నలుగురి పై అభ్యంతరాలు... | Sakshi
Sakshi News home page

నలుగురి పై అభ్యంతరాలు...

Published Mon, Mar 24 2014 2:53 AM

నలుగురి పై అభ్యంతరాలు... - Sakshi

15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనా వ్యతిరేకత
 కొత్తముఖాలకోసం వేట... బీసీలకు పెద్దపీట.
 కేంద్ర ఎన్నికల కమిటీదే తుది నిర్ణయం
 యువతకు, మహిళలకూ సీట్ల కేటాయింపు
 28న తొలిజాబితా.. 30న తుది జాబితా   
 3వ తేదీ తర్వాత సీమాంధ్ర జాబితా
 పొత్తులపై తలుపులు తెరిచే ఉన్నాయి: దిగ్విజయ్
 
 సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల వడపోతలో సిట్టింగ్‌లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నలుగురు ఎంపీల పనితీరుపై అసంతృప్తి ఉండడంతో, వారి గెలుపుపై అనుమానాలున్న కారణంగా వారి అభ్యర్థిత్వాలకు స్క్రీనింగ్ కమిటీ ఏకగ్రీవ ఆమోదం తెలపనట్టు సమాచారం. వీరి సీట్ల ఖరారుపై కేంద్ర ఎన్నికల కమిటీ ఈ నెల 26 న తుది నిర్ణయం తీసుకోనుంది.
 
 అలాగే, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో దాదాపు 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అధిష్టానం సంతృప్తికరంగా లేదు. ఈ నియోజకవర్గాల్లో కొత్తవారికి, బీసీలకు, యువకులకు, మహిళలకు స్థానం కల్పించాలని స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. కాగా, లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల వడపోత దాదాపు పూర్తయింది. ఇంకా పది శాతం సీట్ల విషయంలోనే తుదినిర్ణయం తీసుకోలేదు. ఒక్కోస్థానానికి కనిష్టంగా ఒకటి, గరిష్టంగా మూడు పేర్లను సూచిస్తూ స్క్రీనింగ్ క మిటీ తుదిజాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) పరిశీలనకు పంపుతుంది.

వయలార్ రవి నేతృత్వంలోని ఈ కమిటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్, మరో ఇన్‌ఛార్జి కుంతియా శని, ఆదివారాల్లో ప్రాథమిక వడపోత పూర్తిచేశారు. లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యుల నుంచి విడివిడిగా అభిప్రాయాలు తీసుకున్నారు. వీటిపై పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహతో కూడా చర్చించి సీఈసీకి ఇవ్వాల్సిన జాబితాను ఖరారుచేశారు. 26న సీఈసీ సమావేశమై తుది జాబితాను సోనియాగాంధీ,  రాహుల్‌గాంధీ ఆమోదానికి పంపుతుంది. ఈనెల 28న తొలి జాబితా, 30న తుది జాబితా వెలువడుతుందని స్క్రీనింగ్ కమిటీ సమావేశం అనంతరం దిగ్విజయ్‌సింగ్ మీడియాకు వెల్లడించారు.
 
 సిట్టింగ్‌లపై అసంతృప్తి..
 సిట్టింగ్ ఎంపీల్లో ప్రధానంగా  నలుగురిఅభ్యర్థ్థిత్వాలపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత నిర్వహించిన సర్వేల్లో వీరు వెనుకబడి ఉన్నట్టు తేలింది. వీరంతా తెలంగాణ ఉద్యమంలో ముందుండి పనిచేసి కాంగ్రెస్ ఉనికిని కాపాడారన్న సానుభూతి మినహా ఇతర విషయాల్లో వీరు వెనుకబడినట్టు అధిష్టానం వద్ద సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలోని ఓ ఎంపీపై టీఆర్‌ఎస్ నుంచి గట్టి అభ్యర్థి పోటీ చేస్తుండడంతో అక్కడ ఆయన గెలుపుపై అనుమానాలు ఉన్నాయి. ఉద్యమంలో చాలా చురుగ్గా పనిచేశారన్న సానుభూతి ఉండడంతో ఆయనను పొరుగు జిల్లా నుంచి లోక్‌సభకు గానీ, శాసనసభకు గానీ పోటీచేయించాలని అధిష్టానం భావిస్తోంది.
 
 
 ఇక దక్షిణ తెలంగాణకు చెందిన మరో ఎంపీ ఇటీవల పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేశారని సొంత పార్టీ నేతలే ఫిర్యాదులు చేయడంతో ఆయన విషయంలో తుది నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలిపెట్టినట్టు తెలుస్తోంది. ఇక రాజధానికి అనుకుని ఉన్న మరో సిట్టింగ్ ఎంపీకి తన నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత ఎదురవడంపై చర్చ జరిగింది. ఈ ఎంపీని కూడా శాసనసభ నుంచి పోటీచేయించాలని స్క్రీనింగ్ కమిటీ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. రాజధాని పొరుగున ఉన్న ఓ జిల్లాకు చెందిన ఎంపీపై కూడా స్థానికంగా వ్యతిరేకత ఉందని అధిష్టానం వద్ద సమాచారం ఉంది. ఈయనను శాసనసభకు పోటీచేయించే అవకాశాలున్నాయి. అయితే సిట్టింగ్ ఎంపీల విషయంలో సోనియాదే తుది నిర్ణయమని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
 
 ఎవరెక్కడ నుంచి పోటీ ?
 కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ నుంచి పోటీచేస్తారా? లేక సిట్టింగ్ స్థానమైన చేవెళ్ల నుంచి పోటీచేస్తారా? అనే నిర్ణయాన్ని ఆయనకే వదిలేసినట్టు తెలిసింది. ఒకవేళ చేవెళ్ల వద్దనుకుంటే. అక్కడినుంచి సబితాఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి పోటీచేయాలని భావిస్తున్నప్పటికీ ఆయనకు హామీ లభించలేదని తెలుస్తోంది.
 
 
  ఇక్కడి నుంచి మర్రి శశిధర్‌రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఇక మెదక్‌కు విజయశాంతి, కరీంనగర్‌కు పొన్నం ప్రభాకర్, నిజామాబాద్‌కు మధుయాష్కీగౌడ్, మహబూబాబాద్‌కు పోరిక బలరాం నాయక్, సికింద్రాబాద్‌కు అంజన్‌కుమార్‌యాదవ్ పేర్లు ఒక్కొక్కటే ప్రతిపాదించినట్టు తెలిసింది.  
 
 ఎమ్మెల్యేల్లోనూ ఇదే పరిస్థితి..
 తెలంగాణ ప్రాంతంలో 49 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు,సీనియర్లు,మాజీ మంత్రుల పేర్లతో కలిసి మొత్తం 70 నియోజకవర్గాలకు ఒక్కొక్కరి పేర్లనే సిఫారసు చేసినట్టు తెలిసింది. అయితే, మిగిలిన నియోజకవర్గాల్లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అనేక ఫిర్యాదులు, అసంతృప్తి, విజయావకాశాలపై అనుమానాలు ఉన్నాయి. అధికారంలోకి మళ్లీ రావాలంటే కొందరిని మార్చకతప్పదని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయానికి వచ్చింది. మొత్తం 10 నుంచి 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాలు సందేహాస్పదంగా ఉన్నాయి.  వీరి స్థానంలో యువకులు, మహిళలకు అవకాశాలు దక్కనున్నాయని పీసీసీలో ఓ కీలక నేత ‘సాక్షి’కి తెలిపారు.
 
 
  విశ్వసనీయ సమాచారం మేరకు ఒకే పేరు వెళ్లిన జాబితాలో ఉన్నవారిలో సిట్టింగుల్లో గద్వాల-డి.కె.అరుణ, నిర్మల్-మహేశ్వర్‌రెడ్డి, బోధన్-సుదర్శన్‌రెడ్డి, మంథని-డి.శ్రీధర్‌బాబు, మానకొండూరు-ఆరెపల్లి మోహన్, హుస్నాబాద్-ఎ.ప్రవీణ్‌రెడ్డి , ఆంధోల్-దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి-తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, పటాన్‌చెరు-టి.న ందీశ్వర్‌గౌడ్, దుబ్బాక-సి.హెచ్.ముత్యంరెడ్డి, మల్కాజిగిరి-ఆకుల రాజేందర్, ఎల్బీనగర్-సుధీర్‌రెడ్డి, వికారాబాద్-ప్రసాద్‌కుమార్, ఖైరతాబాద్-డి.నాగేందర్, జూబ్లీహిల్స్-విష్ణువర్ధన్‌రెడ్డి పేర్లు ఉన్నాయి. హుజూర్‌నగర్-ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సూర్యాపేట-ఆర్.దామోదర్‌రెడ్డి, నల్లగొండ-కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాగార్జునసాగర్-కె.జానారెడ్డి, ఆలేరు-భిక్షమయ్యగౌడ్,  వరంగల్ ఈస్ట్-బసవరాజు సారయ్య, భూపాలపల్లి-గండ్ర వెంకటరమణారెడ్డి, పాలేరు-రాంరెడ్డి వెంకటరెడ్డి, మధిర-మల్లు భట్టివిక్రమార్క పేర్లు వెళ్లాయి.
 
 పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా జనగామ నుంచే పోటీచేస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పులు చోటుచేసుకుంటే తప్ప తుది జాబితాలో వీరి పేర్లే ఉండనున్నాయి. ఇక మాజీలుగా ఉన్న సీనియర్లు కె.ఆర్.సురేశ్‌కుమార్‌రెడ్డి-ఆర్మూర్, జీవన్‌రెడ్డి-జగిత్యాల, డి.శ్రీనివాస్-నిజామాబాద్‌రూరల్, తదితరుల పేర్లు కూడా జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ పేరు కూకట్‌పల్లి నియోజకవర్గానికీ పరిశీలనలో వచ్చినట్టు తెలుస్తోంది.
 
 భువనగిరి సీటుపై సందేహాలొద్దు: రాజగోపాల్‌రెడ్డి
 సాక్షి, హైదరాబాద్: భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.ఆదివారం తనను కలసిన కార్యకర్తలు, అభిమానులతో ఆయన మాట్లాడుతూ... సిట్టింగ్ ఎంపీలందరికీ తిరిగి అవే స్థానాలు దక్కుతాయని, కొందరు అడ్డదారిలో వచ్చే ప్రయత్నం చేసినా, వారి ఎత్తులు సోనియా,రాహుల్ గాంధీ ముందు సాగవని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో కొందరు నాయకులు తమను ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదనిచెప్పారు.
 

Advertisement
Advertisement