మంచి సంకేతాలే ఉన్నాయ్..! | Sakshi
Sakshi News home page

మంచి సంకేతాలే ఉన్నాయ్..!

Published Wed, Feb 25 2015 12:37 AM

మంచి సంకేతాలే ఉన్నాయ్..! - Sakshi

సామాన్యుడి నుంచి పారిశ్రామిక వర్గాల  వరకూ కేంద్ర బడ్జెట్‌పై ఎన్నో ఆశలు ఉంటాయి. అయితే బడ్జెట్ వెలువడేంతవరకూ దీనిపైన అందరికీ సస్పెన్సే.  అయితే రానున్న బడ్జెట్‌పై ఆర్థిక, వాణిజ్యశాఖ మంత్రులు తదితర మంత్రిత్వశాఖల నుంచి వివిధ సందర్భాల్లో పలు కీలక సంకేతాలు వెలువడుతుండడం సహజం. 2015-16 బడ్జెట్‌కు సంబంధించి అలా వచ్చిన సంకేతాల్లో కొన్ని...
 
 ఉపాధి సృష్టి...పెట్టుబడుల ఆకర్షణ...
  దేశంలోని అన్ని వర్గాల వారికీ తగిన ప్రయోజనాలను అందించడానికి బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉంటాయి. ముఖ్యంగా భారత్ వృద్ధిలో యువత కీలకపాత్ర ఉంటుంది.  వీరికి ప్రయోజనకరమైన ప్రతిపాదనలపై  కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. అలాగే నైపుణ్యత పెంపు, ఉపాధి అవకాశాల సృష్టి ప్రధాన ధ్యేయం.
  అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణకు తగిన చర్యలు ఉంటాయి.  ఆర్థిక క్రమశిక్షణకు, ఇన్‌ఫ్రాలో పెట్టుబడులకు.. తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు చర్యలు.
  ఆదాయం పెంచుకోవడం కోసం అధిక పన్నులు వడ్డించడానికి మేము వ్యతిరేకం.  దానికి బదులుగా డిమాండ్, వృద్ధికి ఊతమిచ్చేలా కొనుగోలుదారుల చేతుల్లో మరింత డబ్బు ఆడేలా చూడాలన్నది మా అభిమతం.
  ఎటువంటి లొసుగులూ, లోపాలు లేని విధంగా క్రమంగా సబ్సిడీలను హేతుబద్ద్ధీకరించాల్సిన అవసరం ఉంది.  ఎల్‌పీజీ సబ్సిడీ బ్యాంకుల ద్వారా అందేలా చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.  ఇదే తరహాలో సాధ్యమైనంత వరకూ సబ్సిడీల విధానం అమలుకు ప్రయత్నం ఉంటుంది.
  మౌలిక, రంగంపై ప్రభుత్వ వ్యయాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.   పీపీపీ విధానానికి చికిత్స.
  గ్రామీణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు వల్ల భూముల ధరలు పెరుగుతాయి. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.
  విద్యుత్, ఇంధనం, రైల్వేలు, పోర్టుల విభాగాల్లో భారీ సంస్కరణలపై కేంద్రం దృష్టి పెడుతుంది. ఆయా రంగాల్లో ప్రభుత్వ వ్యయాలు మరింత పెంచుతాం.
  స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటు లక్ష్యం 4.1 శాతానికి కట్టుబడి ఉన్నాం.
 - అరుణ్ జైట్లీ, ఆర్థికమంత్రి
 
 డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం... 43,000 కోట్లు!
 పెట్టుబడుల ఉపసంహరణల (డిజిన్వెస్ట్‌మెంట్) లక్ష్యం వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16) కూడా ఇంచుమించు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. 2014-15 బడ్జెట్ లక్ష్యం రూ.43,425 కోట్లుకాగా, 2015-16లో దాదాపు రూ.43,000 కోట్లుగా ఉండవచ్చు.  మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిర్దేశిస్తున్న విధంగా ప్రతి లిస్టెడ్ కంపెనీలో కనీసం 25 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉండాలి. ఈ నేపథ్యంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా భారీగా నిధుల సమీకరణకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది.  25 శాతంకంటే తక్కువ పబ్లిక్ హోల్డింగ్ ఉన్న లిస్టెడ్ ప్రభుత్వ రంగ కంపెనీలు దాదాపు 30 ఉన్నాయి.  
 - అధికార వర్గాల కథనం
 
 పసిడి దిగుమతులపై సుంకాల కోత!
 కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పూర్తి అదుపులో ఉన్న నేపథ్యంలో పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం రానున్న బడ్జెట్‌లో  2 నుంచి 4 శాతం వరకూ తగ్గించే అవకాశం ఉంది. ( దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్యం విలువ మధ్య నికర వ్యత్యాసమే  క్యాడ్) దేశంలో రత్నాలు, ఆభరణాల తయారీ విభాగం వృద్ధికి, ఎగుమతులు పెరగడం లక్ష్యంగా కేంద్రం దిగుమతి సుంకాల తగ్గింపు నిర్ణయం తీసుకోనుంది. దాదాపు 35 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద అత్యంత ప్రాముఖ్యత కలిగిన రంగాలుగా గుర్తించిన 25 విభాగాల్లో రత్నాలు, ఆభరణాల రంగం కూడా ఒకటి.
 - వాణిజ్య శాఖ వర్గాలు
 
 జన్ ధన్ తరువాత... సాంప్రదాయేతర ఇంధనం...
 ప్రజలందరినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడానికి చేపట్టిన జన్ ధన్ యోజన విజయవంతం అయిన నేపథ్యంలో ఇకపై కేంద్రం సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగం అభివృద్ధిపై దృష్టి సారించనుంది.  ప్రతి ఇల్లు, పరిశ్రమ, వాణిజ్య సంస్థకు నిరంతర విద్యుత్ సరఫరా ప్రభుత్వ లక్ష్యం.  ఈ విషయంలో సాంప్రదాయేతర ఇంధన వనరులపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టిపెడుతుంది.
 -  పియూష్ గోయల్, విద్యుత్, బొగ్గు శాఖ మంత్రి
 
 పీపీఎఫ్ లాకిన్ ిపీరియడ్ పెంపు...
 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అకౌంట్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ ఉపసంహరణకు కనీస కాలపరిమితి (లాకిన్ ిపీరియడ్) పెంచాలన్న ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం ఈ కాలపరిమితి ఆరేళ్లు. దీనిని ఎనిమిదేళ్లకు పెంచే ప్రతిపాదన పరిశీలన లో ఉంది.  పీపీఎఫ్ పెట్టుబడి మెచ్యూరిటీ కాల పరిమితిని ప్రస్తుత 15 ఏళ్ల నుంచి మరింత పెంచే ప్రతిపాదన కూడా  ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదనల్లో ఉంది.    
 - ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాల సమాచారం
 
 చిన్న పరిశ్రమలకు రుణాలపై దృష్టి...
 చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ లభ్యతపై కేంద్రం మరింత దృష్టి సారిస్తుంది. 2015-16 బడ్జెట్ ఒక మంచి బడ్జెట్‌గా ఉండబోతోంది.
 - నిర్మలా సీతారామన్,
 వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి
 
 మ్యాట్ తగ్గింపు...
 ప్రస్తుతం 32.45 శాతం(సర్‌చార్జీలు, ఇతర సెస్సులు కలుపుకొని)గా ఉన్న కార్పొరేట్ ట్యాక్స్‌ను 25 శాతానికి, 18.5 శాతంగా ఉన్న కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్)ను 10 శాతానికి తగ్గించాలని డిమాండ్ ఉంది. ఈ దిశలో ఎంతో కొంత సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రత్యేక ఆర్థిక జోన్లను ప్రోత్సహించడానికీ చర్యలు ఉండవచ్చు. ముఖ్యంగా పలు సంస్థలు తమ సెజ్‌లను సరెండర్ చేస్తున్న పరిస్థితులను కేంద్రం జాగ్రత్తగా పరిశీలిస్తోంది.  మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ (ఎంఏటీ), డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) వంటి అంశాలు సెజ్‌లకు విఘాతంగా మారుతున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 - కార్పొరేట్ మంత్రిత్వశాఖ వర్గాలు

Advertisement
Advertisement