Sakshi News home page

ఇరకాటంలో చిత్రపరిశ్రమ!

Published Mon, Jul 3 2017 2:23 PM

ఇరకాటంలో చిత్రపరిశ్రమ! - Sakshi

  • తమిళనాడులో కొనసాగుతున్న థియేటర్ల బంద్‌
  • జీఎస్టీపై ముక్తకంఠంతో సాగాలంటున్న కమల్‌ హాసన్‌

  • చెన్నై: తాజాగా అమల్లోకి వచ్చిన వస్తు, సేవా పన్ను (జీఎస్టీ)తో తమిళ చిత్ర పరిశ్రమను ఇరకాటంలో పడింది. జీఎస్టీతోపాటు తమిళనాడు ప్రభుత్వ వినోద పన్ను కూడా వసూలు చేస్తుండటంతో థియేటర్లు మూతపడే పరిస్థితికి వచ్చాయి. సోమవారం నుంచి 1050 థియేటర్లు బంద్‌ పాటిస్తున్నట్టు థియేటర్ యాజమాన సంఘాలు ప్రకటించాయి. దీంతో తమిళ నిర్మాతల మండలి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

    థియేటర్‌ యజమానుల నిర్ణయంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. దీంతో నిర్మాతల మండలి పరిష్కారానికి రంగంలోకి దిగింది. నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ సినిమాటోగ్రఫి మంత్రి కడంబూర్ రాజుతో భేటీ అయి.. ప్రభుత్వ వినోద పన్నును మినహాయించాలని కోరారు. కానీ.. ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు.

    అయితే, థియేటర్‌ యాజమాన్య సంఘాలు తమ బంద్‌ను ఉపసంహరించుకోవాలని, దీనిపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం కనుగొంటామని నిర్మాతల మండలి విజ్ఞప్తి చేసింది. సినిమాలపై జీఎస్టీ 28 శాతం వరకు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం వినోదపు పన్ను పేరుతో 30 శాతం పన్నులను విధిస్తోంది. దీంతో వచ్చే వంద రూపాయిల్లో 58 శాతం పన్నులకుపోగా మిగిలిన 42 శాతం అటు థియేటర్లు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు పంచుకునే పరిస్థితి ఏర్పడింది. ఇదే అమలైతే థియేటర్లలో టికెట్ల ధరలను పెంచాల్సివుంటుంది. సినిమా పరిశ్రమపై ఆధారపడే ప్రతి ఒక్కరూ జీఎస్టీ బాదుడుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని దర్శకనిర్మాతలు కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కరానికి సినీ పరిశ్రమ అంత ముక్తకంఠంతో స్పందించాలని, ఒకే వాదన వినిపించాలని సినీ నటుడు కమల్‌ హాసన్‌ కోరారు.
     

Advertisement
Advertisement