ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన పరిపాలన: వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన పరిపాలన: వైఎస్ జగన్

Published Thu, Jul 10 2014 7:07 PM

ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన పరిపాలన: వైఎస్ జగన్ - Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పరిపాలన కొనసాగుతుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ నెల 3,4 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్ చైర్మన్ల, మండలపరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీ నేతలు అరాచకాలు సృష్టించారని ఆయన విమర్శించారు. గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన వైఎస్ జగన్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ అమానుషంగా దాడికి పాల్పడిందన్నారు.

 

టీడీపీ చేసిన దాడిలో వెనుకబడినవారు, మహిళలు అధికంగా గాయపడ్డారన్నారు. సర్కారు ఏర్పడిన నెలరోజుల్లోనే 17 మంది వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను హతమార్చడం, 119 మందిని తీవ్రంగా గాయపర్చడం బాధాకరమన్నారు. ఇటీవల మున్సిపల్ చైర్మన్ల, మండలపరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు ఫోన్ చేసి ప్రలోభాలకు గురి చేయడం చాలా సిగ్గుచేటన్నారు. ఇప్పటికే ఈ ఉదంతాలపై గవర్నర్ నరసింహన్ కు నివేదిక అందించడమే కాకుండా , రాష్ట్రపతికి కూడా వివరించామని జగన్ తెలిపారు. దీనిపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు. ఇప్పటికే టీడీపీ ఆగడాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా జగన్ తెలిపారు.

Advertisement
Advertisement