అక్రమ సంబంధాల గుట్టువిప్పిన హ్యాకర్లు | Sakshi
Sakshi News home page

అక్రమ సంబంధాల గుట్టువిప్పిన హ్యాకర్లు

Published Fri, Jul 24 2015 7:18 AM

అక్రమ సంబంధాల గుట్టువిప్పిన హ్యాకర్లు

న్యూయార్క్: వివాహేతర సంబంధాల కోసమే వెలసిన ‘ఆశ్లే మాడిసన్’ అనే ఓ ఆన్‌లైన్ డేటింగ్ సైట్‌పై హ్యాకర్లు దాడి చేయడంతో ఈ సైట్ ద్వారా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నవారి గుట్టు కాస్త రట్టయింది. దీంతో కొంత మంది కొంప కొల్లేరుకాగా, వందలాది మంది సంబంధాలు ఒక్కసారిగా కుప్పకూలి పోయాయి. ఇలా సంబంధాలు కుప్పకూలిపోయిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కోకథ. వారా కథలను ‘విష్పర్’ అనే యాప్ ద్వారా బయటపెట్టి లబోదిబోమంటున్నారు.

‘నా ప్రేయసిని నేను కోల్పోయాను. నా ఇల్లు కూడా పోయింది. పిల్లలకు కూడా మొహం చూపించలేక పోతున్నాను’ ఇది ఒకరి కథ. ‘నా ప్రపంచం ఒక్కసారిగా తలకిందులై పోయింది. సమాజంతో మొహం ఎత్తుకోలేక పోతున్నా’ ఇది మరొకరి బాధ. ‘నేను ఛీట్ చేశాను. కానీ నేను దొరకలేదు. మరొకరితో రాసక్రీడలు సాగిస్తున్న నా ప్రేయసి దొరికి పోయింది. అయినా ఆమెను క్షమించేశాను. అయినా ఆమె నన్ను విడిచి మరొకరితో వెళ్లి పోయింది’ ఇది ఇంకొకరి ఆవేదన.

‘నా మనసంతా కకావికలమైంది. గుట్టు చప్పుడు కాకుండా మరొకరితో సాగిస్తున్న సంబంధాలను ఇంకేమాత్రం భరించలేను’ ఇది మరొకరి రియాక్షన్. ‘నేను చేసిన ఛీటింగ్‌కు క్షమించమని వేడుకున్నా. అయినా నా ప్రేయసి నన్ను కాదని వెళ్లి పోయింది’....ఇలాంటి సీరియస్ కథలేకాకుండా. ప్రతీకార ప్రతిస్పందనలు కూడా ఉన్నాయి. ‘నేను ఆయన కోసం షాపింగ్ చేస్తుంటే అక్కడ మరో యువతితో కులుకుతాడా? అందుకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం నేనూ మరో యువకుడితో రాత్రి గడిపాను’ లాంటి వ్యాఖ్యలు కూడా విష్పర్‌లో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.

ఆన్‌లైన్ డేటింగ్ సైట్‌ను అర్జంట్‌గా మూసివేయకపోతే తమ దాడులను ఇలాగే కొనసాగిస్తామని, గుట్టుచప్పుడు కాకుండా నెరపుతున్న వివాహేతర సంబంధాలను రట్టుచేసి రచ్చ చేస్తామని కూడా ‘ఆశ్లే మాడిసన్’ సైట్ సీఈవోను హ్యాకర్లు హెచ్చరించారు. 2012లో ప్రారంభమైన ‘విష్పర్’ను కూడా ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఉన్నారు. ముఖ్యంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినీ విద్యార్థులు దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. పేరు, ఊరు, ఫోన్ నెంబర్ లేకుండా గ్రీటింగ్ కార్డుల రూపంలో యూజర్లు ఈ యాప్ ద్వారా తమ సందేశాలను పంపించే వీలుంది.

Advertisement
Advertisement