 7 2013 2:07 AM

Telecom panel for increase in spectrum price

న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ వేలానికి దేశవ్యాప్తంగా కనీస రిజర్వు ధరను పెంచుతూ టెలికమ్ కమిషన్ బుధవారం సిఫార్సు చేసింది. నియంత్రణ సంస్థ ట్రాయ్ అంతకుముందు నిర్ణయించిన ధరపై 15% పెంచుతూ టెలికమ్ కమిషన్ సిఫార్సులు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఢిల్లీ, ముంబై వంటి కీలక సర్కిళ్లలో మాత్రం రేటును 25% పెంచారు. ఇప్పుడు టెలికమ్ కమిషన్ ప్రతిపాదించిన ధరలు... గతంలో వేలానికి నిర్ధారించిన రిజర్వు ధరల కన్నా తక్కువే.1800 మెగాహెట్జ్, 900 మెగాహెట్జ్‌కు సంబంధించి స్పెక్ట్రమ్ ధర, విలీనాలు, కొనుగోళ్లపై తాము నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు ఈ విషయం సాధికార మంత్రుల కమిటీ పరిశీలనకు వెళుతుందని టెలికమ్ కార్యదర్శి ఎంఎఫ్ ఫరూఖి చెప్పారు. టెలికమ్ శాఖ మూడో విడత స్పెక్ట్రమ్ వేలాన్ని జనవరిలోగా నిర్వహించవచ్చని, వచ్చే మార్చిలోగా ప్రభుత్వం కనీసం రూ.11,000 కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఢిల్లీ సర్కిల్ 1800 మెగాహెట్జ్‌కు కొత్త బేస్ ధరను టెలికమ్ కమిషన్ రూ.218.90 కోట్లుగా, ముంబైకి రూ.206.74 కోట్లుగా సిఫార్సు చేసింది.

Advertisement
Advertisement