ఈ యాప్ ఉంటే మీ ప్రాణాలు నిలుస్తాయి! | Sakshi
Sakshi News home page

ఈ యాప్ ఉంటే మీ ప్రాణాలు నిలుస్తాయి!

Published Fri, Aug 12 2016 12:32 PM

The app that could save your life in a car crash

ప్రపంచంలో అత్యధికమందిని పొట్టనబెట్టుకుంటున్నది కాన్సర్ లాంటి మహమ్మారి వ్యాధులో.. అంతర్యుద్ధాలో కాదు.. కేవలం రోడ్డుప్రమాదాలే.. అంతర్జాతీయ రోడ్డు భద్రతా పార్ట్ నర్ షిప్ సంస్థ గణాంకాల ప్రకారం ప్రతి 30 సెకన్లకు ఒకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడుస్తుండగా.. రోజుకు 3,400 మంది, ఏడాదికి 12.5 లక్షలమంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.

ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) వెల్లడించిన గణాంకాలు ఇంకా ఆందోళనకు గురిచేసేవిగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డుప్రమాదాల్లో 90శాతం అల్ప, మధ్యతరగతి ఆదాయ (వెనుకబడిన) దేశాల్లోనే జరుగుతున్నాయి. మరి ఈ దేశాల్లో ప్రపంచంతో పోల్చుకుంటే 50శాతం వాహనాలు కూడా లేవు.

అంతర్జాతీయ రోడ్డు ప్రమాద అంచనా సంస్థ ప్రకారం కొన్ని దేశాల జీడీపీలో రోడ్డుప్రమాద విషాద ప్రభావం ఐదు శాతంగా ఉంటుంది. రోడ్డుప్రమాద మరణాల విషయంలో ఆఫ్రికా దేశాలు ముందువరుసలో ఉన్నాయి. డబ్ల్యుహెచ్ వో విడుదల చేసిన 2015 రోడ్డుభద్రతా నివేదికలో అత్యధిక మరణాలతో లిబియా (ప్రతి లక్షమందికి 73మంది) మొదటి స్థానంలో ఉండగా, థాయ్ లాండ్ (36), మలావి (35) తదుపరి స్థానాల్లో ఉన్నారు.

ఈ నేపథ్యంలో రోడ్డుప్రమాద మరణాలను గణనీయంగా తగ్గించే ఉద్దేశంతో యాప్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. 'క్రాష్ డిటెక్ట్' పేరిట జోహెన్నెస్ బర్గ్ కు చెందిన వ్యాపారవేత్త జాకో జెరిట్స్ దీనిని రూపొందించారు.

ఈ యాప్ యూజర్ వాహనం నడుపుతుండగా ఏదైనా అకస్మాత్తుగా కదలికలు సంభవిస్తే ప్రమాదం జరిగినా.. వాహనం తీవ్ర ఒడిదుడుకులకు లోనైనా ఆ విషయాన్ని యాప్ పసిగడుతుంది. ప్రమాదం సంభవిస్తే.. వెంటనే ప్రమాద స్థలిని తెలియజేయడమే కాకుండా, తనంత తానుగా ఎమర్జెన్సీ నంబర్ కు కాల్ చేసి సమాచారం అందిస్తుంది. అంతేకాకుండా సమీపంలో ఉన్న వైద్యకేంద్రానికి కూడా ఈ సమాచారాన్ని అందజేస్తుంది.

అలాగే ప్రమాదంలో వ్యక్తులకు జరిగిన గాయాల తీవ్రత, రక్తస్రావం తదితర వివరాలను కూడా ఈ యాప్ అందిస్తుంది. దీంతో వైద్యులు అప్రమత్తమై తగిన వైద్యచికిత్స పరికరాలతో ప్రమాద స్థలికి చేరుకోవచ్చు. ఇలా అత్యవసర సమాచారాన్ని అందించి రోడ్డుప్రమాద బాధితులకు సత్వర వైద్య సహాయం అందించడం, బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వీలైనంతగా సహకారం అందించడం ఈ యాప్ లక్ష్యం. దక్షిణాఫ్రికాలో గత ఏడాది లాంచ్ అయిన ఈ యాప్ కు ఇప్పుడిప్పుడు యూజర్లు పెరుగుతున్నారు. ఏడువేల మంది యూజర్లు ఈ యాప్ ను యాక్టివ్ గా వాడుతుండగా.. లక్షమందికిపైగా ఈ సేవలను విస్తరించాలని తమ కంపెనీ భావిస్తున్నదని 'క్రాష్ డిటెక్ట్' యాప్ స్థాపకుడు జాకో జెరిట్స్ చెప్తున్నారు.  

Advertisement
Advertisement