తొలి విడత 5 యార్డుల్లో నామ్ అమలు | Sakshi
Sakshi News home page

తొలి విడత 5 యార్డుల్లో నామ్ అమలు

Published Fri, Mar 25 2016 1:13 AM

The first phase of the implementation of the 5 yards Nam

ఏప్రిల్ 14న ప్రయోగాత్మకంగా పథకం ప్రారంభం... నామ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 44 యార్డులు ఎంపిక
సన్నాహాలను సమీక్షించిన కేంద్ర మార్కెటింగ్ అధికారులు

 

హైదరాబాద్: జాతీయ వ్యవసాయ మార్కెట్ పథకం (నామ్)లో చేరేందుకు సమ్మతించిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలి విడతల్లో ఐదు మార్కెట్ యార్డుల్లో ఈ పథకం ప్రయోగాత్మక అమలుకు సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం వంద వ్యవసాయ మార్కెట్ యార్డులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా.. వీటిలో రాష్ట్రానికి సంబంధించి 44 యార్డులు ఉన్నాయి. రైతులు తాము పండించిన పంటను ఆన్‌లైన్ విధానంలో బేరసారాలు ఆడి అమ్ముకోవడమే నామ్ పథకం ఉద్దేశం. ఏప్రిల్ 14న దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ ఈ పథకానికి శ్రీకారం చుడుతుండటంతో.. అదేరోజు రాష్ట్రం లోనూ ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. తొలి విడతలో మలక్‌పేటలో మిరప, వరంగల్, బాదేపల్లిలో మొక్కజొన్న, తిరుమలగిరిలో వరి, నిజామాబాద్‌లో పసుపును ఈ పోర్టల్ ట్రేడింగ్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేస్తారు. ఐదు యార్డుల్లో ప్రయోగాత్మక ప్రారంభానికి సం బంధించిన ఏర్పాట్లపై కేంద్ర ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్, మార్కెటింగ్ డైరక్టర్ డాక్టర్ శరత్, అదనపు డెరైక్టర్ లక్ష్మిబాయి, సంబంధిత మార్కెటింగ్ శాఖ కార్యదర్శులతో గురువారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు.


వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో.. నామ్ అమలుకు వీలుగా ఐదు యార్డుల్లో ఉన్న మౌలిక సౌకర్యాలపై సమీక్ష జరిగింది. వారంలోగా వీటిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కాగా.. ఈ- పోర్టల్ ట్రేడింగ్‌కు వీలు గా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కేంద్రం ఆమోదించింది. 44 వ్యవసాయ మార్కెట్‌యార్డులకు రూ.12.16 కోట్లు విడుదల చేసింది. నామ్ పథకంలో భాగంగా మార్కెట్ కమిటీల అనుసంధానానికి అవసరమైన సాఫ్ట్‌వేర్ రూపకల్పన, అభివృద్ధి, అమలు, నిర్వహణ బాధ్యతను నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది.

Advertisement
Advertisement