లండన్‌పై ఉగ్రపంజా | Sakshi
Sakshi News home page

లండన్‌పై ఉగ్రపంజా

Published Mon, Jun 5 2017 1:44 AM

లండన్‌పై ఉగ్రపంజా

► ఏడుగురు మృతి, 48 మందికి గాయాలు
►లండన్‌ బ్రిడ్జి వద్ద వ్యాన్‌తో ముష్కరుల బీభత్సం
►బోరో మార్కెట్‌లోకి చొచ్చుకెళ్లి కత్తులతో దాడి
►వారాంతాల్లో రద్దీగా ఉండే మార్కెటే లక్ష్యం
►ఒక యువతిపై ఏకంగా పదిహేనుసార్లు కత్తిపోట్లు
►భయభ్రాంతులతో చెల్లాచెదురై పారిపోయిన జనంl
►8 నిమిషాల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టిన పోలీసులు
►ఘటనను ఖండించిన థెరిసా మే, వివిధ దేశాధినేతలు
►మహిళ సహా 12 మంది అనుమానితుల అరెస్టు


లండన్‌: శనివారం.. రాత్రి 10 గంటలు.. వారాంతం కావడంతో లండన్‌ బ్రిడ్జి ప్రాంతం సందడిగా ఉంది.. చుట్టుపక్కల బార్లు, రెస్టారెంట్లన్నీ జనంతో కిక్కిరిశాయి.. మార్కెట్లు కళకళలాడుతున్నాయి.. ఇంతలో ఘోరం..! థేమ్స్‌ బ్రిడ్జిపై నుంచి ఓ వాహనం 80 కి.మీ. వేగంతో పాదచారులపైకి దూసుకొచ్చింది.. భయంతో అంతా తలోదిక్కు పారిపోయారు.. ఆ వాహనం నుంచి కత్తులతో దిగిన ముగ్గురు ముష్కరులు సమీపంలోని బోరో మార్కెట్‌లోకి దూసుకెళ్లారు.. ‘అల్లా కోసం.. ’ అంటూ ఉన్మాదంతో దొరికినవారిని దొరికినట్టు పీకలు కోశారు.. ఏడుగురిని బలి తీసుకున్నారు!

75 రోజుల్లో బ్రిటన్‌లో జరిగిన మూడో ఉగ్రదాడి ఇది!!
మొన్నటి మాంచెస్టర్‌ ఘటన మరవకముందే లండన్‌లో ముష్కర మూకలు రెచ్చిపోయాయి. శనివారం రాత్రి చారిత్రక లండన్‌ బ్రిడ్జి సమీపంలో, బోరో మార్కెట్‌పై పంజా విసిరాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా.. 48 మంది గాయాలపాలయ్యారు. జూన్‌ 8న బ్రిటన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ దాడి కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు 8 నిమిషాల్లోనే ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇంతవరకు ఈ దాడికి బాధ్యత ప్రకటించుకోలేదు. ఉగ్రదాడిపై బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇస్లామిక్‌ ఉగ్రవాదుల నీచమైన సిద్ధాంతమే ఈ ఘటనకు కారణమన్నారు. దేశంలో ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. భద్రతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేసిన మే పరిస్థితిని సమీక్షించారు. ఆదివారం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఎలా జరిగింది?
లండన్‌ బ్రిడ్జి సమీపంలోని బోరో మార్కెట్‌లో బార్లు, రెస్టారెంట్లు ఎక్కువగా ఉంటాయి. వారాంతం కావటంతో శనివారం రద్దీ ఎక్కువగా ఉంది. రాత్రి పది గంటల సమయంలో ఓ తెలుపురంగు వ్యాన్‌ థేమ్స్‌ నది మీదుగా లండన్‌ బ్రిడ్జి దాటగానే 80 కిలోమీటర్ల వేగంతో పాదచారులపైకి దూసుకెళ్లింది. అక్కడున్న వారంతా భయంతో తలోదిక్కు పారిపోయారు. ఇంతలో వాహనంలో నుంచి కత్తులతో దిగిన ఉగ్రవాదులు పక్కనున్న బోరో మార్కెట్‌లోకి పరుగెత్తుకుంటూ వెళ్లారు.

కంటబడిన వారందరిపై కత్తులతో దాడికి తెగబడ్డారు. ‘అల్లా కోసం’ అని గట్టిగా అరుస్తూ ఓ ఉగ్రవాది అక్కడున్న ఓ యువతిని 15సార్లు దారుణంగా పొడిచాడు. వీలైనంత ఎక్కువమందిని మట్టుబెట్టాలన్న ఉద్దేశంతో ముష్కరులు చెలరేగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బోరో మార్కెట్‌కు చేరుకున్నారు. ఉగ్రవాదులను గుర్తించి వెంటనే కాల్చి చంపారు. వారి వద్ద నకిలీ బెల్టుబాంబులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదుల దాడిలో గాయపడిన వారిలో ఓ బ్రిటిష్‌ ట్రాన్స్‌పోర్ట్‌ పోలీసు అధికారి, ఓ జర్నలిస్టు ఉన్నారు.

కారుతో ఢీకొట్టాలనుకున్నా..
తోటివారి పీకకోస్తున్న ఓ ఉగ్రవాదిని క్రిస్‌ అనే క్యాబ్‌ డ్రైవర్‌ చంపేందుకు యత్నించాడు. ‘‘లండన్‌ బ్రిడ్జిపైనుంచి ఓ వ్యాన్‌ వేగంగా జనాలపైకి దూసుకొచ్చింది. దీంతో చాలామంది భయంతో పారిపోగా కొందరికి గాయాలయ్యాయి. వ్యాన్‌లో నుంచి దిగిన ముగ్గురు వ్యక్తులు పొడవైన కత్తులు తీసుకుని బోరో మార్కెట్‌ వైపు వెళ్తూ.. కనబడినవారిపై దాడి చేస్తున్నారు. అందులో ఒకడిని కారుతో ఢీకొట్టి చంపాలనుకుని వేగంగా అతని వైపు కారు నడిపించాను. కానీ అతను తప్పించుకున్నాడు’’ అని క్రిస్‌ తెలిపాడు. ఉగ్రదాడిపై అప్రమత్తమైన లండన్‌ మెట్రోపాలిటన్‌ పోలీసులు థేమ్స్‌ నదిలోనూ బోట్లతో గాలింపులు జరిపారు. నగరమంతా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అటు స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఉగ్రదాడికి సంతాపసూచకంగా పార్లమెంట్‌ భవనం వద్ద బ్రిటన్‌ జాతీయ పతకాన్ని అవనతం చేశారు.

నన్ను వేదనకు గురిచేస్తోంది: మోదీ
న్యూఢిల్లీ: లండన్‌ లో ఉగ్రవాదులు దాడికి తెగబడటాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఆయన ఓ ట్వీట్‌ చేస్తూ ‘లండన్‌లో జరిగిన దాడులు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ఈ విషయం నన్ను వేదనకు గురిచేస్తోంది. మృతులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా లండన్‌ ఉగ్రదాడిని ఖండించారు. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపిన సోనియా... గాయపడినవారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

పోలీస్‌.. భేష్‌..!
శనివారం నాటి లండన్‌ దాడి ఘటనలో మెట్రోపాలిటన్‌ పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి 10.08 గంటలకు ఘటన గురించి తెలియగానే.. పోలీసులు వెంటనే బోరో మార్కెట్‌ చేరుకుని ఉగ్రవాదులను మట్టుబెట్టే పని ప్రారంభించారు. ఉగ్రవాదులను కనిపెట్టి వారిపై కాల్పులు జరిపారు. ఇదంతా కేవలం 8 నిమిషాల్లోనే జరిగింది. పోలీసులు రావటం ఆలస్యమై ఉంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేదని దాడి నుంచి బయటపడిన వారు తెలిపారు.

వందల ప్రాణాలు కాపాడిన బౌన్సర్లు
మూడు కత్తిపోట్లకు గురైన ఓ బాధితుడు ఉగ్రవాదులపైకి ప్లేట్లు, కుర్చీలు విసిరి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఓ మహిళ తీవ్రమైన రక్తస్రావంతో భయంతో అరుస్తూ బోరో మార్కెట్‌లోని పారిస్‌ బార్‌లోకి పరిగెత్తుకు వచ్చిం ది. చాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ ఫైనల్స్‌ను వీక్షిస్తున్న వారం తా ఆమె అరుపులకు భయపడ్డారు. ఆమె గొంతు కోసినట్లు గుర్తించిన బౌన్సర్లు ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే బార్‌ తలుపులు మూసి వందల మంది ప్రాణాలు కాపాడారు. మరింత మంది ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో బార్లు, క్లబ్బులు, రెస్టారెంట్లలోకి పోలీసులు ప్రవేశించి అందరినీ బల్లల కింద దాక్కోవాలని సూచించారు.

12 మంది అనుమానితుల అరెస్టు
ఉగ్ర ఘటనపై విచారణ వేగవంతం చేసిన పోలీసు లు, కౌంటర్‌–టెర్రరిస్టు బలగాలు.. బార్కింగ్‌ ప్రాంతం లో ఓ మహిళ సహా 12 మందిని అరెస్టు చేశాయి. బార్కింగ్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ అరెస్టు లు జరిగాయని బ్రిటీష్‌ కౌంటర్‌ టెర్రరిజం పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన గంటల్లోనే పోలీసులు అనుమానితులను పట్టుకున్నారు. నగరంలో మిగిలిన చోట్ల మరో 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని చోట్లా గాలింపు జరుగుతోందన్నారు. మరోవైపు ఉగ్రదాడి నేపథ్యంలో జూన్‌ 8న జరగాల్సిన బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి విరామం ఇవ్వాలని అధికార కన్జర్వేటివ్‌ పార్టీ, విపక్ష లేబర్‌ పార్టీ, స్కాటిష్‌ నేషనల్‌ పార్టీలు నిర్ణయించాయి. ఉగ్రదాడిలో గాయపడిన వారిలో విదేశీయులు ఉన్నట్లు తెలిసింది.

బ్రిటన్‌లో రెండేళ్లలో ఉగ్రదాడులు ఇవీ..
2017 జూన్‌ 3
లండన్‌ బ్రిడ్జి దగ్గర, అక్కడికి సమీపంలోని బోరో మార్కెట్‌ వద్ద జరిగిన దాడిలో ఏడుగురు మరణించగా 40 మంది గాయపడ్డారు.
2017 మే 22
మాంచెస్టర్‌లో పాప్‌ సింగర్‌ అరియానా గ్రాండే సంగీత విభావరి నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా, 116 మంది గాయపడ్డారు.
2017 మార్చి 22
బ్రిటిష్‌ పార్లమెంటు భవనం సమీపంలోని వెస్ట్‌మినిస్టర్‌ బ్రిడ్జి వద్ద ఓ దుండగుడు కారును పాదచారులపైకి పోనిచ్చి నలుగురిని పొట్టనబెట్టుకు న్నాడు. 40 మంది క్షతగాత్రులయ్యారు.
2016 జూన్‌ 16
బిర్ట్సాల్‌లో లేబర్‌ పార్టీ ఎంపీ జో కాక్స్‌ను తుపాకీతో కాల్చి, కత్తితో పొడిచి ఉగ్రవాదులు చంపేశారు.
2015 డిసెంబర్‌ 5
లీయ్‌టోన్‌స్టోన్‌ వద్ద ఓ ఉగ్రవాది ముగ్గురిని కత్తితో పొడిచాడు. ఒకరికి తీవ్రగాయాలు కాగా, ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ప్రపంచ నేతల సంఘీభావం
లండన్‌ ఉగ్ర దాడిని పలు దేశాల అధినేతలు ఖండించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటాల్లో బ్రిటన్‌ పక్షాన నిలుస్తామని జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘బ్రిటన్‌కు సాయంగా అమెరికా ఏం చేయగలదో అదంతా చేస్తాం. మీతో మేం ఉన్నాం’ అని  భరోసానిచ్చారు. రష్యా అధ్యక్షడు పుతిన్‌ దాడిని ఖండిస్తూ మృతులకు సంతాపం తెలిపారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు  మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో బ్రిటన్‌ పక్షాన నిలుస్తామని చెప్పారు. బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థనలు చేయాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ పిలుపునిచ్చారు.

నిషేధాన్ని సమర్థించుకున్న ట్రంప్‌
లండన్‌ ఉగ్ర దాడి నేపథ్యంలో వలస నిషేధ ఉత్తర్వులను ట్రంప్‌ సమర్థించుకున్నారు. ‘మనం స్మార్ట్‌గా, అప్రమత్తంగా, కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. కోర్టులు మన హక్కులను మనకు వెనక్కు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆరు ముస్లిం దేశాల వారిపై విధించిన నిషేధం మనల్ని భద్రతలో మరోమెట్టు పైన ఉంచుతుంది’ అని ట్రంప్‌ ట్వీటర్‌లో చెప్పుకొచ్చారు.

 

Advertisement
Advertisement